Begin typing your search above and press return to search.

శ్రీలంక పరిస్ధితికి ఏపీకి సంబంధమేంటి ?

By:  Tupaki Desk   |   13 April 2022 5:08 AM GMT
శ్రీలంక పరిస్ధితికి ఏపీకి సంబంధమేంటి ?
X
చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళు తరచు ఒక వ్యాఖ్య చేస్తున్నారు. తొందరలోనే ఏపీ పరిస్దితి కూడా శ్రీలంకలో పరిస్ధితిలాగ అయిపోతుందనేది వారి కామెంట్లు. నిజానికి శ్రీలంకలో పరిస్ధితికి ఏపీలో పరిస్ధితికి అసలేమైనా సంబంధముందా అనేది చాలా కీలకమైనది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఆలోచిస్తుంటే శ్రీలంకలో ప్రస్తుత పరిస్ధితికి రాష్ట్రంలో పరిస్ధితికి ఎలాంటి సంబంధంలేదు. అసలు పోలిక కూడా సాధ్యంకాదు.

ఎందుకంటే శ్రీలంక అనేది ఒకదేశమైతే ఏపీ అనేది అతిపెద్ద భారతదేశంలో ఒక రాష్ట్రం మాత్రమే. శ్రీలంకలో అధ్యక్షుడు, అక్కడి ప్రభుత్వం తీసుకున్న అసంబద్దమైన నిర్ణయాల వల్ల ఇలాగ తయారైంది. శ్రీలంక ప్రస్తుత పరిస్దితికి దశాబ్దాల పాటు జరిగిన అంతర్యుద్ధం, జాతుల మధ్య వైరం, మితిమీరి చేసిన అప్పులు, అత్యధిక వడ్డీలకు తీసుకొచ్చిన ప్రైవేటు అప్పులు, వ్యవసాయ రంగం విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కరోనా వైరస్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పర్యాటక రంగం, తగ్గిపోయిన ఎగుమతులు, పెరిగిపోయిన దిగుమతుల్లాంటి అనేక కారణాలున్నాయి.

పైన చెప్పిన కారణాల్లో ఏ ఒక్కటి కూడా ఏపీతో పోలిక తెచ్చేందుకు లేదు. ఎందుకంటే ఏపీ మితిమీరిన అప్పులు చేస్తే కంట్రోల్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో పరిస్ధితులు చేయిదాటిపోతున్నాయని అనుకుంటే వెంటనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. కాబట్టి శ్రీలంక పరిస్ధితికి ఏపి పరిస్ధితికి అసలు సంబంధమే లేదు.

వాస్తవాలు మాట్లాడుకుంటే చంద్రబాబుది అయినా జగన్ ది అయినా ఒకటే పాలసీ. ఎక్కడ అవకాశముంటే అక్కడ అప్పులు తీసుకోవటమే. చంద్రబాబు అప్పులు చేసి అమరావతి వంటి నగరం, మౌలిక సదుపాయాలకు, పోలవరం అంటూ ఖర్చులు చేస్తే జగన్ అప్పులు చేసి పప్పుబెల్లాల్లాగ పంచుతున్నారంతే. ఏదో రాజకీయంగా ఆరోపణలు చేయాలి కాబట్టి చంద్రబాబు, తమ్ముళ్ళు చేస్తున్నారంతే అని జనాలు పట్టించుకోవటం లేదని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి.

రాష్ట్రం చేసిన అప్పులు రాష్ట్రానికి వచ్చిన ఆదాయంతోనే కట్టాలి. కేంద్రం పరిమితి పెట్టినా కొన్ని రాష్ట్రాలు పరిమితి కంటే తక్కువ తీసుకున్నాయి. సీఎం జగన్ మాత్రం పరిమితికి మించి తీసుకున్నారు. కానీ వాటిని సంపద సృష్టించడానికి వాడటం లేదు. దీనివల్ల వడ్డీలకే రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం కట్టే పరిస్థితి వచ్చింది. మరిది ఇంకా ఎక్కడిదాకా పోతుందో. శ్రీలంకలా ఏపీ మారకపోవచ్చు గాని ఏపీ ప్రజలు దేశంలోనే అధిక పన్నులు చెల్లించే ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పొచ్చు.