Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటలు చెబితే.. స్టాలిన్ చేతలు చూపిస్తున్నాడుగా?

By:  Tupaki Desk   |   2 April 2022 4:11 AM GMT
కేసీఆర్ మాటలు చెబితే.. స్టాలిన్ చేతలు చూపిస్తున్నాడుగా?
X
బలమైన ప్రజాకర్షణ.. అంతకు మించి పాలనలో తమదైన ముద్ర వేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయితే ఎలా ఉంటుంది? వారి మధ్య పాలనా పరమైన విధానాల గురించి చర్చ జరగటంతో పాటు.. ఆ విషయాల్ని స్వయంగా తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. అంతకు మించిన గొప్పతనం ఏముంటుంది చెప్పండి? తాజాగా అలాంటి పనే చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఢిల్లీ రాష్ట్ర సర్కారైన కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానం.. దానికి సంబంధించి ఇప్పటివరకుచేసిన పని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్.

ఈ సందర్భంగా బయటకు వచ్చిన పలు విషయాల్ని చూస్తే.. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇన్ని పనులు చేసిందా? అన్న భావన కలుగక మానదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ మోడల్ పైన పలు రాష్ట్రాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు.. ఇలాంటి మోడల్ ను అధ్యయనం చేయటానికి మంత్రుల్ని.. అధికారుల్ని వెళ్లి రమ్మంటారు.

కానీ.. అందుకు భిన్నంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాన్ని తాను స్వయంగా చూడాలని ఫిక్సు అయిన ఆయన.. ఢిల్లీ సీఎంతో భేటీ అయ్యారు. గడిచిన ఆరేళ్లలో ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 25శాతం మేర విద్యా రంగానికి స్థిరంగా ఖర్చు చేశామన్నారు. 2014-15లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్ టూ (ఇంటర్ సెకండ్ ఇయర్) ఉత్తీర్ణత శాతం ప్రైవేటుతో పోలిస్తే.. ప్రభుత్వంలో తక్కువ ఉండేదని.. 88 శాతంగా ఉండేదన్నారు. కానీ.. 2019-20 నాటికి అది కాస్తా 98 శాతానికి పెంచిన వైనాన్ని స్టాలిన్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించటం గమనార్హం.

ఢిల్లీ సీఎం మాటలకు స్పందించిన స్టాలిన్.. తమ ప్రభుత్వం సైతం ఢిల్లీలో మాదిరి.. తమిళనాడులోనూ ఢిల్లీ మోడల్ స్కూళ్లనుఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య.. వైద్య రంగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులోనూ ఢిల్లీ తరహా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని.. అవి పూర్తి కాగానే కేజ్రీవాల్ ను తమిళనాడుకు ఆహ్వానిస్తామని చెప్పిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టాలిన్ లాంటి సీనియర్ నేత ఒకరు.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరో పార్టీకి చెందిన ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని బహిరంగంగా పొగడటం చాలా అరుదైన విషయంగా చెప్పాలి.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అవుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తరచూ చెబుతుంటే.. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా.. పెద్దగా మాటలు చెప్పకుండానే ఢిల్లీకి వెళ్లి కలిసి రావటం.. కేజ్రీవాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి పొగడటం చూస్తే.. అరుదైన సీన్ ఆవిష్క్రతమైందని చెప్పక తప్పదు.