Begin typing your search above and press return to search.

తిరుమలతో పోటీ అని చెప్పి.. అన్నిసార్లు యాదాద్రి వెళ్లి ఏం చేశారు కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 April 2022 12:30 AM GMT
తిరుమలతో పోటీ అని చెప్పి.. అన్నిసార్లు యాదాద్రి వెళ్లి ఏం చేశారు కేసీఆర్?
X
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నంతనే ఆయన మాటలు..ఆయన చేతలు అన్ని కలగలిపి గుర్తుకు వచ్చేస్తాయి. ఆయన ప్లానింగ్ ను చూసిన రాజకీయ ప్రత్యర్థులు సైతం మురిసిపోతుంటారు. అద్భుతమైన మేధా శక్తి ఉందని చెప్పే గులాబీబాస్.. తానుస్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి సిద్ధం చేసిన యాదాద్రి దేవాలయం ఇప్పుడు సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం షాకింగ్ గా మారింది. సీఎం కేసీఆర్ మాటలకు ప్రభావితమై.. యాదాద్రికి వెళుతున్న వారికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో యాదాద్రిని సిద్ధం చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావించటం తెలిసిందే. యాదాద్రి గొప్పతనం గురించి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు విన్న భక్తులు బోలెడంత అంచనాలతో యాదాద్రికి వెళుతున్నారు. అక్కడకు వెళుతున్న వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే పరిస్థితి. అడుగడుగునా కష్టాలతో.. ఎందుకు వచ్చామురా భగవంతుడా? అన్న వేదనకు గురవుతున్నారు. చిన్న పిల్లల్ని తమతో తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఎదురయ్యే కష్టాలకు దేవుడే దిక్కు అన్నట్లు మారింది.

కొండ మీద ఉండాల్సిన కనీస సౌకర్యాలైన మంచినీళ్లు కూడా లేకపోవటం ఒక పెద్ద లోపమైతే.. ఆలయం లోపల ఉక్కపోతతో ఉడికిపోవటం.. క్యూ లైన్లు మొత్తం ఎండ కారణంగా నిలబడలేని పరిస్థితి. భక్తితో తమకు ఎదురయ్యే సమస్యల్ని భరిస్తున్నప్పటికీ.. భారీ ప్లానింగ్ తో చేపట్టిన యాదాద్రి దేవాలయ నిర్మాణంలో ఇన్ని లోపాలు ఉండటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
కొండపైకి చేరుకున్నాక కానీ.. చాలామందికి కొండ దిగువనే దర్శనం టికెట్లు ఇస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని.. మళ్లీ కిందా మీదా పడుతూ కిందకు వచ్చి దర్శనం టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అంతేకాదు.. ప్రైవేటు వాహనాల్ని గుట్ట కిందనే ఆపేసి.. అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లాలన్న రూల్ పై మండిపడుతున్నారు. పిల్లలు.. పెద్ద వయస్కుల్ని వెంట పెట్టుకొని ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారికి.. మహా ఇబ్బందిగా మారింది.

స్వామి దర్శనం పూర్తి అయ్యాక బయటకు వచ్చే భక్తులకు సేద తీరటానికి నీడ కూడాలేని పరిస్థితి. కనీసం చలువ పందిళ్లు వేయించినా.. ఫర్లేదు. కానీ.. అది కూడా జరగలేదు. నిర్మాణ వేళలో ఇలాంటి ఐడియా రాకపోవటానికి ఇదేమీ ఒక కాలనీలోని వారు చేసింది కాదు కదా? వందల కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని ఖర్చు చేసినప్పుడు వసతులు ఎంత పక్కాగా ఉండాలి?
గుడి నుంచి బయటకు రాగానే.. బండల మీద కాళ్లు పెట్టిన వారికి కాళ్లు మండిపోతున్నాయి.

కాలుతున్న కాళ్లతో భక్తులు పరుగులు తీస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొండ కింద సుమారు 3 కిలో మీటర్ల వరకు ఎక్కడా బాత్రూంలు లేని వైనం చూస్తే.. ఇదెక్కడి పుణ్యక్షేత్రం అన్న భావన కలుగక మానదు. కొండ కింద కానీ పైన కాని పూజా సామాన్ల షాపులు లేకపోవటంతో ఎక్కడ కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి. యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించే క్రమంలో ఎన్నో సార్లు సీఎం వెళ్లారు. గంటల కొద్దీ సమయాన్ని రివ్యూల పేరుతో నిర్వహించారు. తీరా చూస్తే.. కనీస సౌకర్యాలు లేని తీరుతో అంత పెద్ద కేసీఆర్ ప్లానింగ్ ఇంత చిన్నగా ఉంటుందా? అన్న సందేహంతో పాటు.. ఆయన ప్లానింగ్ మీద కొత్త సందేహాలు పుట్టుకు రావటం ఖాయం.