Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను చూసి.. కేసీఆర్ వెన‌క‌డ‌గు!

By:  Tupaki Desk   |   15 April 2022 8:26 AM GMT
జ‌గ‌న్‌ ను చూసి.. కేసీఆర్ వెన‌క‌డ‌గు!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాల ప‌రంగా పోలిక‌లు, వ్య‌త్యాసాలు, ప‌రిణామాలు చ‌ర్చించుకోవ‌డం ప్ర‌జ‌ల‌కు అల‌వాటైపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అలా చేస్తున్నారంటూ.. ఏపీ సీఎం జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ రెండు ప్ర‌భుత్వాల‌కు పోలిక పెట్టి చూడ‌డం ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీసుకునే నిర్ణ‌యం మ‌రో రాష్ట్ర సీఎంపై ప్ర‌భావం చూపుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా దానికి ఏపీలో సీఎం జ‌గ‌న్ చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. జ‌గ‌న్ మంత్రివ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించిన త‌ర్వాత కొంత‌మంది వైసీపీ నేత‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై కేసీఆర్ పున‌రాలోచ‌న చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

అసంతృప్తి త‌ప్ప‌లేదు..

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అంతా సాఫీగా సాగుతుంద‌ని జ‌గ‌న్ భావించారు. కానీ అక్క‌డి రాజకీయాల్లో తిరుగులేని నేత‌గా ఉన్న ఆయ‌న‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌లేదు. మంత్రి ప‌ద‌వి ఊడిన నేత‌లు.. ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ నాయ‌కులు త‌మ అసంతృప్తి అధినేత‌కు తెలిసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండున్న‌రేళ్ల‌లో మంత్రివ‌ర్గాన్ని మారుస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ చెప్పారు కాబ‌ట్టి అప్పుడు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వాళ్లు సైలెంట్‌గా ఉన్నారు.

కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. దీంతో సీఎం జ‌గ‌న్‌ను అత్యంత సన్నిహితంగా ఉండే నేత‌లు రంగంలోకి దిగి అసంతృప్త నాయ‌కుల‌ను బుజ్జ‌గించాల్సి వ‌స్తోంది. ఇప్పుడంటే ఏపీలో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి పార్టీ లేదు కాబ‌ట్టి వైసీపీ నేత‌లు క‌చ్చితంగా జ‌గ‌న్‌తోనే క‌లిసి న‌డుస్తారు. కానీ తెలంగాణ‌లో ప‌రిస్థితి వేరుగా ఉంది.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేన‌ట్టే

ఏపీలో జ‌రిగిన ప‌రిణామాలు చూసిన త‌ర్వాత కేసీఆర్ తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో వెన‌క‌డ‌గు వేస్తున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి వెళ్లిపోవ‌డంతో ఖాళీ అయిన ఓ మంత్రి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డంతో పాటు కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేసీఆర్ భావించార‌ని టాక్‌.

కానీ ఈ ప్ర‌క్రియ‌న ఆయ‌న వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఏపీలో ప‌రిస్థితులు చూశాక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించే క‌చ్చితంగా అసంతృప్తి సెగ‌లు రేగుతాయి. ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే నిర‌స‌న గ‌ళం వినిపిస్తారు. వ‌చ్చే ఏడాదే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడా నేత‌ల అసంతృప్తి మంచిది కాదు. పైగా తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ ఎదుగుతోంది. ఈ అసంతృప్త నేత‌లు కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకునే ప్ర‌మాదం కూడా ఉంది. అందుకే మంత్రివ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై కేసీఆర్ వెన‌క్కి త‌గ్గినట్లేన‌ని నిపుణులు చెబుతున్నారు.