Begin typing your search above and press return to search.

మృతులను గుర్తించేందుకు క్లియర్ వ్యూ

By:  Tupaki Desk   |   25 March 2022 4:32 AM GMT
మృతులను గుర్తించేందుకు క్లియర్ వ్యూ
X
అమెరికా రూపొందించిన క్లియర్ వ్యూ టెక్నాలజీని రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అమలు చేస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంలో నెలరోజుల్లో సుమారు 15 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో చనిపోయిన వారిని గుర్తించటం అన్నీసార్లు అంత ఈజీకాదు. చాలా సందర్భాల్లో మొహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోతాయి. మామూలు బుల్లెట్ల దెబ్బకు చనిపోతే మొహాలను చూసి గుర్తుపట్టడం తేలికే.

అయితే బాంబులు, క్షిపణుల దాడిలో చనిపోయిన వారిని గుర్తించటం మాత్రం కష్టమే. ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్ ప్రభుత్వం క్లియర్ వ్యూ అనే సాఫ్ట్ వేర్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా చనిపోయిన సైనికులు అంతకుముందే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫొటోలను క్లియర్ వ్యూ టెక్నాలజీ ఉపయోగించుకుంటోంది. యుద్ధంలో మొహాలు ఛిద్రమైపోయినా సోషల్ మీడియాలో ఉన్న ఫొటోలను అనుసంధానిస్తే టెక్నాలజీయే రెండు ఫొటోల కంపాటబులిటినీ చూసుకుంటుంది.

ఉక్రెయిన్ వాడుతున్న క్లియర్ వ్యూ టెక్నాలజీలో ఇప్పటికే 200 కోట్ల ఫొటోలున్నాయట. ఉక్రెయిన్లో చనిపోయిన తమ సైనికులను తీసుకెళ్ళటం రష్యాకు ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి చనిపోయిన వేలాదిమంది సైనికులను ఉక్రెయిన్లోనే రష్యా వదిలేస్తోంది. తమగడ్డపై చనిపోయిన రష్యన్ సైనికులను ఫొటోలు తీసుకుని కొత్త టెక్నాలజీకి అనుసంధానించటం ద్వారా పూర్వ వివరాలను తెలుసుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది.

టెక్నాలజీ ద్వారా గుర్తించిన చనిపోయిన సైనికుల కుటుంబసభ్యులకు ఉక్రెయిన్ ప్రభుత్వం సమాచారం ఇస్తోంది. ఈ సమాచారం ఆధారంగా చనిపోయిన సైనికుల కుటుంబసభ్యులు ఉక్రెయిన్ వచ్చి సదరు మృతదేహాలను తీసుకోవచ్చు. ప్రస్తుత యుద్ధకాలంలో రష్యా మృతదేహాలను రష్యాకు పంపటం సాధ్యం కాదు కాబట్టే ఉక్రెయిన్ ప్రభుత్వం చనిపోయిన వారి బంధువులకు సమాచారమిస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికి ఎంతమందిని గుర్తించింది ? ఎంతమంది కుటుంబసభ్యలకు సమాచారం ఇచ్చమనే విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పలేదు. మొత్తం మీద చనిపోయిన సైనికులను వారి కుటుంబసభ్యులకు అందచేయాలన్న ఉక్రెయిన్ ప్రయత్నం మాత్రం అభినందనీయమే.