Begin typing your search above and press return to search.

మేధావులు న‌వ్వుతున్నారు.. ఇంకా చంద్ర‌బాబు మీద ఆరోప‌ణ‌లా?

By:  Tupaki Desk   |   13 April 2022 3:39 AM GMT
మేధావులు న‌వ్వుతున్నారు.. ఇంకా చంద్ర‌బాబు మీద ఆరోప‌ణ‌లా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్ల ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంది.. ర‌హ‌దారుల‌పై గుంత‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నాయి.. అంటే అందుకు కార‌ణం గ‌త టీడీపీ ప్ర‌భుత్వం! ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది.. అప్పు చేస్తే కానీ రోజువారీ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు సాగ‌డం లేదు.. అంటే అందుకు కార‌ణం మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు! రాష్ట్రంలో అభివృద్ధి ప‌డ‌కేసింది.. నిధులు లేవు.. ప‌నులు లేవు.. అంటే అందుకు కార‌ణం బాబునే! యువ‌త ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు.. నోటిఫికేన్లు వేయ‌డం లేదు.. అంటే అందుకు కార‌ణం టీడీపీ ప్ర‌భుత్వ‌మే!

రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి.. వేస‌వి ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపిస్తోంది.. అంటే అందుకు కార‌ణం చంద్ర‌బాబు నాయుడే! అన్ని ఖ‌ర్చులు పెరిగిపోయాయి.. ఇసుక లేదు.. నిర్మాణాలు ఆగిపోయాయి.. అంటే అందుకు కార‌ణం బాబునే! ఇలా రాష్ట్రంలో ఏ స‌మ‌స్య ఉన్నా అందుకు కార‌ణం మాజీ సీఎం బాబు మాత్ర‌మే.. ఇవీ ప్ర‌స్తుత అధికార వైసీపీ హైకమాండ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు.

రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నా అందుకు ప్ర‌ధాన కార‌ణం గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో బాబు తీసుకున్న వైఫ‌ల్య‌మే అంటూ వైసీపీ నేత‌లు అంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు కావ‌స్తోంది. అయినా ఇప్ప‌టికీ బాబు మీద ప‌డి ఏడ‌వ‌డం ఏమిట‌నే విమర్శ‌లూ వ‌స్తున్నాయి.

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో చంద్ర‌బాబు పార్టీ జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని బాబు పాలించారు. అయితే ఒక్క అవ‌కాశం ఇవ్వండి అంటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. పాద‌యాత్ర‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకున్నారు. అందుకే బాబును వ‌ద్ద‌నుకుని ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ప‌ట్టం క‌ట్టారు. ఏకంగా 151 సీట్లు క‌ట్ట‌బెట్టారు. భారీ మెజారిటీ అందించారు. అధికారంలోకి వ‌చ్చిన పార్టీ.. గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం ప‌రిపాటే కానీ ఏళ్ల‌కు ఏళ్లు అదే ప‌ని చేస్తుంటే ఎలా అని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించ‌కుండా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ధ్యాస పెట్ట‌కుండా.. కేవ‌లం బాబును అంటే ఏం వ‌స్తుంద‌ని జ‌నాలు అడుగుతున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక ఏడాది పాటు గ‌త ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే స‌రే కానీ ఇప్ప‌టికే అలాగే చేస్తుండ‌డంతో జ‌గ‌న్‌పై జ‌నాల్లో ఆగ్ర‌హం పెరుగుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం క‌రెంట్ కోత‌ల గురించి టీడీపీ ప్ర‌శ్నిస్తే వెంట‌నే టీడీపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం కార‌ణంగానే ఇప్పుడీ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారిందంటే అందుకు బాబు కార‌ణ‌మ‌ని వైసీపీ అధిష్ఠానం చెబుతోంది. ఇలా ప్ర‌తి విష‌యాన్ని బాబు మీద తోసేయడం ఏమిట‌నీ మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అభివృద్ధి సంగ‌తి మ‌ర్చిపోయి.. కేవ‌లం బాబును మాట‌లు అన‌డంతోనే స‌రిపెట్టుకుంటుంద‌ని మేధావులు న‌వ్వుతున్నారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలోనూ జ‌గ‌న్ స్వ‌యంగా బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యం రాష్ట్ర ప‌రిస్థితిని దెబ్బ‌తీసింద‌ని ఆరోపించారు. అయితే 2024 ఎన్నిక‌ల వ‌ర‌కూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇదే ప‌ద్ధ‌తి కొనసాగిస్తే అది ఆ పార్టీకి మంచిది కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.