Begin typing your search above and press return to search.

అన్న‌మ‌య్య జిల్లాలో అదే అసంతృప్తి.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   5 April 2022 7:30 AM GMT
అన్న‌మ‌య్య జిల్లాలో అదే అసంతృప్తి.. ఏం జ‌రిగిందంటే!
X
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ప్ర‌తిప‌క్షాల క‌న్నా.. సొంత పార్టీ నేత‌ల నుంచే ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కువ‌గా సెగ‌లు త‌గులుతున్నాయి. ప్ర‌దానంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో కొత్త‌గా ఏర్పాటు చేసిన‌.. రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా విష‌యంలో నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి కొత్త జిల్లాల తాత్కాలిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన నాటి నుంచి కూడా రాయ‌చోటి వ‌ద్దు రాజం పేట ముద్దు అంటూ.. నాయ‌కులు గ‌ళం విప్పారు. రాయ‌చోటిలో తాగేందుకు నీళ్లు కూడా లేవు.. అక్క‌డ జిల్లా కేంద్రం అంటే.. ఎలా అని నాయ‌కులు ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. సెంటిమెంటు ప్ర‌కారం చూసుకున్నా.. అన్న‌మయ్య పుట్టిందిపెరిగిందికూడా రాజంపేట‌లో సో.. దీనిని జిల్లా కేంద్రం చేసి.. అన్న‌మ‌య్య పేరు పెడితే.. చ‌రిత్ర స‌హిస్తుంద‌ని.. లేదంటే ఛీత్కరిస్తుం ద‌ని కూడా వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం.. సీత‌య్య టైపులో వ్య‌వ‌హ‌రించింది. రాజ‌కీయ కార‌ణాల‌తో రాజంపేట నుంచి రాయ‌చోటికి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి.. అన్న‌మ‌య్య జిల్లాకే గుమ్మ‌డికాయ కొట్టేసింది.

ఈ క్ర‌మంలో అన్న‌మ‌య్య జిల్లా ప‌రిధిలోకి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్ల‌పల్లె అసెంబ్లీ నియోకవర్గాలు వ‌చ్చాయి. మ‌ద‌న‌ప‌ల్లెను జిల్లా కేంద్రం చేయాల‌ని స్థానికులు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. అలాగే రాజంపేట‌ను చేయాల‌ని రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు కొంత కాలంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. వీటిని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఎట్ట‌కేల‌కు అన్న‌మ‌య్య జిల్లాను రాయ‌చోటిలో ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మానికి రాయ‌చోటి, పీలేరు ఎమ్మెల్యేలు గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, చింత‌ల రామ‌చంద్రారెడ్డి మాత్ర‌మే ప్ర‌జాప్ర‌తినిధులుగా హాజ‌ర‌య్యారు. అయితే.. ఎవ‌రైతే.. ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారో.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాలైన మ‌ద‌న‌ప‌ల్లె, తంబ‌ళ్ల‌ప‌ల్లె, రాజంపేట‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలెవ‌రూ కొత్త జిల్లాల ఏర్పాటు సంరంభానికి క‌నీసం.. మొహం కూడా చూపించ‌లేదు. పైగా వీరంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీలో ముఖ్య నేత కూడా. క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప‌ది నిమిషాల పాటు ఉండి వెళ్లిపోయారు. ఈయ‌న రాజంపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌.

జిల్లా కేంద్రం ఏర్పాటులో ప్ర‌భుత్వం వివ‌క్ష చూపింద‌ని అన్న‌మ‌య్య జిల్లాలోని ప‌లువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌మ‌పై ఈ జిల్లా ఏర్పాటు ప్ర‌భావం చూపుతుంద‌ని.. వారు అంటున్నారు. తాము కూడా రాయ‌చోటికి వ్య‌తిరేక‌మే అనే సంకేతాల్ని పంప‌డానికి, కొత్త జిల్లా ప్రారంభ వేడుక‌కు వెళ్ల‌లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆరుగురు ఎమ్మెల్యేల్లో న‌లుగురు గైర్హాజ‌ర‌య్యారంటే... ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టు ఎంత అశాస్త్రీయంగా అన్న‌మ‌య్య జిల్లాను ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.