Begin typing your search above and press return to search.

జెలెన్ స్కీ ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?

By:  Tupaki Desk   |   29 March 2022 7:28 AM GMT
జెలెన్ స్కీ ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?
X
యుద్ధం మొదలైన ఇన్నిరోజుల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి జ్ఞానోదయం అయినట్లుంది. తమపై రష్యా వెంటనే యుద్ధాన్ని నిలిపేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు రిక్వెస్టు చేస్తున్నారు. నాటో దేశాలతో తాము చేరబోమని, తటస్ధంగానే ఉంటామంటూ ప్రతిపాదనలు పంపారు. అలాగే తమ సరిహద్దుల్లో రష్యాకు అవసరమైన భద్రతను కూడా కల్పిస్తామంటు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు.

రెండు దేశాల మధ్య యుద్ధ విరమణపై ఈ రోజు టర్కీలో చర్చలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలోనే జెలెన్ స్కీ ప్రకటనకు ప్రాధాన్యతొచ్చింది. యుద్ధానికి ముందేమో నాటో దేశాలతో చేరే విషయంలో నోటికొచ్చింది మాట్లాడారు. అలాగే యుద్ధానికి తాము సిద్ధమంటు పదే పదే రష్యాపై తొడగొట్టారు. ఇదంతా జెలెన్ స్కీ ఎందుకు చేశారంటే అమెరికా నాయకత్వంలోని నాటో దేశాల అండ చూసుకునే.

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధమంటు మొదలైతే యావత్ ప్రపంచం తమకు మద్దతుగా నిలబడుతుందని అంచనా వేసుకున్నట్లున్నారు. తీరా యుద్ధం మొదలైన తర్వాత నాటో దేశాలు కానీ అమెరికా కానీ ఉక్రెయిన్ కు ప్రత్యక్షంగా సాయం చేయటానికి ముందుకు రాలేదు. దాంతో పరిస్థితి ఏమిటో జెలెన్ స్కీకి అర్ధమైపోయింది. అయినా నాటో దేశాలు, అమెరికా ఇచ్చిన ఆయుధాలు, నిధులతో ఇన్ని రోజుల యుద్ధాన్ని నెట్టుకొచ్చారు.

ఇక ఎక్కువ రోజులు యుద్ధం చేసేంత సీన్ లేనట్లుంది. అందుకనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రిక్వెస్టులు మొదలుపెట్టారు. తాను తక్షణమే శాంతిని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్లోని చాలా నగరాలు నామరూపాలు లేకుండా నాశనమైపోయాయి. యుద్ధం విరమించినా దేశాన్ని పునర్నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరు చెప్పలేకున్నారు. మరి జెలెన్ స్కీ రిక్వెస్టును పుతిన్ పట్టించుకుంటారా ?