Begin typing your search above and press return to search.

కదులుతోంది రైతు పాదం...అమరావతి రాజధాని కోసం

By:  Tupaki Desk   |   10 Sep 2022 3:20 PM GMT
కదులుతోంది రైతు పాదం...అమరావతి రాజధాని కోసం
X
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని హై కోర్టు కొద్ది నెలల క్రితమే విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే అమరావతి రాజధానిగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పట్టించుకోవడంలేదని, కనీస అభివృద్ధి కూడా చేయడంలేదని నిరసిస్తూ అమరావతి టూ అరసవెల్లి అంటూ రాజధాని రైతులు భారీ పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. ఇది అమరావతి రైతులు చేస్తున్న రెండవ పాదయాత్ర.

అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ సం యుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి మహా పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 12న ఉదయం 5 గంటలకు తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మహాపాదయాత్రలో పాల్గొనేవారు వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత నడకను ప్రారంభిస్తారు.

ఈ పాదయాత్ర రెండు నెలల పాటు సాగి నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ముగుస్తుంది. మొత్తం పదహారు జిల్లాలు అరవై రోజుల పాటు ఈ పాదయాత్ర ఉంటుంది. ఇక పాదయాత్ర కోసం సర్వం సిద్ధం చేసుకున్న మహా పాదయాత్రీకులు అమరావతిని నిర్మించాలి ఆంధ్రాను కాపాడాలి అన్న బలమైన నినాదంతో గోదావరి జిల్లాలను దాటి ఉత్తరాంధ్రాకు తరలివస్తారు.

అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం మీద వత్తిడి పెంచడంతో పాటు ఏపీకి ఏకైక‌ రాజధాని అమరావతి మాత్రమే అని జనాల చేత ఒప్పించడానికే ఈ యాత్ర అని అంటున్నారు. ఇక మహా పాదయాత్ర కోసం సిద్ధం చేసిన శ్రీవారి ప్రత్యేక రథాన్ని ఈ నెల 12న ఉదయం 9 గంటలకు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అధికార వైసీపీ తప్ప ఏపీలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను అమరావతి పరిరక్షణ సమితి ఆహ్వానించింది. దాంతో ఆయా పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఇక తొలిరోజు పాదయాత్ర చూస్తే కృష్ణాయపాలెం, పెనుమాక, యర్రబాలెం మీదుగా మంగళగిరిలో పాదయాత్ర ముగుస్తుంది. ఈ మహా పాదయాత్రలో పాలుపంచుకునే 600 మంది సభ్యులతో కూడిన జాబితాను పోలీసులకు సమర్పించారు. ఆరు వందల మంది దాకా మాత్రమే పాదయాత్రలో పాలుపంచుకోవాలని నిబంధన ఉంది. శాంతి భద్రతలకు ఇబ్బంది అనే ఏపీ పోలీసులు ఈ యాత్రకు అనుమతించలేదు. దాంతో హై కోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక సరిగ్గా ఏడాది క్రితం అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. న్యాయస్థానం నుంచి పేరుతో దేవస్థానం దాకా అని నాటి పాదయాత్ర సాగింది. ఈసారి ఏకంగా అరవై రోజుల పాటు పాదయాత్ర చేపడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ సర్కార్ మూడు రాజధానులు అంటోంది.

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలోనే బిల్లు ప్రవేశపెడతారు అని అంటున్నారు. విశాఖను పాలనారాజధానిగా, కర్నూల్ ని న్యాయ రాజధానిగా అమరావతిని శాసన రాజధనిగా చేస్తూ బిల్లు తేనున్నారు. ఒక వైపు పాదయాత్ర సాగుతున్న వేళ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.