Begin typing your search above and press return to search.

బీజేపీ తో డైరెక్ట్ గానే... మూడు రాజధానుల బిల్లు అందుకే...?

By:  Tupaki Desk   |   3 Sep 2022 2:30 AM GMT
బీజేపీ తో డైరెక్ట్ గానే... మూడు రాజధానుల బిల్లు అందుకే...?
X
ఏపీలో మూడు రాజధానులు అంటూ వైసీపీ కలవరిస్తోంది. ఆ విధంగా వైసీపీ దూకుడుగా అడుగులు వేయడం వెనక ఈసారి బీజేపీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యం ఉంది అంటున్నారు. టీడీపీతో పొత్తు కోసం ఉవ్విళ్ళూరుతున్న జాతీయ  బీజేపీ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని గట్టిగా చెప్పబోతోంది. ఇంతదాకా రాష్ట్ర నాయకత్వం చేత ఈ మాట అనిపించిన బీజేపీ ఇపుడు తానుగా కేంద్ర నాయకత్వమే ఒక గంభీరమైన ప్రకటన చేయబోతోంది.

కేంద్ర నాయకత్వం ఆ ప్రకటన చేస్తే దానికి చాలా విలువ గౌరవం ఉంటాయి. అదే టైమ్ లో అమరావతి రాజధాని సెంటిమెంట్, దాని చుట్టూ అల్లుకున్న  ఒక బలమైన సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకునే ఆలోచనతోనే బీజేపీ ఈ విధంగా జై కొట్టబోతోంది అని అంటున్నారు. ఇక ఇదే బీజేపీ 2019 ఎన్నికల ముందు కర్నూల్ కి హై కోర్టు కావాలని రాయలసీమ డిక్లరేషన్ లో స్పష్టంగా పేర్కొంది. కానీ ఇపుడు అదే బీజేపీ నాలిక మడతేస్తూ ఏకైక రాజధాని అమరావతి అని అంటోంది.

మరి హై కోర్టు సంగతేంటి అని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో అడిగితే అది ఏపీ సర్కార్ హై కోర్టు కలసి ఆ విషయాన్ని  తేల్చుకోవాలని బంతికి ఏపీ సర్కార్  మీదనే వేసేసింది. అంటే చాలా తెలివిగానే బీజేపీ తన రాజకీయం తాను ఆడుతోంది అన్న మాట. ఇక మూడు రాజధానులు అని వైసీపీ అన్నపుడు నాడు కేంద్ర పెద్దలు దన్నుగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే హై కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్. అందులో రాజధానులు ఎక్కడ ఎన్ని ఉండాలో అది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశం అని చెప్పుకొచ్చారు.

కానీ ఇపుడు అమరావతి మాత్రమే రాజధాని అని అంటున్నారు. ఇన్నాళ్ళూ కేంద్రం మద్దతుగా ఉంటే హై కోర్టు దాకా అయినా కర్నూల్ లో పెట్టించి విశాఖను అనధికార పాలనారాజధానిగా చేసుకుని అక్కడ క్యాంప్ ఆఫీస్ తరలించి పాలించాలని జగన్ భావించారు. కానీ ఇపుడు కేంద్రం ఏపీ రాజకీయాలలో  తన వాటాను  చూసుకుంటోంది. టీడీపీతో పొత్తు కోరుకుంటోంది. దీనికి స్కెచ్ ఏడాది క్రితమే పడింది. నాడు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ  మండలి సమావేశం కోసం తిరుపతి వచ్చినపుడే అమరావతి మీద బీజేపీ నేతలను ఉద్యమించమని కోరారని వార్తలు వచ్చాయి.

ఇపుడు అది కాస్తా మెల్లిగా అమలవుతోంది. దీంతో వైసీపీకి ఒక విధంగా ఇది ఇరకాటమే. అయినా సరే తాము ఎక్కడా తగ్గకూడదని వైసీపీ భావిస్తోంది. ఇపుడు అమరావతి ఏకైక రాజధాని అన్నా వైసీపీకి రాజకీయంగా ఒరిగేది ఏమీ లేదు. అక్కడ ఇప్పటికే టీడీపీ తన గుత్తాధిపత్యం చాటుకుంటోంది. బీజేపీ కూడా పట్టు కోసం చూస్తోంది. జనసేన అయితే అమరావతే మన రాజధాని అంటోంది. ఇక కాంగ్రెస్ వామపక్షాలు చెప్పాలంటే అన్ని పార్టీలు అమరావతి అంటున్నాయి.

దాంతో పాటు ఇపుడు వైసీపీ అమరావతి అంటే అక్కడ ఏ కోశానా రాజకీయ  మైలేజ్ ఏమీ రాకపోగా వెనకబడిన ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్రా నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. దాంతో వైసీపీ ముందుకే అని అంటోంది. అందుకే తొందరలో జరగబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా చేసుకుంటారు అని తెలుస్తోంది.

ఇక బీజేపీ టీడీపీతో పొత్తులో భాగంగా అమరావతి మన రాజధాని అని గట్టిగా చెప్పబోతోంది. దానికి ముందే కౌంటర్ అన్నట్లుగా వైసీపీ మూడు రాజధానులతో ముందుకు వస్తోంది అంటున్నారు. అలాగే కర్నూల్ లో హై కోర్టు అన్నారు ఆ డిక్లరేషన్ ఏమైంది అని ఇండైరెక్ట్ గా బీజేపీని కూడా నిగ్గదీసేలా వైసీపీ మూడు రాజధానుల బిల్లు ఉండబోతోంది అని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే బీజేపీ మీద డైరెక్ట్ ఫైట్ గానే దీన్ని చూస్తున్నారు. మోడీ  అమిత్ షా నో అన్న తరువాత కూడా మూడు రాజధానుల విషయంలో వైసీపీ ముందుకు వెళ్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వైసీపీ మూడు రాజధానులు అంటే ఏపీ రాజకీయాల్లో అది పెను సంచలనమే అవుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.