Begin typing your search above and press return to search.

సేనాని ఎటు : అటు అహం.. ఇటు జగన్...?

By:  Tupaki Desk   |   10 July 2022 1:30 AM GMT
సేనాని ఎటు : అటు అహం.. ఇటు జగన్...?
X
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. అలాగే అక్కడ  మాట్లాడే ప్రతీ మాటా కౌంట్ అవుతుంది. పైగా ఇది సాంకేతిక యుగం, సామాజిక మీడియా యుగం. అందువల్ల వ్యూహాలు అయినా మరొకటి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పార్టీని నడిపించాలనుకుంటే దానికి తగిన కార్యాచరణ ఉండాలి. మరి ఇవన్నీ తెలిసో తెలియకో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తుల గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. వైసీపీకి వ్యతిరేకంగా అంతా కలవాలి అన్నట్లుగా ఆయన పిలుపు ఇచ్చారు.

ఆ మీదట మరోసారి మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ బీజేపీ, టీడీపీలకు కూడా ఇండైరెక్ట్ గా వాటి మీద వత్తిడి పెట్టారు. అయితే ఢక్కామెక్కీలు తిన్న ఆ రెండు పార్టీలు పవన్ ఆప్షన్ల మీద ఏ కోశానా రియాక్ట్ కాలేదు.

దాంతో పాటు జనసేన నుంచి మరో డిమాండ్ వచ్చింది. ఏపీ టూర్ లో ఉన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ పేరుని ప్రకటించాలని. అయితే దాన్ని కూడా కమలం పార్టీ లైట్ గా తీసుకుంది. ఇక లాభం లేదని పవన్ ఒంగోలు టూర్ లో తన పొత్తులు అన్నీ జనంతోనే అని చెప్పుకున్నారు.

అయినా సరే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది సందేహంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ జనసేన ఇచ్చిన మూడు ఆప్షన్ల మీద వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయించింది. దాని వల్ల ఆ పార్టీ  అన్ని ఆప్షన్లను తన దగ్గర ఉంచుకుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పటి నుంచి ఎందుకు దగ్గర పడ్డాక ఆలోచిద్దామన్న వ్యూహం టీడీపీది.

అంతే కాదు, పవన్ మనసుని పూర్తిగా చదివేసిన టీడీపీ పెద్దలు ఆయనకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రావడం ఇష్టం ఉండదని అంచనా వేస్తోంది. అందువల్ల అటు నుంచే తమ వైపు పొత్తుల ప్రతిపాదనలు వస్తే దాన్ని తనకు అనువుగా మార్చుకుందామ‌న్న మాస్టర్ ప్లాన్ కూడా ఉంది.

ఇక్కడ చూస్తే జనంతోనే పొత్తులు అని పవన్ బయటకు అంటున్నా ఆయన టీడీపీ నుంచే పొత్తు ప్రతిపాదన రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా జరిగితేనే తాము కోరుకున్న సీట్లతో పాటు పవర్ షేరింగ్ కి కూడా డిమాండ్ చేయవచ్చు అన్నది ఆలోచనగా చెబుతున్నారు. అందుకే తన బలాన్ని జనంలో చూపించడానికే ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

అయితే పవన్ గురించి బాగా తెలిసిన టీడీపీ మాత్రం తమ వైపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో పొత్తుల మీద ప్రతిపాదనలు పంపదు అంటున్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి మరోసారి జగన్ సీఎం అవుతారు. ఆ విధంగా కావడం తమకంటే పవన్ కే ఎక్కువ ఇష్టం ఉండదు అని టీడీపీ అంచనా వేస్తోంది. అయితే తానే పొత్తు ప్రతిపాదన ముందు చేయడానికి అహం అడ్డువస్తోందని కూడా భావిస్తున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడ్డాక పవన్ లోనే మార్పు వస్తుందని అది తమకు అనుకూలంగానే మారుతుందని టీడీపీ ధీమాగా ఉంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీకే దారుణ నష్టం. అలా భావిస్తే పొత్తు పెట్టుకుందామంటూ ఆ వైపు నుంచే ప్రతిపాదనలు ముందు రావాలి.

కానీ జగన్ తో బద్ధ వైరాన్ని, అది కూడా రాజకీయాలకు మించి పవన్ కొనసాగించడమే టీడీపీకి వరం కాబోతోంది అంటున్నారు. దాంతో ఏనాటికైనా పవన్ అహాన్ని ఓడించి తమ వద్దకు పొత్తుల కోసం వస్తారన్న ఆలోచనలతో టీడీపీ బేఫికర్ గా ఉందిట. చూడాలి మరి పవన్ తాను చెప్పినట్లుగా  జనంతోనే పొత్తు అని ఒంటరిగా పోటీకి రెడీ అవుతారో లేక పొత్తుల కోసం టీడీపీతో చేయి కలుపుతారో.