Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రి గారికి నీరసం తెప్పించిన జనం

By:  Tupaki Desk   |   11 Oct 2022 12:39 PM GMT
వైసీపీ మంత్రి గారికి నీరసం తెప్పించిన జనం
X
ఆయన సీనియర్ నేత, పేరు మోసిన రాజకీయ నాయకుడు. కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన విశాఖ రాజధాని కోసం ఇపుడు తనదైన శైలిలో మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆయన శ్రీకాకుళంలో గడప గడపకు కార్యక్రమం చేస్తూ అక్కడ ప్రజలకు మన రాజధాని అనగానే విశాఖపట్నం అని అనమని చెప్పారు.

సరే మంత్రి గారు మన రాజధాని అని అన్నారు కానీ కోరస్ గా విశాఖ అని ఎక్కడా జనాలు గొంతు ఎత్తలేదు. దాంతో అంతటి మంత్రికీ నీరసం వచ్చేసింది. ఏమి నోరు విప్పితే ఏమైపోతుంది. మన రాజధాని విశాఖపట్నం అనలేరా. విశాఖ రాజధాని అయితే మీకే మంచిది కదా. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటూ మంత్రి గారు రెట్టించారు. కానీ జనాలలో మాత్రం ఆశించిన స్పందన కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఇదే మంత్రి గారు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయన ఏమన్నా విశాఖ రాజధాని గురించి నోరెత్తారా అని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇపుడు చేతిలో మంత్రి పదవి ఉంది కాబట్టి ఆయనకు హుషార్ వచ్చి మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. ఇదే మాటను ఆయన జిల్లాకే చెందిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా అన్నారు.

మంత్రి పదవి లేనపుడు గమ్మున ఉన్న ధర్మాన ఇపుడు మినిస్టర్ కాగానే నోరు విప్పారని అచ్చెన్న సెటైర్లు వేశారు. వెనకబడిన జిల్లాల ప్రగతి మీద నిబద్ధత మీకు ఉందా ఉత్తరాంధ్రా మీద అభివృద్ధి మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని కూడా చురకలు అంటించారు. ఇక ధర్మాన వారు వారు మన రాజధాని మన విశాఖ అని కలవరిస్తున్నారు. కానీ జనాలకు కూడా హుషార్ పుట్టాలి కదా అపుడే కదా వారు కూడా కోరస్ గా గొంతు కలిపేది అని అంటున్నారు.

ఇక సంక్షేమ పధకాల విషయంలో కూడా విపక్షాలు అడ్డుకుంటున్నాయని, వైసీపీని అభివృద్ధి చేయనీయడం లేదని ధర్మాన విమర్శలు చేస్తున్నారు. సంక్షేమ పధకాలు అమలు చేయడం అధికార దుర్వినియోగం ఎలా అవుతుంది అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ధర్మాన ప్రతిపక్షం మీద గరం గరం అవుతున్నారు. రాజధాని మీద గట్టిగానే సమరం చేస్తున్నారు. తాను ఒక్కరే కాదు జనాలను కూడా కదిలించినపుడే కదా సార్ధకత అన్న మాటను అమాత్యవర్యులు గుర్తుంచుకుంటే మంచిదని అంటున్నారు అంతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.