Begin typing your search above and press return to search.

అటు జగన్... ఇటు పవన్... మధ్యలో బాబు

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:30 PM GMT
అటు జగన్... ఇటు పవన్... మధ్యలో బాబు
X
ఏపీ రాజకీయాలు 2024లో చాలా ఆసక్తిగా సాగనున్నాయి. ఎందుకంటే ఇద్దరు యువ నేతలతో పాటు వెటరన్ నేతగా ఉన్న చంద్రబాబు పోటీ పడే ఎన్నికలు ఇవి. ఇక చంద్రబాబు తానుగా చెప్పుకున్నట్లుగా ఓడితే మాత్రం లాస్ట్ ఎన్నికలు అవుతాయి. మరి ఆయనకా టీడీపీకా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ రోజుకు ఉన్న పరిస్థితి చూస్తే టీడీపీ అంతా చంద్రబాబుతోనే అన్నట్లుగా సాగుతోంది. కేవలం 23 సీట్లు వచ్చినా కూడా బాబు మీద నమ్మకతోనే మరో ఎన్నిక దాకా తమ్ముళ్ళు ఓపిక పట్టి ఉన్నారు.

అదే బాబు ప్లేస్ లో ఇంకే నాయకుడు సారధిగా ఉన్నా టీడీపీ 2020 కూడా చూసేది కాదు అనే వారూ ఉన్నారు. ఇపుడు 2024 ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. టీడీపీ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది అతి పెద్ద డౌట్. ఎందుకంటే టీడీపీకి 2019 ఎన్నికల్లో దాదాపుగా నలభై శాతం ఓటింగ్ వచ్చింది. అదే ఓటింగ్ స్టాండర్డ్ గా నిలబడాలని ఏమీ లేదు.

ఇక పోతే ఏపీలో మరో పార్టీ పోటీలో లేకపోతే కనుక కచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉండేది కానీ జనసేన అంటూ పవన్ పార్టీ రెడీగా ఉంది. దాంతో పాటు ఒక బలమైన సామాజికవర్గం ఆయన్ని సీఎం గా చూడాలని ఆశపడుతోంది. దాంతో పవన్ వైపు యాంటీ జగన్ ఓటు బ్యాంక్ కచ్చితంగా పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతుంది. ఈ మధ్యన జనసేన గ్రాఫ్ పెరుగుతోంది అంటే ముందు కంగారు పడాల్సింది టీడీపీనే.

అందుకే చంద్రబాబు కలవరపడ్డారు. ఆయన దూకుడు పెంచారు, మాటలలో పదును కూడా పెంచారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదిరినా లేక విడిగా చేసినా రెండూ కూడా టీడీపీకి ఈ సమయంలో ఇబ్బందికరమైన పరిణామాలే. పొత్తు పెట్టుకుంటే అధికారంలో వాటా కచ్చితంగా జనసేన కోరుతుంది. అది కూడా ఫస్ట్ టెర్మ్ లోనే కోరుతామని అంటున్నారు. దానికి కారణం రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేమని, బాబుని అసలు నమ్మలేమని జనసైనికుల లోపాయికారి మాటగా ప్రచారంలో అయితే ఉంది.

అది చాలా ట్రబులిచ్చే పొత్తు ఒప్పందమే అవుతుంది. పొత్తు లేకుండా ఒంటరిగా దిగితే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లను భారీ ఎత్తున చీల్చడం ఖాయం. అపుడు కూడా విజయం దక్కదు. ఇలా డోలాయమానంలో చంద్రబాబు ఉంటూండగా చేసిన కర్నూల్ టూర్ లో ఆయన ఆవేశం అసహనం అంతా బయటపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. లేకపోతే ఫార్టీ యియర్స్ ఎక్స్ పీరియన్స్ ఉన్న చంద్రబాబు లాంటి వారి నోటి వెంట ఆవేశపూరితమైన అనుచితమైన పదజాలం దొర్లడం మీద అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక కర్నూల్ టూర్ లో చంద్రబాబు లస్ట్ చాన్స్ నాకు ఈ ఎన్నికలు అని కూడా జనాలకు చెప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక ఇంతే సంగతులు అన్నట్లుగా ఆయన చెప్పినట్లు అయింది. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగులో చంద్రబాబు దానికి కొనసాగింపుగా మరో మాట అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించకపోతే ఏపీని ఎవరూ కాపాడలేరని ఆయన ఒక రకంగా జనాలను ఎమోషనల్ గా కనెక్ట్ చేసే తీరున మాట్లాడారు.

మీ బిడ్డల కోసం, మీ అభివృద్ధి కోసమే టీడీపీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని కానీ రాష్ట్రానికి మాత్రం టీడీపీ అవసరం ఉందని బాబు చెప్పడం బట్టి చూస్తే ఆయనలో ఏవో తెలియని కొత్త సందేహాలు వెంటాడుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో కొత్త రక్తం ప్రవేశించింది. జగన్ పవన్ ఇద్దరూ దాదాపుగా ఒకే వయసు కలిగిన వారు. ఇద్దరికీ పొలిటికల్ గ్లామర్ ఉంది. మరిన్నాళ్ళు రాజకీయం చేసే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి.

అదే టైం లో టీడీపీకి మాత్రం చంద్రబాబు రూపంలో మాత్రమే నాయకత్వం ఉంది. ఆయన తరువాత ఎవరూ అంటే ఈ రోజుకు జవాబు లేదు, వచ్చే ఏడాది నుంచి లోకేష్ చేసే పాదయాత్ర, దానికి జనాల నుంచి వచ్చే స్పందనతో లోకేష్ మీద ఏమైనా కొత్త ఆశలు పెట్టుకుంటే అపుడు పెట్టుకోవాలి. ఏది ఏమైనా రాజకీయ నాయకుడు అంటే గెలుపు తీరాలకు చేర్చేవారు. ఆ విషయంలో చూస్తే లోకేష్ కంటే చంద్రబాబునే ఈ రోజుకీ టీడీపీ లీడర్ గా ఆమోదిస్తుంది. దాంతో యూత్ ఫ్లావర్ లేక టీడీపీ ఒక విధంగా ఇబ్బంది పడుతోంది.

కొత్త ఓటర్లు, యువత ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే 2024 ఎన్నికల్లో చంద్రబాబు విజనరీ ఆయన చాణక్యం, ఆయన సుపరిపాలన ఒక తరం ఓటర్లకే పరిమితం అవుతున్న వేళ నిజంగానే బాబులో గుబులు రేగడాన్ని అర్ధం చేసుకోవాలి. టీడీపీకి ఇపుడు అర్జంటుగా కావాల్సింది యువ నాయకత్వం. దాన్ని లోకేష్ ని పదును పెట్టి భర్తీ చేసుకుంటారా లేక ఎవరినైనా కొత్తగా తెచ్చి పెట్టుకుంటారా చూడాలి. ఏది ఏమైనా ఇపుడున్న ఏపీ రాజకీయ ముఖచిత్రంలో వైసీపీ జనసేనలతో పోలిస్తే టీడీపీ గ్రాండ్ ఓల్డ్ పార్టీగానే ఉంది. అందుకే చివరి ఎన్నికల అస్త్రాన్ని బాబు తీశారని అంటున్నారు. మరి ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.