Begin typing your search above and press return to search.

జై వైసీపీ అంటున్న విపక్షం ..?

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 AM GMT
జై వైసీపీ అంటున్న విపక్షం ..?
X
ఏపీ మరో శ్రీలంకగా మారుతుంది అనే నినాదాన్ని చాలా కాలంగా వినిపిస్తున్న వస్తున్న విపక్షాలు ఇపుడు టోన్ సవరించాయి. అలా ఇలా కాదు ఒట్టేసి మరీ చెబుతున్నాయి ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పధకమూ ఆపమని చెబుతున్నాయి. నిన్న విజయనగరంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఇదే హామీ ఇస్తే ఇపుడు చంద్రబాబు కర్నూలో రోడ్ షోలో జనానికి ఇదే మొర పెట్టుకున్నారు.

నన్ను నమ్మండి సంక్షేమ పధకం ఒక్కటి కూడా ఆపమని బాబు గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన మాట మాట్లాడారు, ఇంతకీ ఎందుకు ఇలా విపక్షం యూ టర్న్ తీసుకుంది. ఇప్పటిదాకా చూస్తే బాగా దుబారా చేస్తున్నారు, డబ్బులను చిల్ల పెంకుల కంటే దారుణంగా వెదజల్లుతూ పంచుడు ప్రోగ్రాం చేస్తున్నారు అని వైసీపీని జగన్ని తూర్పారా పట్టిన ఆ గొంతుకలే ఇపుడు రివర్స్ రూట్ వేస్తున్నాయి.

తాము అధికారంలోకి వస్తే అన్ని పధకాలూ ఇస్తామని చెబుతున్నాయి. మరి ఆ మాత్రం సౌభాగ్యానికి వైసీపీ గద్దె దిగడం ఎందుకు విపక్షాలు అధికారంలోకి రావడం ఎందుకు. జగన్నే కంటిన్యూ చేస్తే పోలా. ఇది సింపుల్ లాజిక్ కదా. పైగా ఏపీ అప్పుల్లో ఉంది అని చెబుతూ తాము కూడా అదే పని చేస్తామని చెప్పడం ద్వారా విపక్షాలు ఏ బాటలో నడుస్తున్నాయి అన్న డౌట్లు అయితే అందరికీ వస్తున్నాయి.

ఇక ఎవరైనా మాట మీద ఉండాలి. విపక్షం తాము మూడున్నరేళ్ళుగా చేస్తున్న ఆరోపణ మీద లేదా తాము నిజమని చెబుతున్న దాని మీద కట్టుబడకపోతే జనాలు ఏమనుకుంటారు అన్నది కూడా ఆలోచించాలి కదా. ఇక్కడే విపక్షాల విశ్వాసం దెబ్బ తింటుంది కదా. జగన్ రుణ మాఫీ విషయంలో నాడు ఏమి చెప్పారో 2019 ఎన్నికల వేళ కూడా అదే మాట మీద ఉన్నారు కదా. తన వల్ల కాదు తాను చేయలేనని ఆయన చెప్పారు కదా.

అఫ్ కోర్స్ అంతకంటే పెద్ద బాధ్యతలనే నవరత్నాల రూపంలో ఆయన భుజానికి ఎత్తుకున్నారు అది వేరే విషయం. కానీ టీడీపీ చెప్పిన రుణ మాఫీ ఆ పార్టీ అమలు చేయలేకపోయిన దాన్ని తాను చేస్తాను అని జగన్ ఎందుకు చెప్పలేదు, రుణ మాఫీ మీద మంచో చెడో ఒక డెసిషన్ పార్టీ పరంగా తీసుకున్నాం కాబట్టి కట్టుబడి ఉందామనే జగన్ అలా చేశారు అనుకోవాలి. అది విశ్వసనీయతను పెంచింది కూడా.

మరి అదే తీరున టీడీపీ అయినా జనసేన అయినా ఉండాలి కదా. నిజంగా స్కీమ్స్ ఇస్తామంటే గ్రామీణ ఓటర్లు ఎంతవరకూ నమ్ముతారో తెలియదు కానీ తటస్థులు మధ్య తరగతి వర్గాలు, విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఈ పార్టీలకు దూరం అవుతాయన్న డౌట్లు అయితే ఉన్నాయి కదా.

ఇక చంద్రబాబు మరో మాట చెబుతున్నారు. తాము మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే మూడు వేల రూపాయల దాకా పెన్షన్ చేసేవారమని, మరి చంద్రబబు అధికారంలో ఉండగా చివరి రెండేళ్ళు మాత్రమే రెండు వేల రూపాయలు ఇచ్చారు. అది కూడా జగన్ పాదయాత్రలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాక చెప్పిన మాట అది.

దాని మీద జగన్ మళ్ళీ ఇచ్చిన హామీయే మూడు వేల పెన్షన్. అది కూడా తాము అయిదేళ్ళలోనూ అలా పెంచుకుంటూ పోతామని ఆయన చెప్పారు. ఇది కదా వాస్తవం. ఇప్పటికి 2,500 దాకా పెన్షన్ వస్తోంది. 2023 జనవరి నుంచి అది కాస్తా 2,750 అవుతుందని జగనే చెప్పారు. 2024 ఎన్నికల వేళకు ఆ మూడు వేలు ఆయన సీఎం గా ఉండగానే ఇస్తారు. మరి దాన్ని ఏ అయిదు వేలకో తీసుకుపోతామని ఎన్నికల వేళకు బాబు చెబుతారా.

అలా చెబితే అప్పుడు అప్పులు పెరగవా. ఏపీలోటీడీపీ ఏలుబడిలోనూ అప్పులు ఉన్నాయి. విభజన నాటి నుంచి ఆదాయం అయితే అసలు లేదు. బాబు చెబుతున్నట్లుగా ఏపీలో సంపద సృష్టి జరగాలన్నా మరో పది పదిహేనేళ్ళు పడుతుంది. ఈ లోగా ఇలా అనవసర పధకాలు తగ్గించుకుంటే అప్పులు తగ్గుతాయి.

అంతే తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం దూకుడు చేసి పధకాలు మేము మీ కంటే ఎక్కువ ఇస్తామని ఒకరికి పోటీగా మరొకరు జనంలోకి వెళ్తే ఏపీ కచ్చితంగా అపుడు శ్రీలంక అవుతుంది. ఏది ఏమైనా స్కీముల పేరిట పొలిటికల్ గేమ్స్ మాత్రం సాగుతున్నాయి ఏపీలో. ఇక జగన్ పధకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా విపక్షం వైసీపీకి జై కొట్టినట్లే అని ఆ పార్టీ వారు అంటున్నారు. ఇక తీర్పు చెప్పాల్సింది ఓటర్లే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.