Begin typing your search above and press return to search.

టీడీపీకి హైప్ పెరిగేదేలా... అన్నీ ఉన్నా కానీ...?

By:  Tupaki Desk   |   13 Aug 2022 12:30 AM GMT
టీడీపీకి హైప్ పెరిగేదేలా... అన్నీ ఉన్నా కానీ...?
X
తెలుగుదేశం పార్టీ అంటే ఆషామాషీ పార్టీ కాదు. బలంగా పుట్టి బలంగా ఎదిగి పాతుకుపోయిన పార్టీ. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు అని అంటారు. అది టీడీపీకి ఇపుడు తెలిసివస్తోంది అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలను చూసిన పార్టీ. ఎన్నో సార్లు అధికారం అందుకున్న పార్టీ. అయితే ఆ పార్టీ ఇపుడు కాలానికి తగినట్లుగా అప్ టూ డేట్ అవడంలేదా అన్నది ఒక చర్చ అయితే ఉంది. టీడీపీ అంటే సీనియర్ల పార్టీగా మరో ముద్ర పడిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు 1995లో సీఎం అయ్యారు. అంటే ఇప్పటికి 27 ఏళ్ల క్రితం.

నాటికి బాబు గారి వయసు నాలుగున్నర పదులు దాటింది. అంటే యువ ముఖ్యమంత్రిగా అంతా చూసేవారు. యువకుడిగా అప్పట్లో బాబు మంత్రివర్గం ఉండేది. అదంతా ఒక మోజు క్రేజూ తెచ్చింది. ఇక ఇప్పటికి అనేక జనరేషన్స్ మారాయి కానీ బాబుతో పాటు ఆయన టీమ్ మాత్రం మారలేదు. టీడీపీ వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే మళ్ళీ చంద్రబాబే.

బాబు సీనియర్ కావచ్చు అనుభవం ఉండవచ్చు. కానీ ఆయన పాలన అంటే అందరికీ తెలిసిందే. అంటే కొత్తదనం ఏముంటుంది అన్న ఆలోచన చాలా మందిలో పేరుకుపోతోంది. ఇక టీడీపీలో బాబు తరువాత తరం గట్టిగా పుంజుకోలేదు. కనీసం కొడుకు లోకేష్ అయినా అంది వస్తే ఆయన మీద మోజు పెరిగేది. బాబు పాలన చూశాం, లోకేష్ ఎలా పాలిస్తారో అన్న ఉత్కంఠ పెరిగేది. సైకిల్ పార్టీకి ఓట్లేసేందుకు జనాలను క్యూ కట్టించేది.

కానీ లోకేష్ ఇంకా ఆ స్థాయికి రాలేదని సొంత పార్టీ వారే చెబుతున్నారు. ఇక మళ్లీ చంద్రబాబేనా అంటేనే జనాలలో పెద్దగా అది కదలిక అది తెప్పించలేకపోతోంది. తెలుగుదేశానికి ఇపుడు అన్నీ ఉన్నాయి. ఏ పార్టీకి లేనంత ఐక్యత సామాజికవర్గం బలం ఆ పార్టీ సొంతం. అలాగే అనుకూల మీడియా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక వ్యూహాలలో బాబు దిట్ట. ఢిల్లీ లెవెల్ లో ఏ పార్టీ ఉన్నా బాబుకు అధికారం లేకపోయినా ఆయన హవాయే సాగుతోంది. అలాగే కీలక వ్యవస్థలలో టీడీపీకి మద్దతు ఉందని చెబుతారు.

ఇలా అన్నీ ఉన్నా టీడీపీకి సోషల్ మీడియాలో క్షణాల్లో ఏ విషయం అయినా వైరల్ చేసే భారీ సైన్యం ఉన్నా కూడా జనాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ రావడంలేదు. నిజానికి ఏపీలో జగన్ పాలన ఏమీ గొప్పగాలేదు. జగన్ అనుభవ రాహిత్యం చాలా విషయాల్లో క్లియర్ గా కనిపిస్తోంది. అభివృద్ధి అన్న మాట లేదు. అప్పుల కుప్పగా ఏపీ ఉంది. భవిష్యత్తు తలచుకుంటే చాలా భయం వేసేలా ఉంది. కానీ మూడున్నరేళ్ళ పాలనకు జగన్ దగ్గర పడుతున్నా వైసీపీని దాటి టీడీపీ ముందుకు వెళ్లలేని పరిస్థితి.

గత నెలలో ఇండియా టీవీ. ఈ నెలలో ఇండియా టుడే ఇలా వేరు వేరు ఏజెన్సీలు సర్వేలు చేసి ఏపీలో మళ్ళీ జెండా ఎత్తేది జగనే అని చెబుతున్నాయి. అంటే జగన్ జనాదరణ బాగుందని అనుకోవాలా లేక సరైన ఆల్టర్నేషన్ ఏపీలో లేదని అనుకోవాలా. ఈ విషయం కచ్చితంగా చర్చించాల్సిందే. ఏపీలో చూస్తే నిక్కచ్చి అయిన మాట ఒకటి ఉంది. ఈ రోజుకి చూస్తే జగన్ కి సరిసాటి లీడర్ విపక్షంలో లేరు. బాబు ని జనాలు జగన్ తో పోల్చి చూడడంలేదు. ఆయనను పెద్దాయనగా చూస్తున్నారు. సీనియర్ గా గౌరవిస్తున్నారు.

ఇక జగన్ ఏజ్ తో మ్యాచ్ అయ్యే పవన్ కళ్యాణ్ కనుక పుంజుకుంటే జగన్ కి అక్కడ నుంచి భారీ పోటీ వస్తుందేమో చూడాలి. పవన్ నిలకడగా రాజకీయం చేసే కచ్చితంగా జగన్ కి గట్టి పోటీదారు అయి తీరుతారు అని చెప్పవచ్చు. టీడీపీ అయితే మాత్రం ఈ రోజుకీ అనుకున్న తీరున గ్రాఫ్ పెంచుకోలేకపోవడానికి పార్టీ పరమైన ఇబ్బందులే ప్రధాన సమస్య అని అంటున్నారు. అయితే గియితే ఈ ఎన్నికల్లోనే టీడీపీ గెలవాల్సి ఉంది. లేకపోతే కష్టమన్న మాట కూడా ఉంది.

అందుకే చంద్రబాబు ఆయనకు మద్దతు ఇచ్చే వారు అంతా గట్టిగానే బరిలోకి దిగుతున్నారు. ఎంత చేసినా అనుకున్న హైప్ తీసుకురాలేకపోతున్నారు. ఎన్నికలు కేవలం ఇరవై నెలల తేడాలో ఉండగా ఒక పాజిటివ్ వాతావరణం ఇంకా టీడీపీకి రావడం లేదు అంటే బాగానే ఆలోచించుకోవాలి. టీడీపీలో నాయకత్వ పరంగా ఇతరత్రా లోపాలను సరిచేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రెష్ లుక్ తో టీడీపీ లీడర్ షిప్ కదిలిరావాలి. టాప్ టూ బాటమ్ యువ టీడీపీగా కనిపించాలి, కళకళలాడాలి. అది సాధ్యమయ్యేపనేనా. చంద్రబాబు ఉండగా మరో నాయకత్వం టీడీపీలో ముందుకు వస్తుందా. ఇంకా ఎన్నికలకు టైమ్ ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ.