Begin typing your search above and press return to search.

ఈ అడుగులు ఎటు వైపు జగన్ ...?

By:  Tupaki Desk   |   22 Sep 2022 3:30 AM GMT
ఈ అడుగులు ఎటు వైపు జగన్ ...?
X
వైసీపీకి అద్భుతమైన మెజారిటీ ఉండడమే ఆ పార్టీకి చేటు తెస్తోందా అంటే ఇపుడు జరుగుతున్న ఉదంతాలను చూస్తే అదే నిజం అనిపిస్తోంది. అసెంబ్లీ అంతా ఏకపక్షం చేసుకుంటూ తమకు నచ్చిన బిల్లులను ఏ రకమైన చర్చా లేకుండా సభలో పెట్టి క్షణాలలో పాస్ చేసుకుంటూ తాజా వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఒక విధంగా ఏకపాత్రాభినయమే చేసింది.

కీలకమైన బిల్లులు అన్నీ ఆమోదం పొందాయి. చర్చ అయితే లేదు. మరో వైపు టీడీపీ సభ్యులు యధా ప్రకారం సస్పెండ్ అవుతూ వచ్చారు. సభలో ప్రతిపక్షం మాట అటుంది ఇది మంచి ఇది కాదు అన్న కనీసపరమైన చర్చ కూడా ఏ కోశానా ఎక్కడా పెద్దగా జరిగినది లేదు. అలాంటి వాటిలో అతి పెద్ద తప్పుగా దొర్లుతోంది ఏది అని చూస్తే ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం.

ఇప్పటికి ఇరవై ఆరేళ్ల క్రితం అసువులు బాసిన ఎన్టీయార్ కీర్తి కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఏదో చేద్దామని తపనతో వచ్చారు. అలా ఆయన తన పాలనలో కొత్త ఆలోచనతో విజయవాడలో హెల్త్ వర్శిటీకి శ్రీకారం చుడితే జగన్ మూడున్నరేళ్ళ తరువాత తనకు పుట్టిన తనదైన మరో కొత్త ఆలోచనతో ఆయన పేరుని సడెన్ గా తీసేసి తన తండ్రి గారి పేరు పెట్టేసుకున్నారు.

దానికి ఆయన చెబుతున్న వాదన ఏ మాత్రం సమర్ధింపుగా లేదు. పైగా దబాయింపుగా జబర్దస్తుగా ఉందని చెబుతున్నారు. జగన్ మొత్తం ఏలుబడిలో అతి పెద్ద బ్లండర్ ఇదే అని అంతా అంటున్నారు. ఒకరి కృషిని మన ఖాతాలో రాసుకోవడం అంటే ఇదే అని కూడా అంటున్నారు. ఎన్టీయార్ 1983లో అధికారంలోకి వస్తే మూడేళ్ళ వ్యవధిలో అంత చక్కని నిర్ణయం తీసుకున్నారు. మరి మూడున్నరేళ్ళు పాలన పూర్తి చేసుకున్న జగన్ అలాంటి వర్శిటీ ఒకటి తాను కూడా నిర్మించి తండ్రి గారి పేరు పెట్టవచ్చు కదా అన్న సూచనలు కూడా వస్తున్నారు.

ఎవరేమనుకుంటే ఏమిటి అన్నట్లుగా చేసిన ఈ పని మీద అంతటా దాదాపుగా ఒకే స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. అసలు ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో జనాలు సర్కార్ గురించి కానీ పార్టీ గురించి కానీ ఏమనుకుంటున్నారో ఎంతో కొంత సమాచారం ఉంటే ఇలాంటి పనులకు ప్రభుత్వ పెద్దలు సాహసించరు అని కూడా అంటున్నారు. అంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్ షాపులు ఏ రకమైన ఫీడ్ బ్యాక్ ఏవీ ఇవ్వలేదు అని తెలుస్తోంది అన్న మాట.

అలాగే సర్వేల పేరిట అందుతున్న సమాచారంలో కూడా సారం ఏ మాత్రం లేదని కూడా తెలుస్తోంది అంటున్నారు. లేకపోతే ప్రజలలో ఇప్పటికే అధికార పార్టీ మీద వ్యతిరేకత బాగా ఉన్న వేళ ఇలాంటి నిర్ణయాలను ఎవరైనా తీసుకుంటారా అన్న మాట ఉంది. అసలు అది సహేతుకమేనా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే వేరేగా పరిస్థితి ఉంటుంది. వాటిని కాదని అర్జంటుగా ఏదో ఉపద్రవం తోసుకొచ్చినట్లుగా ఈ తరహా నిర్ణయాలని తీసుకుంటూంటే సమర్ధించలేక సొంత పార్టీ వారు పడుతున్న పాట్లు అన్నీ కూడా మీడియా కెమరాలకు బాగా దొరికిపోతున్నాయి.

మరో వైపు జగన్ ఎందుకిలా చేస్తున్నారు అని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది అని అంటున్నారు. అధికారం ఎపుడూ ఒకరి సొంతం కాదు, రేపటి రోజున మేము వచ్చి ఏకంగా కడప జిల్లాకు వైఎస్సార్ పెట్టిన పేరుని తీసేస్తామని టీడీపీ వారు అంటున్నారు అంటే ఇది కోరి కెలుక్కునే రాజకీయమే కదా అన్న మాట ఉంది. ఇక ఎన్టీయార్ పార్టీలకు అతీతంగా అందరికీ ఆరాధ్యుడు.

అలాంటి మహానుభావుడు, దివంగతుడైన వారి పేరు మీద మరిన్ని కార్యక్రమాలు ఎవరైనా చేస్తారు. కానీ ఉన్న పేరు పీకేయడం కంటే వికృత రాజకీయం మరోటి ఉందడనే అంటున్నారు. మరి జగన్ వడివడిగా వేస్తున్న ఈ తరహా అడుగులు ఏ వైపునకు అన్న ప్రశ్న అయితే అంతటా వస్తోంది. మరి నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను నాన్న పేరు పెట్టడం కరెక్టేనా కాదా అని జగన్ అసెంబ్లీలో చెప్పారు. మరి ఆయన మనసు ఎస్ అని చెప్పడమే ఇపుడు తప్పు అని అంటున్నారు అంతా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.