Begin typing your search above and press return to search.

టికెట్టు మీద ఆశలుపెట్టుకోవద్దు... బాబాయ్ మార్క్ సందేశం

By:  Tupaki Desk   |   11 Dec 2022 2:30 AM GMT
టికెట్టు మీద ఆశలుపెట్టుకోవద్దు... బాబాయ్ మార్క్ సందేశం
X
పార్టీ అన్నాక నాయకులు ఉన్నాక ఆశలు ఉంటాయి. టికెట్ కోసం ఎంతో మంది రేసులో ఉంటారు. అయితే పార్టీకి పెద్దలుగా వచ్చిన వారు సుద్దులు చెబుతూ పోతున్నారు తప్ప గ్యారంటీ అయితే ఇవ్వడంలేదని వైసీపీలో నేతాశ్రీలు నిరాశపడుతున్నారు. విశాఖ జిల్లాకు వైసీపీ తరఫున రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తనదైన శైలిలో సమీక్షలు చేసుకుంటూ పోతున్నారు.

నాయకులు అనేక సమస్యలు ముందు పెట్టినా పాము చావకుండా కర్ర విరగకుండా సుతిమెత్తగా జవాబులు చెబుతూ అయిందనిపిస్తున్నారు. ఆయన లేటెస్ట్ గా విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టికెట్ ఎవరికి అన్న చర్చ కూడా వచ్చింది. ప్రస్తుతం ఇంచార్జిగా అక్రమాని విజయనిర్మల ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. గత ఏడాది ఆమెకు వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పోస్ట్ ని ప్రభుత్వం ఇచ్చింది.

ఆమె తానే మరోసారి పోటీ చేస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తూర్పులో అనేక మంది ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ సైతం పోటీకి రెడీ అంటున్నారు. విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చాన్స్ ఇస్తే తాను కూడా పోటీకి సిద్ధమని చెబుతున్నారు. వీరితో పాటు కొంతమంది కార్పోరేటర్లు ఆర్ధికంగా గట్టిగా ఉన్న నాయకులు కూడా విశాఖ తూర్పు మీద కన్ను వేశారు.

ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పార్టీని తూర్పులో అంతా కలసి బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఇంచార్జి విజయనిర్మల నాయకత్వంలో అంతా పనిచేయాలని ఆదేశించారు. పార్టీని గట్టిగా నిలబెట్టండి అంటూనే టికెట్ ఎవరికి వస్తుందో తాను కూడా చెప్పలేనని సంచలన కామెంట్స్ చేశారు.

దాంతో విస్తుపోవడం నాయకుల వంతు అయింది. తమలో ఎవరో ఒకరి పేరుని అయినా ఆయన చెబుతారు అనుకుంటే అదేమీలేదు పని చేయడమే మన బాధ్యత అంటూ గీతోపదేశం చేశారు. ఒక్క జగన్ కి తప్ప టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది తనతో సహా మరెవరికీ తెలియదు అంటూ బాబాయ్ చేదు నిజం చెప్పేశారు. అందువల్ల పనిచేసుకుంటూ అధినాయకత్వం మెప్పు పొందండని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈ సీటు కన్ ఫర్మ్ అయిందని, అందుకే వైవీ సుబ్బారెడ్డి నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

అంగబలం అర్ధబలం దండీగా ఉన్న వారికే టికెట్లు అని వైసీపీ హై కమాండ్ భావిస్తున్నందువల్లనే ఎంవీవీని బరిలోకి దింపుతోంది అన్న టాక్ నడుస్తోంది. అదే నిజమైతే పార్టీలో మరిన్ని కొత్త వర్గాలు బయల్దేరి అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్నారు. టికెట్లు ఎవరికిస్తారో తెలియకపోతే పనిచేసుకోవడం ఎందుకు అన్న నిర్వేదం కూడా నేతలలో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.