Begin typing your search above and press return to search.

నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు అంతేనా సంజయ్‌!

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:00 PM IST
నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు అంతేనా సంజయ్‌!
X
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమారుడిపై హైదరాబాద్‌ లోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బహదూర్‌ పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్‌ చదువుతున్న సంజయ్‌ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్‌ సంగతి తెలిసిందే. వర్సిటీకి చెందిన స్టూడెంట్‌ అపెక్స్‌ కోఆర్డినేటర్‌ దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు తన తోటి విద్యార్థిని దారుణంగా తిడుతూ, కొడుతున్న ఘటనను ఖండించకపోగా దీన్ని కేసీఆర్‌ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన కొడుకు చేసింది తప్పేనని.. యూనివర్సిటీ నిబంధనలు, పోలీసులు తమ పని తాము చేసుకుపోతారని చెబితే హుందాగా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బండి సంజయ్‌ అలా చేయకుండా తన కొడుకును వెనకేసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలి కానీ పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సంజయ్‌ ప్రశ్నించడం గమనార్హం. కేసీఆర్‌ కు దమ్ముంటే, మగాడైతే తనతో రాజకీయం చేయాలని సవాల్‌ చేశారు. తనతో చేయడం చేతగాక, తనను తట్టుకోలేక తన కొడుకును రాజకీయాల్లోకి లాగుతావా అని కేసీఆర్‌ ను నిలదీశారు.


కేసీఆర్‌ మనవడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తానే ఖండించానని బండి సంజయ్‌ గుర్తు చేశారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? అని నిలదీశారు. తన కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? అని ధ్వజమెత్తారు. అయినా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటారని.. మళ్లీ కలుస్తారని అన్నారు. మరి తన కొడుకుపై కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ మండిపడ్డారు.

కేసీఆర్‌ మనిషి కాదని.. ఆయన పాపం పండిందని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును పోలీస్‌ స్టేషన్‌లో తానే సరెండర్‌ చేస్తానన్నారు. థర్డ్‌ డిగ్రీ ఉపయోగిస్తవా? లాఠీలతో కొట్టిస్తవా? చూద్దామని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆ అమ్మాయి, తన కొడుకు, ఆ అబ్బాయి జీవితాలను నాశనం చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ హుందాగా ఉండాల్సింది పోయి తన కొడుకు ఉదంతాన్ని రాజకీయాలకు ముడిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్‌ కుమారుడు తప్పు స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని ఖండించకుండా మొత్తం కేసీఆర్‌ ప్రభుత్వమే కుట్ర చేసిందన్నట్టు మాట్లాడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.