Begin typing your search above and press return to search.

పాతికేళ్ల వైరం నింపుకున్న దగ్గుబాటి... కానీ ఇపుడు...?

By:  Tupaki Desk   |   3 Aug 2022 2:30 AM GMT
పాతికేళ్ల వైరం నింపుకున్న దగ్గుబాటి... కానీ ఇపుడు...?
X
తెలుగుదేశం రాజకీయాలను బాగా పరికించిన వారికి తోడళ్ళుల గురించి కూడా బాగా తెలిసే ఉంటుంది. ఎనభైలు, తొంభైల మధ్యలో ఇద్దరు అల్లుళ్ళూ మామ ఎన్టీయార్ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో అగ్ర స్థానాన ఉండేవారు. నాడు ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకీ చిన్నల్లుడు చంద్రబాబుకీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక ఇద్దరికీ వారికంటూ అనుచరులు ఆయా జిల్లాలలో బలంగా ఉండేవారు.  

ఇద్దరూ పోటాపోటీగా టీడీపీలో పనిచేస్తూ ఆధిపత్యం కోసం వ్యూహ రచన చేసేవారు. అయితే అప్పటికే రాజకీయంగా విశేష అనుభవం ఉండడం వల్ల బాబు పార్టీలో మెజారిటీని తన గుప్పిట పట్టుకున్నారు. ఇక నైతిక ముద్ర కోసం మద్దతు కోసం ఎంటీయార్ ఫ్యామిలీని కలుపుకున్నారు. ఆ విధంగా ఎన్టీయార్ కుమారులు బాలయ్య, హరిక్రిష్ణలతో పాటు పెద్దల్లుడు దగ్గుబాటి అవసరం కూడా పడింది.

మొత్తానికి అంతా కలసి 1995 ఎపిసోడ్ లో ఎన్టీయార్ ని దించేశారు. అయితే అది జరిగిన తరువాత అధికార వాటా దగ్గుబాటికి దక్కలేదు. దాంతో  ఆయన బాబు సీఎం అయి నెలలు తిరగకుండానే ఎన్టీయార్ వైపు వచ్చేశారు. ఎన్టీయార్ మరణాంతరం కాంగ్రెస్ వైపు చేరి తాను ఎమ్మెల్యేగా తన భార్య ఎన్టీయార్ కుమార్తె పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. ఆ మీదట పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది.

ఇలా ఢీ అంటే ఢీ అంటూ కాంగ్రెస్ పక్షాన నిలిచిన దగ్గుబాటి దంపతులు బాబుతో వైరమే అన్నట్లుగా చాన్నళ్ళు రాజకీయ కధ నడిపారు. అయితే విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పతనం కావడంతో పాటు మరో పార్టీ లేక పురంధేశ్వరి బీజేపీలో చేరితే వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చారు.

ఇక బీజేపీలో ఉన్నా పురంధేశ్వరికి ఏ పదవీ దక్కలేదు. దాంతో ఆమె కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కూడా దగ్గుబాటి ఫ్యామిలీ వైపు చూడడంతో పాతికేళ్ల వైరం మరచి మరీ దగ్గుబాటి తోడల్లుడితో మరోసారి చేతులు కలిపారు. ఇక దగ్గుబాటికి రాజకీయాల మీద ఆశ లేదు. పురంధేశ్వరి కూడా బీజేపీతోనే తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు.

తమ కుమారుడు హితేష్ చెంచురాంని రాజకీయ నేతగా చూడాలన్నదే వారి కోరిక. దాని కోసం దగ్గుబాటి పాతికేళ్ళ తన వైరాన్ని చంద్రబాబుతో తన పాత కోపాలను సైతం పక్కన పెట్టి మరీ చేతులు కలిపారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి హితేష్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తాడు అని అంటున్నారు. ఇక అక్కడ అనేసార్లు దగ్గుబాటి గెలిచి ఉండడంతో పాటు టీడీపీకి పట్టు ఉండడం వల్ల హితేష్ రాజకీయ అరంగేట్రం చాలా సాఫీగా సాగుతుంది అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ లో తన పాత్ర పెద్దగా లేదని, అంతా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు కలసి చేశారని అనేక వ్యాసాలు ఆర్టికల్స్  రూపంలో గత పాతికేళ్ళుగా దగ్గుబాటి రాస్తూనే ఉన్నారు. అలాగే ఆయన అప్పట్లో ఏమి జరిగింది అన్న దాన్ని గ్రంధస్థం కూడా చేశారు. దగ్గుబాటి వెర్షన్ లో ఎలా చూసుకున్నా బాబే మొత్తానికి కీలక పాత్రధారి. అలాంటి దగ్గుబాటిలో కీలకమైన మార్పు రావడం, బాబుతో చేతులు కలపడం అంటే నిజంగా రాజకీయాల‌లో ఏదైనా సాధ్యమని చెప్పడానికి ఇదొక్కటి చాలు అనే వారున్నారు.

ఈ మధ్య ఒక వివాహా వేడుకలలో కలసిమెలసి మాట్లాడుకున్న తోడల్లుళ్ళు  ఆ మీదట తమ రిలేషన్స్ ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక లేటెస్ట్ గా దగ్గుబాటి ఆసుపత్రిలో చేరితే బాబు వెళ్ళి పరామర్శించారు. అలా మరింత బంధం పెనవేసుకుంది. మరి దగ్గుబాటి కేవలం తెర వెనక ఉండి కొడుకుని పంపిస్తారా లేక టీడీపీలో పదవులు కోరుకుంటారా. దానికి బాబు అంగీకరిస్తారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి.