Begin typing your search above and press return to search.

కేటీఆర్ లో చంద్రబాబు.. ఇది చదివాక మీరు సైతం ఓకే చెబుతారు

By:  Tupaki Desk   |   20 March 2022 12:30 AM GMT
కేటీఆర్ లో చంద్రబాబు.. ఇది చదివాక మీరు సైతం ఓకే చెబుతారు
X
ఇవేం మాటలండి. అసలేమైనా పోలిక ఉందా? బోడిగుండుకు మోకాలికి భలేగా లింకులు పెట్టేస్తారే? అని అనుకోవచ్చు. కానీ.. తరచి చూసినప్పుడు మాత్రమే కనిపించే అంశాల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన మీడియా సంస్థలు కథనాల రూపంలో ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే.. కేటీఆర్ లో చంద్రబాబు స్టైల్ ను చెప్పే ధైర్యం ఏ మీడియా సంస్థ చేస్తుంది చెప్పండి. నిజానికి ఆ కాంబినేషన్ కూడా రోటీన్ కు భిన్నమని చెప్పాలి. ఇక.. విషయంలోకి వెళితే..

తండ్రి మాదిరి నైపుణ్యంగా మాట్లాడటం రాదు కానీ.. కేసీఆర్ లోటును తీర్చేలా మాట్లాడటంలో కేటీఆర్ కు మంచి మార్కులే వేయొచ్చు. తమను టార్గెట్ చేసే వారిని ఉద్దేశించి కేటీఆర్ మాటల్ని చూసినప్పుడు.. కేసీఆర్ లక్కీ అనుకోవాల్సిందే. రాజకీయ అధినేతల వారసులు ఎవరూ కేటీఆర్ అంత టాలెంట్ కాదన్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు.. కేసీఆర్ కు కేటీఆర్ అద్రష్టం కాకుండా మరేంటి? ఇంతకూ చంద్రబాబుకు.. కేటీఆర్ కు కామన్ గా ఉండే లక్షణాలు ఏమున్నాయన్న సందేహం రావొచ్చు.

చంద్రబాబుకు కార్పొరేట్ ప్రపంచానికి ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తర్వాత.. కార్పొరేట్ కంపెనీలు.. వాటి అధినేతల్ని ఆకర్షించే గుణం.. సీనియర్ అధికారులతో రాష్ట్రం గురించి గొప్పలు చెప్పి.. మీటింగ్ అరేంజ్ చేసేలా చేసుకోవటంలో కేటీఆర్ టాలెంట్ కనిపిస్తుంటుంది. కేటీఆర్ తో పోలిస్తే ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెనుకబడతారనే చెప్పాలి.

చంద్రబాబు అన్నంతనే విదేశీ పర్యటనలు గుర్తుకు వస్తాయి. ఆయన సీఎంగా వ్యవహరించే కాలంలో ఆయన తరచూ ఏదోఒక పర్యటనలో భాగంగా అటు విదేశాలకు కానీ.. ఇటు ఢిల్లీ టూర్లను కానీ వరుస పెట్టి చేస్తుంటారు. అంతలా పర్యటనలు చేసే గుణం మళ్లీ కేటీఆర్ లోనే కనిపిస్తుంటుంది. ఇక.. గడిచిన పది రోజులుగా కేటీఆర్ షెడ్యూల్ ను చూస్తే.. పలు డెవలప్ మెంట్ ప్రోగ్రాంలకు అయితే శంకుస్థాపన.. లేదంటే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినంతనే.. తాజాగా ఆయన అమెరికాకు వెళ్లారు. పది రోజుల పాటు సాగే ఈ ట్రిప్ లో ఆయన అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

బాబుకు.. కేటీఆర్ కు మధ్యనున్న తేడా ఏమంటే.. ఆయన తన విదేశీ పర్యటనకు ముందు నుంచే దాని గురించి గొప్పలు చెప్పుకోవటం.. విపరీతమైన ప్రచారాన్ని చేసుకోవటం కనిపిస్తుంది. కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. లాస్ ఏంజిలెస్ తో మొదలయ్యే కేటీఆర్ టూర్.. శాండియాగో.. శాన్ జోస్.. బోస్టన్.. న్యూయార్క్ లలో కొనసాగుతుంది. తాజా టూర్ లో భాగంగా ప్రముఖ ఆర్థిక సంస్థల అధిపతులు.. సీఈవోలతో కేటీఆర్ భేటీ కానున్నారు. పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీలుగా ఈ ట్రిప్ ఉందంటున్నారు. ఈ మాటలన్నీ ఎక్కడో విన్నట్లు అనిపిస్తాయి కానీ.. ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఉండే వేళలో చంద్రబాబు నోటి నుంచి కానీ ఆయన సన్నిహితుల నుంచి వచ్చే మాటలే. ఇప్పుడు అర్థమైందా? చంద్రబాబు పాలనా శైలి కేటీఆర్ లో ఎంతలా కనిపిస్తుందో?