Begin typing your search above and press return to search.

జగన్ కామెంట్స్ వెనక : కాపు ఓట్లన్నీ పవన్ మూట కట్టేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   30 July 2022 1:30 AM GMT
జగన్ కామెంట్స్ వెనక : కాపు ఓట్లన్నీ పవన్ మూట కట్టేస్తున్నారా...?
X
కాపు ఓట్లు ఈసారి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని అంతా భావిస్తున్నారు. నిజానికి విభజన ఏపీలో అత్యధిక శాతం ఉన్న కాపు ఓట్లతోనే ఎవరైనా అందలం ఎక్కాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో పవన్ మద్దతు కలసి వచ్చిన వేళ టీడీపీకి కాపులు పెద్ద సంఖ్యలో ఓటీసి అధికారాన్ని ఇచ్చారు. దాంతో బాబు గెలిచారు. 2019 నాటికి కాపులలో మెజారిటీ వర్గం వైసీపీకి జగన్ కి జై కొట్టారు. దాంతో గోదావరి జిల్లాలలో ఆయన స్వీప్ చేశారు. టోటల్ గా ఏపీలో 151 సీట్ల బంపర్ విక్టరీ దక్కింది.

మరిపుడు అంటే 2024 ఎన్నికల్లో కాపుల ఓట్లు ఎటు టర్న్ అవుతాయన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. నిజానికి కాపులు 2009 ఎన్నికల్లో గంపగుత్తగా ప్రజారాజ్యం పార్టీకి వేశారు. తమసామాజిక వర్గానికి చెందిన వాడే నాయకుడని, ఆయనే సీఎం అవుతారని నమ్మి వారు ఓటేశారు. ఆ తరువాత మాత్రం వారు మళ్లీ క్యాస్ట్ పాలిటిక్స్ జోలికి పోలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కాపులు పంతం మీద ఉన్నారని అంటున్నారు.

తమకు ఒక పార్టీగా జనసేన ఉందని, అలాగే తమ నాయకుడు పవన్ సీఎం కావాలన్న బలమైన కోరిక ఉందని అంటున్నారు. అందుకే ఈసారి అత్యధిక శాతం కాపుల ఓట్లు జనసేనకు పడతాయని అంటున్నారు. ఇవి వట్టి విశ్లేషణలు మాత్రమే కావు, పక్క సర్వేలు చెప్పిన నిజాలు అంటున్నారు. మరి జగన్ కి కూడా అనేక సర్వే రిపోర్టులు వస్తూంటాయి. ఆయన వడపోత పడుతూ ఉంటారు.

అందుకే పిఠాపురంలో జరిగిన కాపునేస్తం పధకం పంపిణీ బహిరంగ సభలో జగన్ కాపు సోదరులకు ఒక సందేశం వినిపించారు. కాపు ఓట్లను అన్నీ కూడా పవన్ కట్ట కట్టి మూటకట్టి చంద్రబాబుకు అమ్మేయాలని చూస్తున్నారు అని జగన్ సంచలన కామెంట్స్ చేశారు. కాపుల ఓట్లను పవన్ కి వేస్తే ఆయన చంద్రబాబుని సీఎం చేయడానికే వాటిని ఉపయోగిస్తారు అన్న భావాన్ని జగన్ చెప్పకనే చెప్పారన్న మాట.

అందువల్ల పవన్ తో జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. దత్తపుత్రుడు టీడీపీకి ఉన్నారు. అలాగే అనుకూల మీడియా ఉంది. నాకు మాత్రం మీరే ఉన్నారు అని జగన్ చెప్పుకున్నారు. ఇదే సభలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పవన్ వలలో కాపు సోదరులు పడవద్దు అని హెచ్చరించడం విశేషం. ఆరు నూరు అయినా జగన్ని సీఎం చేయడానికి కాపులంతా తగ్గేదే లే అని శపధం చేయాల‌ని ఆయన అన్నపుడు వేదిక మీద ఉన్న జగన్ సైతం నవ్వులు చిందించారు.

ఇక్కడ ఒక్క విషయం చూడాలి. కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న అనేక నియోజకవర్గాలు గోదావరి జిల్లాలలో ఉన్నయి. దాంతో ఆ ఓట్లు ఈసారి తమకు దక్కకుండా పోతాయన్న డౌట్ ఏదో వైసీపీకి కొడుతున్నట్లుగా ఉంది. అందుకే మంత్రి, ముఖ్యమంత్రి సైతం కాపులెవ్వరూ పవన్ని నమ్మవద్దని కోరుతున్నారు. అయితే కాపులు ఆల్ రెడీ డిసైడ్ అయ్యారని, ఎవరెన్ని చెప్పినా వారు మాత్రం జనసేన జెండా వీడరని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి పవన్ కి కాపుల ఓట్లు దండీగా ఉన్నాయన్న సత్యాన్ని జగన్ సహా మంత్రులు పిఠాపురం సభలో వినిపించారు అని అంటున్నారు.