Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రువు నిలిపేది `పాద‌యాత్రే`నా?

By:  Tupaki Desk   |   4 Oct 2022 12:30 AM GMT
ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రువు నిలిపేది `పాద‌యాత్రే`నా?
X
ఈ ఏడాది న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కాలంలో గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. తాజా అంచ‌నా ప్ర‌కారం.. ఇక్క‌డ బీజేపీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో స్థానంలో ఉండి.. ప్ర‌తిప‌క్షంగా ప‌రువు నిలుపుకొంటున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ శాపంగా మారింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ మూడో స్తానానికి వెళ్లిపోతుం ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప‌రువు నిలిపేది.. ఒక్క పాద‌యాత్రేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గుజరాత్‌లో అహ్మద్ పటేల్ మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు గుజరాత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు దెబ్బమీదదెబ్బ తగిలింది. పార్టీకి సమర్థ నాయకుడెవరూ లేకపోవడం హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆరుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బెడద కాస్త ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీలు చీల్చనున్నాయి.

ఇది కూడా కమలనాథులకు కలిసి వస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఊహించనంత మద్దతు లభిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.

భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రంలోని మోడీ సర్కారుకు సమరభేరీ మోగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోనూ పాదయాత్ర కొనసాగించనున్నారు. తన పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసుకుని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపునకు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబడుతుంది. రాహుల్ పాదయాత్ర గుజరాత్‌లో తప్పకుండా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా కాంగ్రెస్ బీజేపీకి గట్టి సవాలు విసరగలుగుతుంది.

రాహుల్ పాదయాత్ర కనుక గుజరాత్‌లో ప్రభావం చూపించకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతుంది. ఈ పరిణామాలు ఇప్పటికిప్పుడు మేలు చేకూర్చకపోయినా గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కుకోవడానికి దోహదపడతాయి. రాహుల్ పాదయాత్ర గుజరాత్‌లో ప్రభావం చూపించకపోతే 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీయే బీజేపీకి ప్రత్యర్థిగా మారుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.