Begin typing your search above and press return to search.

బీజేపీ టీడీపీ కలవకపోతే పెద్ద చిక్కేనే...చిన్నమ్మ రాజకీయం ఏటో...?

By:  Tupaki Desk   |   25 Oct 2022 3:30 PM GMT
బీజేపీ టీడీపీ కలవకపోతే పెద్ద చిక్కేనే...చిన్నమ్మ  రాజకీయం ఏటో...?
X
ఎన్టీయార్ కుమార్తె కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి ఇపుడు పెద్ద చిక్కు వచ్చి పడింది అంటున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోమని కచ్చితంగా చెబుతోంది. అదే టైం లో టీడీపీని అవినీతి కుటుంబ పార్టీగా విమర్శిస్తోంది. తమకు జనసేన తరఫున మాత్రమే పొత్తు ఉంటుందని కూడా అంటోంది. దాంతో తన చిన్నమ్మ సొంతింట రాజకీయం పండేలా కనిపించడంలేదు అంటున్నారు. అదెలా అంటే బీజేపీలో చేరిన పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయలని చూస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులతో తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. 2024లో మరోసారి మోడీ సర్కార్ వస్తే కచ్చితంగా ఈసారి కేంద్ర మంత్రి అవడం ఖాయమని భావిస్తున్నారు.

అదే టైం లో ఎటూ పొత్తు ఉంటుంది కాబట్టి తన ఏకైక వారసుడు హితైష్ ని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకుంటే భవిష్యత్తులో తన ఆయన రాజకీయం సాఫీగా సాగుతుంది అని ఆశిస్తున్నారు. అయితే ఇపుడు బీజేపీ అడ్డం తిరుగుతోంది. పొత్తు అన్నది టీడీపీతో లేదు అని చెబుతోంది. దాంతో బీజేపీలో చిన్నమ్మకు గెలుపు ఇబ్బంది అవుతుంది. అలాగే కొడుకుని టీడీపీలోకి పంపడం కష్టమవుతుంది అంటున్నారు.

ఒకవేళ హితేష్ ని స్వతంత్రించి టీడీపీలోకి పంపినా వేరే సంకేతాలు వెళ్తాయని కూడా అంటున్నారు. ఇప్పటికే బీజేపీకి చిన్నమ్మ పూర్తిగా సహకరించడంలేదని, టీడీపీ నుంచి నాయకులను తీసుకురావడంలో విఫలం అయ్యారని బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆమె ఏపీలో చేరికల కమిటీ చైర్మన్ అన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. టీడీపీ అంటే మండిపడుతున్న బీజేపీకి తన పార్టీ నేత కుమారుడు అదే టీడీపీ నుంచి పోటీ చేస్తే ఎలా తట్టుకోగలదు అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.

దీంతో చిన్నమ్మ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. పోనీ టీడీపీలోకే తల్లీ కొడుకులు ఇద్దరూ జంప్ చేసినా టికెట్ ఎవరో ఒకరికే దక్కుతుంది. అపుడు రెండవవారు పూర్తిగా ఆగిపోవాలి. పైగా టీడీపీలో కొడుకుని పంపుతారు కానీ దగ్గుబాటి దంపతులకు తాము ఆ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేదు. బీజేపీ జాతీయ పార్టీ అని తాను కేంద్ర మంత్రిగా చేశాను కాబట్టి మళ్ళీ అలాంటి కీలకమైన పదవి తనకు తప్పకుండా వస్తుందని ఆమె ఆశిస్తున్నారు

ఈ క్రమంలో దగ్గుబాటి వారింట ఈ పొత్తులు వీడని రాజకీయ చిక్కుల కధ చర్చకు వస్తోందిట. 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పర్చూరు లో పోటీ చేసి ఓడారు. పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు.

అయితే ఇద్దరూ వేరు వేరు పార్టీలలో వద్దు అని ఉంటే ఒకే పార్టీలోనే ఉండాలని వైసీపీ అధినాయకత్వం కోరడంతో వెంకటేశ్వరరావు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు. ఇపుడు పురందేశ్వరి తప్పుకుని అయినా కుమారుడి ఫ్యూచర్ కోసం చూస్తారా లేక తానుగా బీజేపీ తరఫున పోటీలో ఉండి కొడుకు రాజకీయ అరంగేట్రాన్ని ఆపుచేస్తారా అన్నది చర్చగా ఉందిట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.