Begin typing your search above and press return to search.

సుబ్బారాయుడు తేల్చేశారు...ఏ పార్టీలో కంటే....?

By:  Tupaki Desk   |   22 Nov 2022 2:30 AM GMT
సుబ్బారాయుడు తేల్చేశారు...ఏ పార్టీలో కంటే....?
X
ఆయన ఇంటిపేరు కొత్తపల్లి. అందుకే కాబోలు ఆయన చాలాసార్లు కొత్త పార్టీలు మార్చారు. ఎన్ని పార్టీలు తిరిగినా ఆయన గెలుపు మాత్రం చూసింది టీడీపీలోనే అని అంటున్నారు. నర్సాపురంలో మంచి పట్టు ఉన్న నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తాజాగా తన అనుచరులకు వర్గీయులకు ఒక శుభ సందేశం వినిపించారు. తాను కీలకమైన నిర్ణయం తీసుకున్నానని, త్వరలో తాను చేరబోయే పార్టీ ఏంటి అన్నది చెబుతాను అని సస్పెన్స్ లో పెట్టి ఉంచారు.

ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నర్సాపురంలో చూస్తే టీడీపీ బలంగా ఉంది. దానికి నాయకులు కూడా ఉన్నారు. మరో వైపు వైసీపీ నుంచి సుబ్బారాయుడుని ఈ మధ్యనే బహిష్కరించారు. ఆయనకూ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మధ్య వివాదాలు ముదరడంతో జగన్ ప్రసాదరాజు సైడ్ తీసుకున్నారు అని అంటున్నారు. ఇక కొత్తపల్లికి వైసీపీలో ఏ పదవీ ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర అసంతృప్తికి లోను అయి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఫలితంగా ఆయన వైసీపీ నుంచి వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ వచ్చినపుడు రెండు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి టీడీపీ, రెండవది జనసేనగా ఉంది. ఇక నర్సాపురం నుంచి సుబ్బారాయుడు అయిదు సార్లు గెలిచారు. అందులో నాలుగు సార్లు టీడీపీ నుంచే ఆయన జెండా ఎగరేశారు. మంత్రిగా కూడా బాబు క్యాబినెట్ లో పనిచేశారు. అయితే ఆయన పార్టీలు మారుతూ ఉండడంతో టీడీపీ వేరవారిని చూసుకుంది.

టీడీపీకి ఇపుడు అక్కడ బండారు మాధవనాయుడు గట్టి క్యాండిడేట్ గా ఉన్నారు. ఆయన 2014లో గెలిచారు. ఈసారి కూడా తన గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నారు. ఆయనకే టికెట్ అని అంటున్నారు. దాంతో సుబ్బారాయుడు జనసేన వైపు చూస్తున్నారు అని అంటునారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో సుబ్బారాయుడు పనిచేశారు. నర్సాపురం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆ పరిచయాలతో ఆయన జనసేనకే ఓటు వేస్తున్నారు అని అంటునారు.

పైగా పవన్ కళ్యాణ్ నాయకత్వాన కొత్త పార్టీగా ఉంటుంది. గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఇపుడు గట్టిగా ఉంది. దీంతో మరోమారు ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఆ పార్టీ బెస్ట్ ఆప్షన్ ని ఆయన నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఈ మేరకు పవన్ తొ మంతనాలు చేశారని, అయితే సరైన ముహూర్తం చూసుకుని పార్టీలో చేరుతారు అని అంటున్నారు.

దాంతో తన అనుచరులకు మాత్రం చేరే పార్టీ పేరు చెప్పకుండా త్వరలో ఒక పార్టీలో చేరిక ఖాయమని మాత్రం చెప్పి ఉంచారని అంటున్నారు. మరి కొత్తపల్లి జనసేనలో చేరినా పొత్తులు కనుక టీడీపీతో ఉంటే టికెట్ విషయంలో పేచీ రావచ్చు అంటున్నారు. అవతల పక్కన బండారు మాధవనాయుడు అసలు ఊరుకోరు అనే అంటున్నారు. ఏది ఏమైనా అనేక పార్టీలు మారిన సుబ్బారాయుడు అసెంబ్లీ ముఖం చూసి దశాబ్దం అవుతుంది 2024 నాటికి. మరి ఈసారి అయినా ఆయన టికెట్ పట్టి నెగ్గి ఎమ్మెల్యేగా సభకు వస్తారా అంటే ఏమో చూడాలనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.