Begin typing your search above and press return to search.

సిట్టింగుల్లో గంటా లేరా...ఎందువల్ల...?

By:  Tupaki Desk   |   17 Sep 2022 2:30 AM GMT
సిట్టింగుల్లో గంటా లేరా...ఎందువల్ల...?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉంటున్నారా అంటే ఉంటున్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు, టీడీపీ సర్వ సభ్య సమావేశాలు జిల్లాలో పెట్టినా ఏకంగా అధినేత చంద్రబాబు అమరావతిలో పెట్టినా వెళ్ళరని ప్రచారంలో ఉన్న మాట. ఆయన అసలు మీడియా ముందుకు రావడంలేదు, వైసీపీ మీద కొండవీటి సింహాలై బొబ్బిలి పులులై పోరాడండి తమ్ముళ్ళూ అంటూ చంద్రబాబు పిలుపు ఇస్తూంటే గంటా వారు మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో బాబుని అక్కన పెడితే 22 అనుకుంటే వీరిలో నలుగురు వైసీపీకి జై కొట్టి వెళ్లిపోయారు. ఇక 18 మంది ఉంటే అందులో అసెంబ్లీలో చూస్తే పదహారు మందే ఇపుడు కనిపిస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి రాం రాం అనేశాక వెళ్లడంలేదు. ఇక ఆయన బావమరిది బాలక్రిష్ణ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే దేశంలో ఉన్నారుట.

ఏదైతేనేమి అచ్చెన్నాయుడు నాయకత్వాన పదహారు మంది ఎమ్మెల్యేలు మాత్రం వీరోచితంగా అసెంబ్లీలో వైసీపీకి ఎదురొడ్డి పోరాడుతున్నారని చంద్రబాబు గుర్తించారు. వారికే వీరతాళ్ళు వేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అందరు సిట్టింగులకు టికెట్లు ఇస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఈ జాబితాలో 17వ ఎమ్మెల్యే బాలయ్య కూడా ఉన్నారట. మరి ఎవరిని పక్కన పెట్టారు అంటే విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావుని అని ప్రచారం అయితే సాగుతోంది.

గంటా అసెంబ్లీకి వచ్చి టీడీపీ తరఫున గట్టిగా నిలబడి వైసీపీ సర్కార్ మీద పోరాడడం లేదని అధినాయకత్వం కినుక వహిస్తోంది అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు అవుతూంటే ఆయన మాత్రం రావడం లేదు ఎందుకని ప్రశ్న వస్తోంది. అయితే గంటా తన రాజీనామాను ఎపుడో స్పీకర్ కి ఇచ్చేశారు అని అనుచరులు చెబుతున్నారు. దానిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పెండింగులో పెట్టారు అని అంటున్నారు.

అయితే ఈ మధ్యన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గంటా స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ ఆయన్ని కలసి ఆ మీదట ఓటింగులో పాల్గొన్నారు. మరి నాడు గుర్తుకురాని రాజీనామా ఇపుడు వచ్చిందా అంటే అది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా వైసీపీ సర్కార్ ఏర్పడిన కొత్తల్లో అంటే తొలి ఏడాది అర్ధ భాగంలో మాత్రమే గంటా అసెంబ్లీలో కనిపించారు. అది కూడా సైలెంట్ గానే ఆయన సభలో ఉండేవారు అని అంటారు.

ఇపుడు చూస్తే ఆయన సభకు అసలు రావడంలేదు. దాంతో సిట్టింగులు అందరికీ మళ్లీ టికెట్లు అన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలు 17 మందే అనుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఒకవేళ గంటాకు టికెట్ ఇవ్వాలని ఆయనకు అనిపించడంలేదా అన్నది కూడా ఇపుడు అంతా అనుకుంటున్న మాటగా ఉంది. అయితే గంటాను ఈసారి ఎంపీగా పంపిస్తారు అన్న ప్రచారం ఉంది. దాంతో ఆ విధంగా ఆయనకు సిట్టింగ్ గా చూసి టికెట్ ఇవ్వడం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే గంటా పార్టీ మారుతారు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మరి ఆయన పార్టీ మారాలీ అనుకుంటే జనసేన బెస్ట్ ఆప్షన్ గా ఉంది అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇపుడు వచ్చే వారికి స్వాగతం అని అంటున్నారు. దాంతో గంటా జనసేనలో చేరుతారా అన్న చర్చ కూడా ఉంది. అదే విధంగా ఎన్నికల టైం కి ఆయన వైసీపీలో కూడా చేరే చాన్స్ ఉందని కూడా మరో ప్రచారం ఉంది. ఇవన్నీ తెలిసే ఆయనకు టికెట్ నో అని చంద్రబాబు చెప్పారా అన్నదే చర్చ మరి. సిట్టింగులతో పాటు ఆయనకూ టికెట్ అని బాబు ఎందుకు చెప్పడంలేదు అని అంటున్నారు. చూడాలి మరి గంటా ఏం చేస్తారో ఆయన గురించి అధినాయకత్వం ఏమి ఆలోచిస్తుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.