Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి గంటా అయిపూ అజా లేదేమి...?

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
మాజీ మంత్రి గంటా అయిపూ అజా లేదేమి...?
X
ఆయన విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు. రెండు సార్లు మంత్రిగా ఏకంగా ఏడేళ్ల పాటు నాన్ స్టాప్ గా పనిచేసిన గంటా శ్రీనివాసరావు ఇపుడు సైలెంట్ గా ఉండడం పట్ల టీడీపీలో చర్చ సాగుతోంది. ఆయన కొద్ది నెలల క్రితం మౌనం వీడి జనాల్లోకి వచ్చారు. తన సొంత నియోజకవర్గం ఉత్తరంలో కూడా తిరిగారు. ఆయన మనవడు పుట్టిన రోజుకు చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్ళారు. దాంతో మళ్లీ గంటా సారు దూకుడు పెంచుతారు అని అనుకున్నారు. కానీ చూస్తే ఆయన మళ్ళీ మౌనమే నా భాష అంటున్నారు.

మరి ఎక్కడ తేడా వచ్చింది. గంటా కోరుకుంటున్నది ఏంటి, పార్టీ నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నారు. అలాగే పార్టీ ఆయన నుంచి ఏమి ఆశిస్తోంది వంటి వాటి మీద చర్చ సాగుతోంది. గంటా అంటే సామాన్య నాయకుడు కాదు, ఆయన తనతో పాటు కనీసం మరో రెండు మూడు టికెట్లను తెచ్చుకుంటారు. ప్రతీ సారి అది జరుగుతున్నదే. ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరినపుడు ఏకంగా ఉత్తరాంధ్రా నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా చక్రం తిప్పారు.

అలాగే టీడీపీలో 2014లో తిరిగి చేరినపుడు కూడా తనతో పాటు తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇపుడు అయితే అలాంటి సీన్ ఉంటుందా అన్నదే చర్చ. గంటాకు టికెట్ ఇస్తారేమో కానీ ఆయన కోరిన వారికి టికెట్లు దక్కవు అని ప్రచారం సాగుతోంది. దాంతోనే ఆయన మౌనం దాల్చారని అంటున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గంటా హాజరు కాలేదని అంటున్నారు. దాంతో గంటా వైపు నుంచి గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. అయితే గంటాకు నేరుగా అధినేత చంద్రబాబుతో యాక్సెస్ ఉందని ఆయన సరైన టైం లో దూకుడు చూపుతారని అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట.

అదే విధంగా గంటా లాంటి అంగబలం, అర్ధబలం ఉన్న గట్టి నేతలను చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో వదులుకోరని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే గంటా మౌనం దాల్చడం వెనక తన ముందు ఉన్న ఆప్షన్స్ ఏవైనా ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారా అన్న మరో చర్చ కూడా ఉందిపుడు. గంటా జనసేనలోకి వెళ్తారు అన్న టాక్ కూడా ఆ మధ్య దాకా నడిచింది. దాంతో అక్కడకు కనుక ఆయన వెళ్తే కచ్చితంగా ఆయన కోరుకున్న వారందరికీ టికెట్లు వస్తాయని అంటున్నారు

అయితే జనసేన పొత్తు వ్యవహారం తేలకపోవడంతోనే ఆయన ఆ వైపుగా ఆలోచించడంలేదు అంటున్నారు. ఇంకో వైపు గంటాను వైసీపీలోకి కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ అయితే ఉంది. ఆయన ఎపుడూ కోరుకునే భీమిలీ టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటారని అంటున్నారు. భీమిలీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అవంతి శ్రీనివాసరావుని విశాఖ ఎంపీగా పంపుతారు అని కూడా ప్రచారం అయితే ఉంది.

మొత్తానికి గంటా మాత్రం తమ రాజకీయం గురించి ఏ రకమైన ప్రచారం జరిగినా తాను మాత్రం పెదవి విప్పడంలేదు. దాంతో ఆయన బయటకు వచ్చి పెదవి విప్పితేనే తప్ప ఈ రకమైన ప్రచారాలు ఆగవు. ఇంతకీ గంటా మౌనం వెనక ఏముంది అంటే పక్కాగా రాజకీయ ప్లాన్ ఉంటుందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.