Begin typing your search above and press return to search.

సింగిల్ బెడ్ రూం నుంచి.. 10 కోట్ల ఇంటికి..

By:  Tupaki Desk   |   4 May 2022 3:30 PM GMT
సింగిల్ బెడ్ రూం నుంచి.. 10 కోట్ల ఇంటికి..
X
టీమిండియా కుర్ర క్రికెటర్ పృథ్వీ షా ఓ ఇంటివాడయ్యాడు. అంటే.. ఎవరినైనా కట్టుకుని (వివాహం చేసుకుని) కాదు.. సొంతంగా కొనుక్కుని.. ఒకప్పుడు ముంబై శివార్లలో కేవలం సింగిల్ బెడ్ రూం ఇంటిలో ఉన్న అతడు ఇప్పుడు రూ.10.5 కోట్ల విలువైన ఇంటిని కొన్నాడు. అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇదంతా క్రికెట్ పుణ్యం.. ఇంకా చెప్పాలంటే.. ఐపీఎల్ తెచ్చిన లక్ష్మి. ఐపీఎల్ లో పృథ్వీ.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అతడు ప్రీమియమ్‌ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో ఈ ఢిల్లీ ఓపెనర్ ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు.

ఇదీ పృథ్వీ ఇంటి విశేషం..

షా కొనుగోలు చేసిన ఫ్లాట్‌ విలువ అతడి ఐపీఎల్‌ ప్రస్తుత ధరకు కాస్త ఎక్కువే. బాంద్రాలో కేసీ రోడ్‌లోని ప్రాజెక్ట్‌ 81 ఆరెట్‌ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదో అంతస్తును పృథ్వీ షా కొనుగోలు చేశాడు. దీనిని పిరమిడ్‌ డెవలపర్స్‌, అల్ట్రాస్పేస్‌ సంయుక్తంగా నిర్మించాయి. పృథ్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్‌ 2209 స్వ్కేర్‌ఫీట్‌లో కార్పెట్‌ ఏరియా.. 1654 స్క్వేర్‌ఫీట్‌లో టెర్రస్‌తో అత్యంత విశాలంగా ఉంటుంది.

కాగా పృథ్వీకి విశాలమైన మూడు కార్‌ పార్కింగ్‌ స్లాట్లు ఇవ్వనున్నారు. ఇక ఈ ఫ్లాట్ కు రూ. 52.50 లక్షలతో మార్చి 31నే స్టాంప్‌ డ్యూటీ చేయించగా.. ఏప్రిల్‌ 28న పృథ్వీ షా పేరుతో ఫ్లాట్‌ రిజిస్టర్‌ అయ్యింది.

నాడు అలా..

దిగుమ మధ్య తరగతి కుటుంబానికి చెందిన షా.. హారిస్ షీల్డ్ ట్రోఫీలో 2013లో 14 ఏళ్ల వయసులో కేవలం 330 బంతుల్లోనే 546 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 85 ఫోర్లు, 5 సిక్స్ లతో నాడు షా చెలరేగాడు. రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ కు ఆడుతూ నాడు రికార్డులు కొల్లగొట్టాడు షా. స్కూల్ క్రికెట్ లో షాదే అత్యధిక స్కోరు. 2016లో ఆసియా కప్ గెలిచిన అండర్ -19 జట్టు సభ్యుడిగా ఉన్న షా.. తర్వాత రెండు నెలలకు రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. నాడు తమిళనాడుపై జరిగిన సెమీఫైనల్లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టి అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఘనత అందుకున్నాడు. 17 ఏళ్ల వయసులో 2017లో దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనూ శతక్కొట్టి..

అతి చిన్న వయసులో ఈ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ గా నిలిచాడు. 2018 అండర్ 19 ప్రపంచ కప్ కెప్టెన్ గా టీమిండియాకు కప్ అందించాడు. అదే టోర్నీ సమయంలో షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. అనంతరం వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా సీనియర్ జట్టులోకి వచ్చి అక్కడా.. అరంగేట్రంలోనే సెంచరీ కొట్టాడు. చిన్న వయసులో ఈ రికార్డు అందుకున్న భారత
క్రికెటర్ గా నిలిచాడు.

దూసుకెళ్లాల్సిన సమయంలో బ్యాడ్ లక్

మంచి ఫామ్ తో షా 2018-19 ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపికైనా.. ప్రాక్టీస్ మ్యాచ్ లో అనవసర క్యాచ్ కు ప్రయత్నించి కాలి మడమకు గాయం చేసుకున్నాడు. అక్కడినుంచి అతడికి బ్యాడ్ లక్ ప్రారంభమైంది. ఆ సిరీస్ కు దూరమైన అతడు టీమిండియాలోకి రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ లోగా మయాంక్ అగర్వాల్, షా టి20 అండర్-19 ప్రపంచ కప్ సహచరుడు శుబ్ మన్ గిల్ జట్టులో పాతుకుపోయారు.

మధ్యలో ఆట, కెరీర్ పై షా సీరియస్ నెస్ తగ్గినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతడి రీ ఎంట్రీ కష్టమవుతోంది. మరోవైపు ఐపీఎల్ లో షా దుమ్మురేపుతున్నా.. కీలక సమయాల్లో విఫలమవుతూ వస్తున్నాడు. ప్రస్తుతానికి అతడి కెరీర్ ఏమంతగా పురోగతిలో లేదు. మరికొన్నాళ్లు నిలకడగా రాణిస్తే తప్ప సీనియర్ జట్టులోకి వచ్చే పరిస్థితులు లేవు. అయితే, అనుకోని వరంలా ఐపీఎల్ అతడిని ఆర్థికంగా ఆదుకుంటోంది.