Begin typing your search above and press return to search.

జనసేన కి అదే మైనస్ ...బాబు ఏం చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 AM GMT
జనసేన కి అదే మైనస్ ...బాబు ఏం చేయబోతున్నారు...?
X
ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖాయం అయింది. సరైన సమయంలో రెండు పార్టీలు పొత్తు ప్రకటన చేయనున్నాయని తెలుస్తోంది. ఇక పొత్తు ఎటూ ఖాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలన్న దాని మీద పక్కాగా క్లారిటీ వస్తే ముందు నుంచే అభ్యర్ధులను ఎంపిక చేసుకుని కార్యక్షేత్రం లోకి దూకడం మంచిదనే భావనతో ఇరు పార్టీల అధినేతలూ ఉన్నారు.

ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో తెలుగుదేశం వీక్ గా ఉన్నవి తక్కువే. దానికి కారణం అక్కడ పార్టీ ఎక్కువ సార్లూ ఓడిపోవడం తో పాటు నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం వంటివే చెప్పుకోవాలి. అదే జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీకి అభిమానులు అనబడే వారే కార్యకర్తలుగా ఉన్నారు. అలాంటి వారు ప్రతీ నియోజకవర్గంలోనూ ఉన్నారు. అందుకే జనసేన మీటింగ్ పెడితే వారే తండోపతండాలుగా తరలివస్తారు.

కానీ నియోజకవర్గాల స్థాయిలో బలమైన నాయకులు అయితే చాలా చోట్ల లేరనే అంతున్నారు. కొన్ని చోట తప్ప అనేక కీలక నియోజకవర్గాలలో జనసేనకు ఇదే అతి పెద్ద మైనస్ పాయింట్ గా ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినాయకత్వం తాము పోటీ చేయాల్సిన సీట్లతో పాటు జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది ఆ పార్టీ బలమేంటి అన్నది కూడా జాగ్రత్తగా సర్వేలు చేసి మరీ అంచనా తీస్తోందిట.

అలా చూసుకుంటే జనసేనకు కొన్ని చోట్ల బలం ఉన్నా సమర్ధమైన నాయకత్వం లేదు అన్నది తేలుతోంది అని అంటున్నారు. మరి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లను జనసేన అడిగినా నాయకులు బలంగా లేని సాకు చూపించి టీడీపీ ఆ సీట్ల సంఖ్యను తగ్గిస్తుందేమో అన్న చర్చ కూడా ఉందిట. అదే సమయంలో జనసేనకు బలం లేని చోట టీడీపీ నుంచే తమ్ముళ్ళు అటు వైపు జారుకుని ఆ సీట్లలో పోటీ చేయడం ద్వారా తెలుగు జనసేనగా ఆ సీట్లను మార్చుతారా అన్న డౌట్లు కూడా ఉన్నాయట.

టీడీపీ అధినాయకత్వం ఇపుడు జనసేన బలాబలాల మీద ఫుల్ ఫోకస్ పెట్టడం వెనక ఆంతర్యం కూడా ఇదేనా అన్న డౌట్లు వస్తున్నాయట. జనసేనను ఏళ్ళ తరబడి నడుపుతున్నా ఈ రోజుకీ ముప్పయి నుంచి నలభై చోట్ల మాత్రమే నియోజకవర్గం ఇంచార్జిలు ఉన్నారని అంటున్నారు. వీరిలో కూడా యాక్టివ్ గా ఉన్న వారు తక్కువ. ఇక మొత్తం ఏపీలోని 175 సీట్లలో కూడా ఇంచార్జిలను జనసేన చాలా కాలం ముందు నుంచే నియమించుకుని ఉంటే ఇపుడు ఎక్కువ సీట్లు అడిగేందుకు ఆస్కారం ఉండేదని అంటున్నారు.

కానీ జనసేన తమకు ఉన్న అభిమానబలాన్ని కూడదీసి పార్టీ కోసం సంస్థాగతంగా మార్చుకునేందుకు ప్రయత్నించలేకపోవడం పెద్ద లోటుగానే ఉంది అంటున్నారు. ఇపుడు ఆ పనిలో పార్టీ పడిందని అంటున్నా ఎన్నికల వేళకు వారు ఎంతమేరకు పుంజుకుని బలమైన నాయకులను తయారు చేసుకుంటుందో చూడాలి. ఇక జనసేన కనీసం యాభై సీట్లకు తగ్గకుండా పొత్త్లలో భాగంగా తీసుకుని పోటీ చేయాలనుకుంటోంది అని ప్రచారం సాగుతోంది. మరి అంతమంది సమర్ధులైన అభ్యర్ధులను సమకూర్చుకోవడం పైనే జనసేన డిమాండ్ నెగ్గడం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. జనసేన పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి దక్కించుకోవడానికి చూస్తే అది కచ్చితంగా జంపింగ్ జఫాంగులకు కూడా బంపర్ చాన్స్ గా ఉంటుంది అంటున్నారు. అయితే ఎవరిని తీసుకుంటారు, పార్టీలోకి వచ్చిన వారిలో ఎవరికి అవకాశాలు ఇస్తారు అన్నది పవన్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.