Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా ఫోకస్... పవన్ మానియా ఏ రేంజిలో...?

By:  Tupaki Desk   |   11 Dec 2022 3:30 AM GMT
ఉత్తరాంధ్రా ఫోకస్... పవన్ మానియా ఏ రేంజిలో...?
X
ఉత్తరాంధ్రా ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీలో పెద్ద సబ్ రీజియన్స్ లో ఈ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ అయిదు ఎంపీ, 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంతో రాజకీయాల్లో పరమపధ సోపానం అందుకోవాలని చూసేవారు అంతా ఉత్తరాంధ్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పవన్ సైతం ఈసారి ఉత్తరాంధ్రా నుంచే విజయయాత్రను కొనసాగించాలని చూస్తున్నారు.

కోస్తాలో కీలక సెగ్మెంట్స్ అయిన ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాలలో మొత్తం సీట్లు 68 దాకా ఉన్నాయి. పది ఎంపీ సీట్లు ఉన్నాయి. దాంతో ఇక్కద కనుక గట్టిగా పట్టు సాధిస్తే మంచి నంబర్ తో సీట్లు దక్కించుకోవచ్చు అన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. గతనెలలో పవన్ కళ్యాణ్ విజయనగరం గుంకలాం టూర్ చేపట్టారు. అక్కడ జగనన్న కాలనీలను ఆయన సందర్శించి వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఈ టూర్ లో విజయనగరం జిల్లాలో పవన్ కి మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో ఆశలు మరింతగా పెరిగాయి. ఆ మీదట జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ వారం రోజుల పాటు ఉత్తరాంధ్రాలో పర్యటించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకున్నారు. ఇపుడు శ్రీకాకుళం జిల్లా వైపు జనసేన చూపు పడింది. జనవరి 12న యువతతో అతి పెద్ద సదస్సుని అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు. ఎచ్చెర్లను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు.

జనవరి 12 వివేకానందుడి జయంతి. దేశమంతా యువజనోత్సవం నిర్వహిస్తుంది. దాంతో దానిని కవర్ చేస్తూ తమ పార్టీలో యూత్ ఫోర్స్ కి సందేశం ఇచ్చేలా జనసేన ఈ ప్రోగ్రాం కి డిజైన్ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఆ విధంగా శ్రీకాకుళం టూర్ కి వస్తున్నారు. ఎన్నికల ముందు ఆయన ఈ జిల్లాను సందర్శించారు. మళ్ళీ మూడున్నరేళ్ల తరువాత ఆయన సిక్కోలు టూర్ పెట్టుకున్నారు. దాంతో జనసేనలో కొత్త ఉత్సాహం
కనిపిస్తుంది.

ఇక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడంలో కూడా పక్కా వ్యూహం ఉంది అంటున్నారు. ఎచ్చెర్లలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కి తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీలో అయితే కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడుల వర్గాల మధ్య పోరు నడుస్తోంది. దాంతో పాటు ఈ సీట్లో కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో ఎచ్చెర్ల మీద జనసేన కన్నేసింది అని అంటున్నారు. అక్కడ భారీ సదస్సు పెట్టడం ద్వారా ఆ సీటులో జెండా ఎగరేయాలని చూస్తోంది అని చెబుతున్నారు.

పొత్తులు ఉన్నా లేకపోయినా ఈ సీటు నుంచే జనసేన పోటీకి దిగుతుందని అంటున్నారు. అదే విధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది సీట్లలో తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ప్రభావం సగం దాకా నియోజకవర్గాలలో ఉంది. దాంతో శ్రీకాకుళంలో జనసేన సత్తా చాటాలని నిర్ణయించుకుంది అంటున్నారు. అక్టోబర్ 15న విశాఖలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ రోజున వైసీపీ సర్కార్ పెట్టిన నిర్బంధంతో ఒక విధంగా కసి మీద ఉన్నారు.

ఆ తరువాత నవంబర్ లో ప్రధాని మోడీని అదే విశాఖలో కలసి తన స్థాయి ఏంటో చెప్పేశారు, అలా విశాఖలో మొదలైన పవన్ మార్క్ ప్లాన్ ఇపుడు ఉత్తరాంధ్రా మీద పూర్తి దృష్టి పెట్టేలా చేసింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం విశాఖ మీదనే ఫోకస్ పెట్టిన పవన్ 2024 లో మాత్రం మొత్తం ఉత్తరాంధ్రాలో జనసేన రాజకీయ వాటాను తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆయన వ్యూహాలకు తగినట్లుగా జనసేన ఉత్తరాంధ్రా మీదనే గత మూడు నెలలుగా పనిచేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.