Begin typing your search above and press return to search.

2024లో వచ్చేది మిశ్రమ ప్రభుత్వం... పవన్ నోట కొత్త మాట

By:  Tupaki Desk   |   13 Jan 2023 2:30 AM GMT
2024లో వచ్చేది మిశ్రమ ప్రభుత్వం... పవన్ నోట కొత్త మాట
X
వచ్చే ఎన్నికల్లో ఏపీలో మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఒంటరిగా పోటీ చేయాలా లేక పొత్తులతో వెళ్లాలా అన్నది ఆలోచిస్తామని అన్నారు. గౌరవప్రదంగా ఉంటే పొత్తులకు ఓకే అని పవన్ పచ్చజెందా ఊపేశారు.

అదే టైం లో ఏపీలో వస్తే జనసేన ప్రభుత్వం అయినా వస్తుంది లేకపోతే మిశ్రమ ప్రభుత్వం అయినా వస్తుంది ఇది తధ్యమని మరో స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద కూడా ఇపుడు వాడి వేడిగా చర్చ నడుస్తోంది. అంటే తెలుగుదేశంతో సీట్ల సర్దుపాటు కుదరకపోయినా గౌరవమైన తీరులో పొత్తు కధ సాగకపోయినా ఒంటరిగా పోటీ చేయాలని కూడా పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అపుడు తెలుగుదేశం జనసేనల మధ్యన లోపాయికారీ అవగాహన ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా స్నేహ పూర్వక పోటీలు చేస్తూ ఎవరి బలం ఎంతో తేల్చుకుని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పోస్ట్ పోల్ అలయెన్స్ కి రెడీ అవాలని కూడా మరో ఆలోచన ఉంది అని అంటున్నారు.

దీని వల్ల జనసేన ఒంటరిగా పోటీ చేయగలదు అని ప్రత్యర్ధి పార్టీల నోళ్ళూ మూయించవచ్చు అలాగే తెలుగుదేశానికి ఇబ్బంది లేకుండా తాము పోటీకి దిగుతూ రెండు పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే దామాషా పద్ధతిలో అధికారం వాటా వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.

మరో వైపు చూస్తే ఒంటరిగా పోటీ చేయడానికి జనాలే ధైర్యం ఇవ్వాలని పవన్ అంటున్నారు. తన సభలకు వచ్చిన జనాలు ఇతర పార్టీలకు ఓట్లు వేస్తున్నారు అని ఆయన నిష్టూరమాడుతున్నారు. అలా కాకుండా తన సభలకు వచ్చిన వారు అంతా తనకే అండగా నిలబడితే తనను నమ్మితే కచ్చితంగా 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయి తీరుతుంది అని అంటున్నారు.

మొత్తానికి పవన్ చాలా రకాలుగానే ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నరు. అదే టైం లో పొత్తుల పేరిట అంత సులువుగా తెలుగుదేశానికి మొత్తం అధికారాన్ని అప్పగించాలని కూడా చూడడం లేదు అని అంటున్నారు. దంతో ఏపీలో పొత్తుల కధ కొత్త మలుపులు తిరుగుతుంది అని కూడా ఊహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుంటే ఆయన నోటి వెంటనే మిశ్రమ ప్రభుత్వం వచ్చి తీరుతుంది అన్న మాటలే ఇపుడు వైరల్ అవుతున్నాయి.

అయితే జనసేన లేకపోతే మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం సోలోగా వస్తుంది అని ఆయన అనడంలేదు. దాంతో పవన్ పక్కాగా లెక్కలు అన్నీ చూసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఏది ఏమైనా 2024లో మిశ్రమ ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం కలసి అన్నది మాత్రం ఒక హింట్ ని పవన్ ఇచ్చేశారు అనుకోవాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.