Begin typing your search above and press return to search.

జేసీ దివాక‌ర్ రీ ఎంట్రీ.. వేడెక్క‌నున్న తాడిప‌త్రి!

By:  Tupaki Desk   |   20 Dec 2022 2:30 AM GMT
జేసీ దివాక‌ర్ రీ ఎంట్రీ.. వేడెక్క‌నున్న తాడిప‌త్రి!
X
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితే.. ఠ‌క్కును స్పురించే పేరు జేసీ దివాక‌ర్ రెడ్డి. దాదాపు 35 ఏళ్ల‌పాటు ఎమ్మెల్యేగా ఆయ‌న ఇక్క‌డ సేవ‌లందించారు. క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ వాదిగా.. అదేస‌మ‌యంలో స్వ‌ప‌క్షంలో విప‌క్ష నాయ కుడిగా కూడా పేరు తెచ్చుకున్న దివాక‌ర్‌రెడ్డికి.. తాడిప‌త్రికి ఎన‌లేని అనుబంధం ఉంది. ఒక సారి గెలిచేందుకే నానా తిప్పలు ప‌డుతున్న నాయ‌కులు ఉన్న నేటి రాజ‌కీయాల్లో దివాక‌ర్ ఏకంగా.. ఏడు సార్లు అది కూడా అప్ర‌తిహ‌త విజ‌యంతో అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆయ‌న 2014 కు ముందు.. టీడీపీలో చేరారు. అదేస‌మ‌యంలో ఆయ‌న సోద‌రుడు, మ‌రో ఫైర్ బ్రాండ్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కూడా సైకిల్ ఎక్కారు. ఆ ఎన్నిక‌ల్లో దివాక‌ర్ అనంత‌పురం ఎంపీగా, ప్ర‌భాక‌ర్ తాడిప‌త్రి ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. గ‌త ఎన్నికలు వ‌చ్చేసరికి మాత్రం ఇద్ద‌రు సోద‌రులు ప్ర‌యోగాలు చేశారు. వారివారి త‌న‌యుల‌ను ఇక్క‌డ నిల‌బెట్టారు. ఎంపీగా దివాక‌ర్ త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్‌రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌త‌న‌యుడు అస్మిత్‌లు పోటీ చేశారు. అయితే.. ఇద్ద‌రూ కూడా ఓడిపోయారు.

ఇందులో అనంత‌పురం పార్ల‌మెంటు స్థానంలో ఓట‌మి క‌న్నా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చిన‌.. త‌మ పుట్టిల్లుగా భావించే తాడిప‌త్రిని కోల్పోవ‌డం.. జేసీల‌కు బాగా ఆవేద‌న‌ను మిగిల్చింది. ఇక‌, ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో రాజ‌కీయంగా కూడా వేధింపులు ఎదుర్కొన్నార‌ని.. వారి అనుచ‌రులే చెబుతారు. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌విష‌యంలో ఏపీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ పెట్టిన కేసుల‌తో ప్ర‌భాక‌ర్ జైలుకు కూడా వెళ్లారు ఇక‌, తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా.. ప్ర‌భాక‌ర్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించిన ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికీ జేసీ బ్ర‌ద‌ర్స్ ఆందోళ‌న క‌న‌బ‌రుస్తూనే ఉన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌స్తుతం తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉండ‌గా.. దివాక‌ర్ మాత్రం సైలెంట్ అయిపోయారు. దాదాపు రెండేళ్లుగా ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న‌కు అనారోగ్యం చేసింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఇక‌, ఇప్పుడు తాజాగా.. దివాక‌ర్ రెడ్డి ఈ ర్యూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ.. త‌న అనుచ‌రుల‌తో భేటీ కావ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యార‌నే వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. తాడిప‌త్రిని తిరిగి ద‌క్కించుకోవ‌డం.. ఇప్పుడు జేసీల ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసేందుకురెడీ అయినా.. వారి వార‌సుల‌కు టికెట్‌లు ఇచ్చేది లేద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో జేసీలు ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.