Begin typing your search above and press return to search.

కశ్మీరీ పేసు గుర్రం ఉమ్రాన్.. 150 కి.మీ. తగ్గేదేలే..

By:  Tupaki Desk   |   13 April 2022 11:30 PM GMT
కశ్మీరీ పేసు గుర్రం ఉమ్రాన్.. 150 కి.మీ. తగ్గేదేలే..
X
ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లను కాదని ఓ కుర్రాడిని అట్టిపెట్టుకుంది. అప్పుడందరూ ఏమిటిదని ఆశ్చర్యపోయారు. ఏళ్లుగా ఆడుతున్న వార్నర్, రషీద్ లను ఎందుకు మళ్లీ తీసుకోలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఆ కుర్రాడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పేసు గుర్రంలా బంతులేస్తూ బెంబేలెత్తిస్తున్నాడు. ఆ కుర్రాడే కశ్మీరీ ఉమ్రాన్ మాలిక్.

మనకూ ఉన్నాడో సూపర్ స్పీడ్ స్టర్

గతంలో భారత పేసర్ల సగటు బౌలింగ్ వేగం గంటకు 135. దీనికే గొప్పగా భావించేవారు. మనదగ్గర పరిస్థితులు, వాతావరణం అందుకు కారణం కావొచ్చు. అయితే, రెండు దశాబ్దాలుగా తీరు మారుతోంది. జహీర్ ఖాన్ నుంచి మొదలైన ప్రస్థానం 140 కి.మీ. వేగం దాటింది. ఉమేశ్ యాదవ్, షమీ, బుమ్రాల రాకతో 145 కి.మీ. వేగానికి చేరింది. ఇప్పుడు వారందరినీ తలదన్నేలా గంటకు 150 కి.మీ. వేగంతో బంతులేస్తున్నాడు ఉమ్రాన్. అది కూడా ఒక్క బంతో రెండు బంతులో కాదు.. ఓవర్లో అన్నీ దాదాపు 150 కి.మీ. ముల్లును తగులుతున్నాయి.

ఇదీ లెక్క..

గత సీజన్ నుంచే హైదరాబాద్ కు ఆడుతున్న ఉమ్రాన్ అప్పుడు సైతం 150 కి.మీ. వేగం చూపాడు. నాడే అందరి కళ్లలో పడ్డాడు. ఇప్పుడు ఆ అంచనాలను నిలుపుకొంటూ వస్తున్నాడు. 151.8, 152.3, 153.1, 153.3.. ఇవీ ఉమ్రాన్‌ మాలిక్‌ బంతులు విసురుతున్న వేగం తాలూకు గణాంకాలు! ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో అన్నట్లుగా ఈ హైదరాబాద్‌ పేసర్‌ వేగం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. హైదరాబాద్‌ తరఫున బుల్లెట్‌ బంతులతో గత సీజన్లో అందరినీ ఆకర్షించిన 22 ఏళ్ల ఈ శ్రీనగర్‌ బౌలర్‌ను ఈ సీజన్‌కు ఆ జట్టు అట్టిపెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈసారి సీజన్లో అతడు రాణిస్తున్నాడు. ముఖ్యంగా అతడి వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈసారి సీజన్‌లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ల జాబితా చూస్తే.. టాప్‌-5లో అన్ని పేర్లూ ఉమ్రాన్‌వే. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఉమ్రాన్‌ పేరు మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మైదానానికి రావడం.. రికార్డు వేగంతో బంతి విసరడం.. ఇందుకు గాను ఇచ్చే ఇచ్చే రూ.లక్ష బహుమతిని సొంతం చేసుకోవడం ఇదే అతడి దినచర్యగా మారిపోయిందంటూ సరదా వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి ఉమ్రాన్‌ మీద. ఉమ్రాన్‌ వేగం.. అతడి వయసు దృష్టిలో పెట్టుకుంటే భారత్‌కు ఓ మంచి పేసర్‌ సిద్ధంగా ఉన్నట్లేనని హర్ష భోగ్లే, రవిశాస్త్రి లాంటి వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.

భారత భావి పేసు గుర్రం

భారత్ లో 150 కి.మీ. వేగంతో బంతులేసే పేసర్లు అది కూడా నిలకడగా వేసే వారు అరుదు. హరియాణకు చెందిన నవదీప్ సైనీ 150 కి.మీ. మార్కును చేరినా అతడిని గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉమ్రాన్ ను సరిగ్గా దిద్దుకుంటే భవిష్యత్‌లో టీమిండియాలో చూడొచ్చని మాజీలు అంటున్నారు. కాగా, ఉమ్రాన్ గతేడాది ఐపీఎల్ ప్రదర్శనను గుర్తించిన టీమిండియా మేనేజ్ మెంట్ అతడిని 2021 టీ20 ప్రపంచకప్‌లో నెట్‌ బౌలర్‌గా ఎంపిక చేసింది. దీనికితోడు ఉమ్రాన్ కూడా భారత జట్టుకు ఆడాలనే ఉత్సాహంతో ఉన్నాడు. వాయు వేగంతో బంతులేసే ఉమ్రాన్‌.. బంతిని ఇన్‌స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాడు. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేసిన చేత్తోనే ఉన్నట్టుండి వేగాన్ని తగ్గించి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు.

స్టెయిన్ మార్గదర్శకంలో ఆ బలహీనతను అధిగమిస్తేనే..

అంతర్జాతీయ క్రికెట్ లో వేగం ఒక్కటే సరిపోదు. కచ్చితత్వం, లైన్ అండ్ లెంగ్త్ అవసరం. అది లేకుంటే మనుగడ కష్టం. బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ వీటిని అందుకోవడంతోనే ఎక్కువ కాలం కొనసాగారు. కాగా, ప్రస్తుతం లీగ్ లో అత్యధిక వేగంతో బంతులేస్తున్న దక్షిణాఫ్రికా పేసర్ నార్జ్ కూడా లయ తప్పుతుంటాడు. పేసర్లు ఇలా గాడితప్పితే నాణ్యమైన బ్యాట్స్ మన్ బాదేస్తారు. ఉమ్రాన్ లో కూడా ఉన్నట్టుండి లైన్‌ తప్పిపోవడం అనే అలవాటుంది. అనసవర పరుగులు ఇస్తుంటాడు. ఈ రెండు బలహీనతల్ని అతడు అధిగమించాల్సి ఉంది. అయితే, అన్నిటికి మించి సన్ రైజర్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్. ఉమ్రాన్ రాటుదేలేందుకు ఇంతకంటే మంచి కోచ్ ఎవరూ ఉండరు. దీనిని సద్వినియోగం చేసుకోవడం అతడిపైనే ఆధారపడి ఉంది.