Begin typing your search above and press return to search.

ఫిరాయిస్తే క్యాబినెట్ బెర్త్... భారీ ఆఫర్...?

By:  Tupaki Desk   |   8 Sep 2022 12:30 AM GMT
ఫిరాయిస్తే క్యాబినెట్ బెర్త్... భారీ ఆఫర్...?
X
రెండు తెలుగు రాష్ట్రాలలో తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. దాంతో ఆ పార్టీ తన చేతిలో ఉన్న అధికారాన్ని వాడుకుంటోంది. ఇక మరో ఇరవై నెలల పాటు అధికారం కేంద్రంలో బీజేపీ చేతిలో ఉంటుంది. దాంతో అవసరం అయిన చోట్ల కొత్తగా మంత్రి పదవులు ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణాలో బీజేపీకి బలం ఉంది. ఏకంగా నలుగురు ఎంపీలు నేరుగా జనం నుంచి గెలిచిన వారు ఉన్నారు. కొత్తగా రాజ్యసభ నుంచి డాక్టర్ లక్ష్మణ్ ని తీసుకున్నారు. మరో ఏడాదిలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తన పట్టును పెంచుకోవడానికి అక్కడ మరో కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. ఆ పదవి లోక్ సభ సభ్యులలో ఒకరికి అయినా లేదా రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ కి అయినా దక్కవచ్చు.

అదే టైం లో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి అంటూ ఇప్పటిదాకా ఎవరూ లేరు. 2018 మార్చిలో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత నాలుగున్నరేళ్ళుగా కేంద్రంలో ఏపీకి ప్రాతినిధ్యం అన్నదే లేదు. వైసీపీకి చెందిన వారే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నా వారు కూడా బీజేపీ మిత్రులు అయితే కాదు. దాంతో ఇక్కడ ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. అయితే యూపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు ఏపీకి చెందిన వారే. కానీ కొన్ని రకాలైన సమీకరణల కారణంగా ఆయనకు అవకాశం లేదు.

అయితే బీజేపీ ఈసారి కొత్త ఎత్తుగడతో ఏపీలో వెళ్తోంది. తన పార్టీని విస్తరించుకోవడానికి కూడా మంత్రి పదవులను ఎర వేయాలని చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి 22 మంది ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యులు చూసినా 11 మంది ఉన్నారు. వీరిలో బలమైన వారు, సామాజికపరంగా రాజకీయంగా ఆర్ధికంగా ధీటైన వారు కనుక తమ వైపునకు వచ్చి కమలం కండువా కప్పుకుంటే వారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు.

అలాంటి వారు ఉంటే వెతికిపెట్టమని బీజేపీ పెద్దలు తమ వారికి పురమాయించారన్న వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వార్త అయితే గుప్పుమంటోంది. విజయవాడ నుంచి టీడీపీ తరఫున గెలిచిన కేశినేని నాని పార్టీ మారుతారు అన్నదే ఆ లేటెస్ట్ న్యూస్. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదిస్తున్నారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారుట.


ఈ నేపధ్యంలో ఆయన ఢిల్లీలోని ఏపీ బీజేపీ సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ ఇంటికి వెళ్ళడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. అక్కడ జరిగిన వినాయకచవితి వేడుకలకు టీడీపీ ఎంపీ గారు వెళ్లారు అని బయటకు ప్రచారం అయినప్పటికీ రాజకీయంగానే చర్చించారు అని అంటున్నారు. తెలుగుదేశంతో నానికి ఉక్కబోతగా ఉంది అంటున్నారు. తన తమ్ముడికే టికెట్ ఇస్తారని కూడా ఆయన భావిస్తున్నారు. దాంతో ఆయన బీజేపీకి టచ్ లోకి వెళ్ళినట్లుగా చెబుతున్నారు. మరి బీజేపీ ఫిరాయించి వచ్చిన వారికి కేంద్ర మంత్రి పదవి అని ఒక ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

అదే నిజమైతే కేశినేని నాని తొందరలో ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉంటారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాల మీద బీజేపీ కన్ను వేసింది అని అంటున్నారు. ఇక్కడ నుంచి ఎవరైనా తమతో కలసి వస్తే కేంద్రంలో తీసుకోవాలని చూస్తున్నారుట. వారికి ఒక యువ ఎంపీ మీద కన్ను ఉంది అంటున్నారు. అయితే ఆయన పార్టీ మారే మనిషి కారని అంటున్నారు. దాంతో బలమైన సామాజిక వర్గాలు, బీసీల నుంచి ఎవరైనా వస్తే చాలు ఏపీకి రెండు క్యాబినెట్ బెర్తులు అంటూ బీజేపీ నుంచి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందో రాబోయే పరిణామాలను బట్టి విశ్లెషించుకోవాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.