Begin typing your search above and press return to search.

టీడీపీకి బ్యాడ్ సీటు... కోటం రెడ్డి లక్ తెస్తాడా...?

By:  Tupaki Desk   |   1 Feb 2023 7:12 PM GMT
టీడీపీకి బ్యాడ్ సీటు... కోటం రెడ్డి లక్ తెస్తాడా...?
X
నెల్లూరు రూరల్ జిల్లా 2009లో ఏర్పడింది. అసెంబ్లీ పునర్విభజనతో నెల్లూరు సిటీ, రూరల్ గా మారింది. అలా మార్చిన తరువాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గెలిచింది. అప్పట్లో ఆనం వివేకానంద రెడ్డి ఈ సీటు నుంచి గెలిచి నెల్లూరు రూరల్ కి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది.

ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటులో మొదటి సారి వైసీపీ విజయం సాధించింది. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నాడు విజయఢంకా మోగించారు. ఆయన వైఎస్సార్ ఫ్యామిలీ వీరాభిమానిగా ఉన్నారు. అలా ఆయన వైసీపీలో జగన్ని అనుసరించారు. 2014లో ఆయనకు సీటు దక్కడంతో గెలిచి చూపించారు. అయిదేళ్ళ పాటు ఆయన విపక్షంలో ఉంటూ చురుకైన పాత్ర పోషించారు.

అదే విధంగా 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచిన జిల్లాలలో నెల్లూరు ఒకటి. అలా ఆ సీటు నుంచి కోటం రెడ్డి ద్వితీయ విఘ్నం లేకుండా గెలిచి సత్తా చాటారు. చిత్రమేంటి అంటే 2014లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 25,653 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని ఓడించారు. కానీ జగన్ వేవ్ లో మాత్రం ఆయన మెజారిటీ మూడు వేలు తగ్గింది.

ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి అబ్దుల్ అజీజ్ మీద 22,776 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే నెల్లూరు రూరల్ జిల్లాలో 2009 నుంచి చూసుకుంటే తెలుగుదేశం పోటీ చేయలేదు. పొత్తులలో భాగంగా సీపీఎం కి ఈ సీటు ఇచ్చింది. దాంతో తెలుగుదెశం పార్టీ బలపరచిన సీపీఎం ఇక్కడ మూడవ ప్లేస్ లోకి వెళ్ళింది. ఆనం వివేకానందరెడ్డికి ఢీ కొట్టి గెలుపు తీరం దాకా వచ్చింది ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆనం విజయకుమార్ రెడ్డి.

అలా తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఓట్ల తేడాతో ఈ సీటు దక్కించుకుంది. కానీ టీడీపీ 2014 నుంచి ఇరవై వేలకు తక్కువ కాకుండా ఓడిపోతూ వస్తోంది. ఇక చూస్తే వైసీపీకి నెల్లూరు రూరల్ సీటులో మంచి బేస్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్ లో వీక్ గా ఉందని భావిస్తున్నారు.

దాంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయినా తమ ఓటు బ్యాంక్ తో మరోసారి విజయం సాధించడం ఖాయమని లెక్క వేసుకుంటోంది. ఇదిలా ఉండగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీ నుంచి ప్రత్యర్ధిగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని చూస్తోందని టాక్. ఆయన అంగబలం అర్ధబలం దండీగా ఉన్న నేత కావడంతో మరోసారి నెల్లూరు రూరల్ లో వైసీపీకి విజయం అందిస్తారు అని నమ్ముతోంది.

ఇంకో వైపు చూస్తే ఆదాలకు మంత్రి పదవి కావాలి. ఆయన గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉంటూ వచ్చారు. ఆయనకు మంత్రి పదవి కోసం ఈసారి పోటీకి గట్టిగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక కోటం రెడ్డికి పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా మంచి పట్టుంది. అది తెలుగుదేశానికి లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అదే విధంగా టీడీపీ గెలిస్తే కోటం రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందని ప్రచారం సాగుతోంది.

ఈ నేపధ్యంలో చూస్తే ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా మంత్రి అవుతారు అనే అంటున్నారు. మొత్తానికి కోటం రెడ్డి ఆదాల తలపడితే ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటు కూడా హాట్ ఫేవరేట్ గా ఇపుడు మారబోతోంది అని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.