Begin typing your search above and press return to search.

కేసీఆర్ బద్ద శత్రువుతో మల్లారెడ్డి మంత్రాంగం..

By:  Tupaki Desk   |   25 July 2022 5:52 PM GMT
కేసీఆర్ బద్ద శత్రువుతో మల్లారెడ్డి మంత్రాంగం..
X
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి.. మంత్రి పదవి ఊడగొట్టించి.. కబ్జా ఆరోపణలు చేసి.. భూములపై విచారణ జరిపి.. హుజూరాబాద్ లో ఓడించడానికి కోట్లు కుమ్మరించినా సరే.. ఈటల రాజేందర్ ఓడలేదు. కేసీఆర్ ఎంత పంతపట్టినా సరే ఈటలనే నిలిచి గెలిచాడు. పైగా తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఏకు మేకై నిలిచాడు. ఏకంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ను ఓడించడానికి రెడీ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బోనాల సంబరాలు జరుగుతున్నాయి. దీంతో పాత పరిచయాలు మళ్లీ చిగురిస్తున్నాయి. తాజాగా లాల్ దర్వాజ బోనాల సందర్భంగా బంగారు బోనాలతో పట్టువస్త్రాలతో మంత్రులు, క్రీడాకారులు, నేతలు, హాజరై అమ్మవారికి సమర్పించారు. అయితే బోనాల సందర్భంగా ఓ అరుదైన సన్నివేశం చర్చకు దారితీస్తోంది.

తెలంగాణ ఉద్యమకారుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆయన బీజేపీ పార్టీలో చేరి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటారు.

ఏ నిమిషంలో అయినా సరే విమర్శనాస్త్రాలతో వార్ చేస్తూనే ఉంటారు.అయితే నిన్న లాల్ దర్వాజ బోనాల పండుగ నేపథ్యంలో ఈటల రాజేందర్ సికింద్రాబాద్ ఏడుగుళ్ల దేవాలయంలో జరిగిన బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అప్పటికే అక్కడ పూజలు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఈటలను చూసిన మల్లారెడ్డి ఈటల వద్దకు వెళ్లారు.

ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు నవ్వుల వర్షం కురిపించారు. ఈటల రెండు చేతులు జోడించి నమస్తే పెడితే మల్లారెడ్డి చాలులే అన్నట్లు చేతులు పట్టుకొని ఈటలను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఆనందంతో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అన్నట్లు పలకరించుకున్నారు.

ఇదంతా చూసిన బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులకు ఈ పరిణామం అర్థం కాలేదు. షాక్ లో అలా ఈటలను, మంత్రి మల్లారెడ్డిని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈటల అంటేనే ఒంటికాలిపై లేచి మండిపడే కేసీఆర్.. ఈ అనుకోని సహించని కలయికను ఎలా జీర్ణించుకుంటాడో చూడాలి. ఈటల అంటేనే పడని కేసీఆర్.. అదే ఈటలతో రాసుకుపూసుకు తిరిగిన మల్లారెడ్డిని సహిస్తాడా? ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.