Begin typing your search above and press return to search.

పదవి దక్కింది గురూ : విష్ణు చక్రం తిప్పుతారా... ?

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:36 PM GMT
పదవి దక్కింది గురూ :  విష్ణు చక్రం తిప్పుతారా... ?
X
ఆయన సీనియర్ నేత. వైఎస్సార్ టైమ్ లో 2009 ఎన్నికల్లో గెలిచి విజయవాడలో కీలక నేతగా గుర్తింపు పొందారు. ఆయన్ని విజయవాడ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ గా వైఎస్సార్ నియమించారు. ఆ తరువాత విష్ణు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి కేవలం పాతికంటే పాతిక ఓట్ల తేడాతో టీడీపీ మీద విజయం సాధించారు. ఇక చూస్తే వైసీపీలో బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు.

పైగా విష్ణు సీనియర్ నేత. వైఎస్సార్ కాలం నుంచి ఆ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉన్నారు. దాంతో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ తొలి దఫాలో రాలేదు, మలి దఫాలో అసలు ఆయన ఊసే లేదు. ఈ పరిణామాల నేపధ్యంలో విష్ణు కొంత ఫీల్ అయ్యారని అంటున్నారు. ఇక అది కాస్తా బాగా పెరిగి తీవ్ర అసంతృప్తికి దారితీసింది అని కూడా చెబుతున్నారు.

వైసీపీకి విజయవాడ నడిబొడ్డున నోరున్న నేతల అవసరం చాలా ఉంది. నిత్యం మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడే నేతలు ఉన్నారు. అందులో విష్ణు కూడా ఒకరు. ఆయన చాలా నెలలుగా పెదవికి ప్లాస్టర్ పెట్టుకుని నోరు విప్పడంలేదు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆరాతీస్తే ఏ పదవీ దక్కలేదన్న బాధ ఆయనలో ఉందిట. దాన్ని గుర్తించిన అధినాయకత్వం లేటెస్ట్ గా విష్ణుని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించింది.

ఈ పదవి క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగినది. రెండేళ్ల పాటు ఈ పదవిలో విష్ణు కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే సడెన్ గా ఇంతటి కీలకమైన పదవి విష్ణుని వరించడానికి రాజకీయ కారణాలే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో బీజేపీ సౌండ్ బాగా పెంచింది. ప్రత్యేకించి హిందూత్వం మీద ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. దాంతో బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న విష్ణు కానీ కోన రఘుపతి కానీ నోరు విప్పాల్సి వుంది.

అయితే కోన రఘుపతి గట్టిగానే బీజేపీని తగులుకున్నారు. ఆ తరువాత విష్ణు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వినాయ‌కచవితి సంబరాలను బీజేపీ రాజకీయం చేయలని చూసింది అంటున్నారు. ఈ నేపధ్యంలో విష్ణు మరింత దూకుడుగా ఉండాలన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ సెంట్రల్ లో టీడీపీ సీనియర్ నేత బోండా ఉమను నిలువరించాలన్నా ఆయనకు పదవి ఇచ్చి సౌండ్ పెంచాలని అధినాయకత్వం డిసైడ్ అయింది అంటున్నారు.

అలాగే విజయవాడలో పెద్ద సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గాన్ని కూడా తమ వైపునకు తిప్పుకోవాలన్న ప్లాన్ వైసీపీకి ఉంది అంటున్నారు. ఇంకో వైపు విజయవాడలో కూడా వైసీపీకి ఇపుడు నోరున్న నేతలు అవసరం పడుతున్నారు. వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విష్ణుకు ఈ పదవి ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా విష్ణుకు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఆయన తనకు ఆ పదవి ఇష్టం లేనట్లుగానే కొన్నాళ్ళు బలవంతంగా కొనసాగారు. ఇపుడు ఇచ్చిన పదవి కీలకం కావడంతో విష్ణు విజృంభిస్తారా. వీర విహారం చేస్తారా విష్ణు చక్రం తిప్పుతారా అన్నదే వైసీపీలో చర్చగా ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.