Begin typing your search above and press return to search.

'గ‌డ‌ప‌గడ‌ప‌'లో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్క‌య్యారే!

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:14 PM GMT
గ‌డ‌ప‌గడ‌ప‌లో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్క‌య్యారే!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `గ‌డ‌ప‌గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం` కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి మించి అన్న‌ట్టుగా ఆ పార్టీ సొంత నాయ‌కుల నుంచే ఎమ్మెల్యేల‌కు చేదు అనుభవం ఎదుర‌వుతోంది. క‌ర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడప కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. ఇంటి పన్ను చెల్లించడంపై ఎమ్మెల్యేను ఓ వైసీపీ కార్య‌క‌ర్త ప్రశ్నించాడు. పన్నులు చెల్లిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని నిలదీశాడు.

కర్నూలు జిల్లా ఆదోనిలో 'గడప గడపకు' కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వివరించారు.

చిన్న గుడిసెకు రూ.1600 ఇంటి పన్ను వ‌స్తోంద‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌, స్థానిక వార్డు మెంబ‌రు శ్రీనివాస్.. ఎమ్మెల్యేను ప్రశ్నించారు.దీనికి ఎమ్మెల్యే `సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా` అని ఎదురు ప్ర‌శ్నించారు. అయితే... తాము కట్టిన పన్నుల వల్లే కదా పథకాలు ఇస్తున్నారని సమాధానం ఇచ్చాడు.

అంతేకాదు, తాము పార్టీ త‌ర‌పున ప్ర‌చారానికి వెళ్తే ఇంటి, చెత్త పన్ను తగ్గించాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నార‌ని చెప్పాడు. అయితే, ఈ విష‌యం పార్టీ అధినేత‌తో మాట్లాడాల‌ని, త‌న‌కు చెబితే ఏం జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు.. తాను అందుబాటులో ఉండ‌డ‌న్న విష‌యంపై ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్ మాట్లాడుతూ.. తాను అందుబాటులో ఉన్నా లేక‌పోయినా ఒరిగేదేం లేద‌ని రుసరుస‌లాడారు. అయితే, ఈ ప్ర‌శ్న‌లు సంధించిన వ్య‌క్తి పార్టీ కార్య‌క‌ర్త అని ఎమ్మెల్యేకుతెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత‌.. నువ్వే ఇలా ప్ర‌శ్నించి మీడియాలో హైలెట్‌కావాల‌ని అనుకుంటున్నావా? అని నిల‌దీయ‌డం విశేషం.

ఇక‌, అన‌కాప‌ల్లిలో జ‌రిగిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మన ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబురాజుకు సొంత పార్టీ నేత‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ‌ర్గం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసింది. అచ్చుతాపురం మండ‌లం, దొప్ప‌ర్ల‌లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజుకు మంత్రి వ‌ర్గం వ్య‌తిరేకంగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ప‌రిణామాల‌పై రాజు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామ‌ని కూడా ఆయ‌న చెప్ప‌డం కొస‌మెరుపు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.