Begin typing your search above and press return to search.

నాది నిజ‌మైన కాంగ్రెస్ ర‌క్తం: రాజ‌గోపాల్ ప్ర‌క‌ట‌న‌.. రాజీనామాకే మొగ్గు

By:  Tupaki Desk   |   25 July 2022 2:30 PM GMT
నాది నిజ‌మైన కాంగ్రెస్ ర‌క్తం:  రాజ‌గోపాల్ ప్ర‌క‌ట‌న‌.. రాజీనామాకే మొగ్గు
X
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చాలా స్పష్టంగా ఉన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ నేతలతో ఆయన కలిసి రాలేదు. అలాగ‌ని ఆ పార్టీ నుంచి బయటకు పోలేదు. అయితే తాజాగా కేంద్రమంత్రి అమిత్‌షా ఒత్తిడి నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి ఆగస్టులో తమ నాయకుడు ఒక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం కూడా ఊపందుకుంది.

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉన్నా.. ఆయనను వదులుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయనతో రాయబారం నడిపేందుకు దూతగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పంపారు. భట్టితో భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కన్ఫ్యూజన్‌లో లేనని, ఫుల్ క్లారిటీతో ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ బలవంతుడని, ఆయనను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌ని ఎదుర్కొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

పార్టీ మారొద్దని భట్టి విక్రమార్క సూచించారని, పార్టీలో తనకు ఇంతలా ఇబ్బంది ఉన్నా.. ఎందుకు మాట్లాడట్లేదని భట్టిని ప్రశ్నించానని తెలిపారు. కొత్తవాళ్లు వచ్చి పార్టీలో పదవులు చేపడితే ఇబ్బందిగా ఉందన్నారు. తనది నిజమైన కాంగ్రెస్ రక్తమని ప్రకటించారు. నిజమైన కాంగ్రెస్ నేతలకు పార్టీలో గౌరవం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు బావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెంచింది. రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయమని, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది.

గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ కొనసాగుతోంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మద్య మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెనువెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్‌ను కాంగ్రెస్ దువ్వుతుండ‌డం గ‌మ‌నార్హం.