Begin typing your search above and press return to search.

ముద్రగడ ముగ్గులోకి దిగాల్సిందేనా....?

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:30 PM GMT
ముద్రగడ ముగ్గులోకి దిగాల్సిందేనా....?
X
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం సర్దుబాట్లు ఏర్పాట్లూ ముందస్తుగా జరిగిపోతున్నాయి. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ఎపుడు అంటే షెద్యూల్ ప్రకారం 2024లో అని చెబుతున్నా ఎవరి అనుమానాలు వారికి బాగానే పీకుతున్నాయి. దాంతో ఎందుకైనా మంచిదని ముందస్తుగా సిద్ధమైపోతున్నారు. ఇక ఏపీలో విపక్షం జోరు మామూలుగా లేదు. తెలుగుదేశం ఆరు నూరు అయినా వచ్చే ఎన్నికల తరువాత అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకోసం గతంలో జరిగిన తప్పులను చేయకుండా జాగ్రత్త పడుతోంది. అంటే పొత్తులు లేకుండా ఒంటరిగా దిగడం అన్నది తెలుగుదేశం అసలు చేయదు.

పైగా ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా పార్టీలు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా వామపక్షాలు టీడీపీ వెంటే అంటున్నాయి. అయితే బీజేపీ లేని పక్షంలోనే అవి కలుస్తాయి. ఇక జనసేన బీజేపీ విషయం మాత్రం ఎంతకూ తెగడంలేదు. దాంతో ముందుగా జనసేన నుంచే నరుక్కు రావాలనుకున్నారో లేక రాజకీయ పరిణామాలు అలా కలసివచ్చారో తెలియదు కానీ చంద్రబాబు పరామర్శ పేరుతో విజయవాడలో పవన్ కళ్యాణ్ణి కలిసారు.

ఆ మీదట ఇద్దరు నేతలూ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, అందుకే విపక్షం అంతా ఒక్కటి కావాల్సి వస్తోందని అన్నారు. వీలైనంతవరకూ అంతా ఉమ్మడిగానే సర్కార్ వారి విధానాలను ఎండగడతామని చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. వైసీపీకి ఇది ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పార్టీ కూడా ఇదే ఊహిస్తోంది. కాబట్టి వైసీపీకి కూడా ముందస్తుగా తన ఏర్పాట్లు ఏవో చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది.

గోదావరి జిల్లాలలో కనుక టీడీపీ జనసేన కలిస్తే అధికార వైసీపీకి ఇబ్బందులు తప్పవని సర్వే నివేదికలుస్పష్టంగా ఉన్నాయి. దాంతో వైసీపీ ఇపుడు తన అమ్ముల పొదిలో నుంచి మరో అస్త్రాన్ని బయటకు తీయబోతోంది అంటున్నారు. ఆ అస్త్రమే మాజీ మంత్రి ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. నిజానికి ముద్రగడ పద్మనాభం రాజకీయాల నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఆయన కాపు ఉద్యమం నుంచి కూడా దూరం జరిగారు. అయితే ఆయనకు చంద్రబాబు మీద మంట ఉంది. బాబు తన ప్రభుత్వ పాలనలో తన మీద పెట్టిన కేసులు కానీ వేధింపులు కానీ ఆయన మరచిపోలేదని అంటారు.

ఇంకా ముందుకు వెళ్తే ముద్రగడ టీడీపీలో మంత్రిగా చేశారు. అప్పటి నుంచే బాబుతో ఆయనకు వ్యవహారం కుదిరేది కాదని అంటారు. దాంతో జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ముద్రగడ సైలెంట్ గా ఉండేవారేమో కానీ చంద్రబాబుతో కలసి వస్తే మాత్రం ఆయన జనసేన వైపు ఉండరని అంటున్నారు. అలా ఆయన న్యూట్రల్ గా ఉండిపోవాలనుకున్నా వైసీపీ ఇపుడు ఉండనీయదు అంటున్నారు. కాపు మంత్రులు అంతా ఆయన్ని ముగ్గులోకి లాగేందుకు చూస్తారు అని అంటున్నారు.

ఇపుడు గోదావరి జిల్లాలలో వైసీపీ ఈదాలన్నా రాజకీయంగా ఒడ్డుకు చేరాలన్నా ముద్రగడ వంటి పెద్ద మనిషి, బలమైన కాపు సామాజిక వర్గం నేత సాయం ఉండాల్సిందే అని అంటున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది అంటున్నారు. దాంతో ముద్రగడను తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. ముద్రగడ లాంటి వారు వైసీపీ వైపు వస్తే యూత్ కాపులు అంతా పవన్ వైపు ఉన్నా మధ్య వయస్కులు, సీనియర్లు వైసీపీ వైపు ఉంటారని ఒక అంచనా ఉందిట.

దాంతోనే కాపు మంత్రులు అంతా పవన్ని విమర్శించే నేపధ్యంలో ముద్రగడను ఒక తారకమంత్రంగా తలచుకున్నారు. ముద్రగడను నానా ఇబ్బందులు టీడీపీ సర్కార్ పెడితే ఈ పవన్ ఎక్కడ దాక్కున్నారు అని మంత్రులు గుడివాడ అమరనాధ్, కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే నిలదీస్తున్నారు. అంటే ముద్రగడను వెనకేసుకుని రావడం వెనక పక్కా వ్యూహం ఉంది అంటున్నారు.

సరే వైసీపీ ముద్రగడను తమ వైపునకు తిప్పుకోవాలనుకుంటోంది. కానీ ఆ పెద్ద మనిషి ఈ వైపునకు వస్తారా అన్నది చూడాలి. ఒక వేళ ఆయన రాకపోయినా న్యూట్రల్ గా ఉంటూ ఎంతో కొంత సాయం చేసినా తమకు గోదారిని ఈదేందుకు ఉపయోగపడుతుంది అన్నదే వైసీపీ ఆశ, ఆలోచనగా ఉందిట. మొత్తానికి పవన్ బాబు కాంబోని ఢీ కొట్టడానికి ముద్రగడను ముందుకు తెచ్చేందుకు వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.