Begin typing your search above and press return to search.

మునుగోడుకు-హైద‌రాబాద్‌కు లింకు.. నాయ‌కుల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

By:  Tupaki Desk   |   29 Oct 2022 12:30 AM GMT
మునుగోడుకు-హైద‌రాబాద్‌కు లింకు.. నాయ‌కుల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌
X
అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్న మునుగోడు ఉప‌పోరును అన్ని పార్టీలు ప్రాణ‌ప్ర‌దంగా భావిస్తున్నాయి. గెలిచి తీరాల‌నే కాంక్ష‌తోపాటు.. మ‌నుట‌యా మ‌ర‌ణించుట‌యా అన్న‌ట్టుగా పార్టీ ఈ ఉప పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారాన్ని హోరెత్తించారు. నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థులు స‌హా.. రాష్ట్ర‌స్థాయి నేతాగ‌ణం అంతా ఇక్క‌డ శిబిరాలు వేసుకుని మ‌రీ ఇంటింటికీ ప్ర‌చారం చేశారు. ఇక‌, పెద్ద‌నేత‌ల ఎంట్రీ కూడా త్వ‌ర‌లోనే జ‌రిగిపోతుంది. మ‌రో ఐదు రోజుల్లో ఈ ఉప‌పోరు ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది.

ఇదిలావుంటే.. మునుగోడు భవితవ్యంపై హైదరాబాద్ ప్ర‌భావం ప‌డుతోంది. భాగ్య‌న‌గ‌రంలో నివసిస్తున్న వారిలో చాలామందికి ఇక్క‌డ ఓట్లు ఉన్నాయి. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటముల్లో ఈ ఓట్లే కీలకంకానున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 25 వేలకుపైగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉన్న‌ట్టు పార్టీలు గుర్తించాయి. దీంతో ఆయా ఓట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా ఎలా మ‌లుచుకోవాల‌నే విష‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మునుగోడులోని ప్ర‌తి మండ‌లం నుంచి వంద‌ల సంఖ్య‌లో హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్నారు.

వీరంతా అక్క‌డ ప‌నులు, చ‌దువు, ఉపాధి కోసం వెళ్లిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మండ‌లాల వారీగా ఇప్పుడు ఈ ఓట‌ర్ల‌ జాబితా అన్ని పార్టీల నేత‌ల‌కు చేరింది. ఈ విష‌యంలో కేఏ పాల్ మ‌రింత ముందున్నారు. ఆయ‌న స్వ‌యంగా హైద‌రాబాద్ వెళ్లేందుకు.. మునుగోడు వాసులు నివ‌సిస్తున్న చోట కూడా ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రధాన పార్టీలు గ్రామాలవారీగా హైదరాబాద్‌లో నివసించే ఓటర్ల వివరాల జాబితా సిద్ధం చేశాయి. ఓటర్ల ఫోన్‌ నంబర్లు, అడ్ర్‌స్‌లు సేకరించాయి. తమ పార్టీకే ఓటు వేయించేలా చూసే బాధ్యతను ఆయా గ్రామాలకు చెందిన నేతలకు అప్పగించాయి. వారు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో దిగి నిత్యం ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. ఏ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు సంప్రదించేలా ఏర్పాటు చేయ‌డం మ‌రి విశేషం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మండ‌లాల వారీగా చూస్తే..

+ మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 27 వేల 265.

+ కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్‌ మండలంలోని తేరట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2 వేల 211 ఓట్లు ఉండగా... ఇందులో 520 మంది ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు.

+ మునుగోడు మండలంలోని కల్వకుంట్ల, కొంపల్లి గ్రామాల్లో సుమారు 3 వేల ఓటర్లు ఉండగా అందులో 500 పైచిలుకు ఓటర్లు భాగ్యనగరంలోనే ఉన్నారు.

+ ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లలో 200 నుంచి 600 మంది ఓటర్లు హైదరాబాద్‌లో ఉన్నట్లు పార్టీలు గుర్తించాయి. హైదరాబాద్‌లో నివాసం ఉండే మునుగోడు నియోజకవర్గ ఓటర్లు... ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.