Begin typing your search above and press return to search.

మునుగోడు ఎఫెక్ట్‌: టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏం చేసిందంటే!

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:13 PM GMT
మునుగోడు ఎఫెక్ట్‌:  టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏం చేసిందంటే!
X
ప్ర‌స్తుతం మునుగోడు ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. ముఖ్యంగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి. కేవలం ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్న వారికే వేతనాలు అందడం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉప ఎన్నికలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు పొందేందుకు ఒకటో తేదీన వేతనాలు అందజేసిందని చర్చించుకుంటున్నారు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ఒకటో తేదీన ఠంచనుగా వేతనాలు అందేవి. మూడేళ్లుగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు  ఉద్యోగులకు వేతనాలు అందిస్తోంది. రోజుకో రెండు జిల్లాల చొప్పున వేతనాలు అందుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మొదటి వారంలో వేతనాలు పడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లాల్లో 10వ తేదీ తర్వాత అందుతున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఉద్యోగులకు నవంబరు ఒకటో తేదీన వేతనాలు అందాయి.

తమ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయినట్టు సెల్‌ఫోన్లలో సమాచారం రావడంతో ఇరు జిల్లాల్లోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. వేతనాలు ఏ రోజు వేస్తారో..? అని ఎదురుచూస్తున్న వారికి ఒకటో తేదీనే ఖాతాల్లో పడిపోవడంతో, ఉద్యోగులంతా ఒకటో తారీఖు వేతనాలు రాక ఎన్నేళ్లు అయిందోనని చర్చించుకుంటున్నారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

పలు జిల్లాలకు చెందిన ఉద్యోగులు యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ఫోన్లు చేసి వేతనాలు ఒకటో తేదీనే పడ్డాయా? అంటూ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పలు పెండింగ్‌ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయగా, ఇప్పటికే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులతో పాటు, సంక్షేమ పథకాలకు చకచకా నిధులు మంజూరు చేస్తోంది.

ఉప ఎన్నికతో నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పెండింగ్‌ నిధులన్నీ విడుదలయ్యాయి. దీంతో ఎన్నిక‌లు వ‌స్తేనే నిధులు, విధులు గుర్తుకు వ‌స్తాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.