Begin typing your search above and press return to search.

కోమ‌టి రెడ్డికి మునుగోడు దెబ్బ భారీగా త‌గిలేట్టుందే!

By:  Tupaki Desk   |   20 Sep 2022 3:30 AM GMT
కోమ‌టి రెడ్డికి మునుగోడు దెబ్బ భారీగా త‌గిలేట్టుందే!
X
రాజ‌కీయాల్లో ఉన్నా.. ఎక్క‌డ ఉన్నా.. కాలం అనేది క‌లిసి రావాలి. ఈ విష‌యంలో అంద‌రూ స‌మానులే. ముఖ్యంగా రాజ‌కీయా ల్లో ఉన్న‌వారికి స‌మ‌యంతోపాటు.. కాలం కూడా క‌లిసిరావాలి. అయితే.. త‌న‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంద‌ని భావించిన‌.. ఫైర్ బ్రాండ్ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి ప్ర‌స్తుతం కాలం ఏమాత్రం కూడా క‌ల‌సిరావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఆయ‌నకు `మ‌న‌` అనుకున్న నాయ‌కులే దూర‌మ‌వుతున్నార‌ట‌. ఎందుకంటే.. గ‌తంలో కాంగ్రెస్‌ను వ‌దిలేప్పుడే.. స్తానికంగా ఉన్న చాలా మంది నాయ‌కులు పార్టీనివీడొద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు.

అయినా.. కోమ‌టిరెడ్డి.. తాను ప‌ట్టిన కుందేటికి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి.. కాంగ్రెస్‌ప దుమ్ముపోసి మ‌రీ.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌కు స‌హ‌క‌రించేందుకు కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా ముందుకు రాని, రాలేనిప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన‌ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీకి, శాసనసభ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయ‌న చేరేట‌ప్పుడు త‌న‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ‌కులంతా స‌హ‌క‌రిస్తామ‌న్నార‌ని, పార్టీలో చేరతామన్నారనే భరోసాను అమిత్ షాకు ఇచ్చారు.

కానీ, వాస్త‌వానికి.. చాలా మంది నాయ‌కులు కాంగ్రెస్‌ను వీడి వెళ్లొద్ద‌ని సూచించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి.. వీడియోలుకూడా వ‌చ్చాయి. కానీ, రాజ‌గోపాల్ మాత్రం అంద‌రూ త‌న వెంట ఎందుకు రారులే అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ అధిష్టానానికి కూడా హామీలు గుప్పించారు. దీంతో రాజ‌గోపాల్‌కు వెంట‌నే టికెట్ ప్ర‌క‌టించారు. తీరా ఇప్పుడు గ్రౌండ్ లెవ‌ల్‌కు వెళితే ఆయన‌కు మ‌న అనుకున్న‌ నాయ‌కుల్లో ఒకరిద్దరు మినహా ఇతరులంతా బీజేపీలో చేర‌డానికి నిరాక‌రిస్తున్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతామని చెప్పినట్లు సమాచారం. దీంతో రాజ‌గోపాల్‌రెడ్డి ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరారు.

ఉప ఎన్నిక షెడ్యూల్ ప్ర‌క‌టిస్తే కోమ‌టిరెడ్డి నామినేష‌న్ వేస్తారు.. గెలుపు బీజేపీదే అనుకుంటున్న తరుణంలో వలసలన్నీ ఆగిపోవడంతో అమిత్ షా రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవ‌ల‌.. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌.. అమిత్‌షా.. మునుగోడుపై ప్ర‌త్యేకంగా నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఇక్క‌డ గెలుపు అవ‌కాశంపైనా.. నాయ‌కుల ప్ర‌య‌త్నాల‌పైనా.. ఐక్య‌త పైనా.. ఆయ‌న దృష్టి పెట్టారు. అయితే.. పార్టీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో జ‌రుగుతున్న లోపాల‌ను గ‌మ‌నించి.. ఆయ‌న ఫైర్ అయిన‌ట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య త్రిముఖ పోరు జ‌రిగితే బీజేపీ గెలుపు క‌ష్ట‌మ‌ని, అలా కాకుండా టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్యే ముఖాముఖి పోరు జ‌రిగితే బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని, హుజూరాబాద్‌లో కూడా ఇదే జ‌రిగింద‌ని చ‌ర్చ జ‌రిగింది. మునుగోడులో కూడా గెలుపు అనుమానంలో పడటంతోపాటు వ‌ల‌స‌లను ప్రోత్స‌హించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారంటూ నేత‌ల‌పై షా మండిప‌డ్డారట‌. ప్ర‌తి గ్రామంలో త్రిస‌భ్య క‌మిటీని వేసి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆదేశించారు. షెడ్యూల్ ప్ర‌క‌టించేలోగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను బీజేపీలోకి చేర్పించే కార్యక్రమం ముమ్మరమవ్వాలని సూచనలు, సలహాలు ఇచ్చారట‌. కానీ, క్షేత్ర‌స్థాయిలో బీజేపీ అంటే.. హిందూత్వ పార్టీ అని.. దీనిలో కి వెళ్తే.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతామ‌నే అభిప్రాయం.. ఇత‌ర నాయ‌కుల‌కు ఉంది. దీంతో కోమ‌టిరెడ్డి అయినా.. మ‌రో నేతైనా.. పార్టీ మారేది లేద‌ని.. వారు స్ప‌స్టం చేస్తున్నార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.