Begin typing your search above and press return to search.

కుర్చీయే పరమావధిగా.... నితీష్ పిల్లిమొగ్గలెన్నో...?

By:  Tupaki Desk   |   10 Aug 2022 1:30 AM GMT
కుర్చీయే పరమావధిగా.... నితీష్ పిల్లిమొగ్గలెన్నో...?
X
దేశంలో నీతి నిజాయతీ కలిగిన రాజకీయ నాయకులు ఈ రోజు వేళ్ళ మీద కూడా లెక్కేసే స్థితిలో లేరు. అంత శ్రమ మీకు అవసరం లేదు అని జాతి జనులకు వారే తమ చేష్టల ద్వారా చెబుతున్నారు. ఇక వాజ్ పేయ్ అద్వానీ తరం కాదిపుడు. మోడీ షా జమానా నడుస్తోంది. అయినా నిష్టగా నియమంగా ఉన్న వారు కొందరు ఉన్నారు. వారిలో అగ్ర భాగాన ఉన్న వారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన మీద ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు.

ఆయన రాజకీయ ప్రవేశం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి ని మహానుభావుల ప్రేరణతో జరిగింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నితీష్ ది వంక పెట్టలేని వ్యక్తిత్వం. ఆయన బీహార్ కి సుదీర్ఘ కాలం సీఎం గా ఉన్నారు. ఈ టెర్మ్ కూడా పూర్తి చేసుకుంటే రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన వారు అవుతారు.

ఇక నితీష్ ని ఎంతగానో మెచ్చుకునేవారు అటల్ బిహారీ వాజ్ పేయ్. ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకుని సమర్ధుడైన నేత అని అనేక సార్లు కొనియాడారు. వాజ్ పేయ్ ప్రధాని గా ఉండగా ఫస్ట్ టైమ్ 2003లో నితీష్ బీహార్ సీఎం అయ్యారు. అయితే మెజారిటీ సరిపోక వారం రోజులకే గద్దె దిగిపోయారు. ఆ తరువాత 2005లో సీఎం అయ్యారు. అది లగాయితూ ఈ రోజు దాకా మరొకరికి చాన్స్ ఇవ్వకుండా ఆయనే పాలిస్తున్నారు.

అయితే ఈ మధ్యలో నితీష్ ఎన్నో ఫీట్లు చేశారు. ఎన్నో జంపింగులూ చేశారు. ఆయన బీజేపీతో కలసి 2005, 2010 లల్లో సీఎం అయ్యారు. 2015లో మాత్రం ఆర్జేడీతో జట్టు కట్టారు. కాంగ్రెస్ తో చెలిమి చేశారు. అలా నితీష్ ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణం చేశారు. అయితే రెండేళ్ళు తిరగకుండానే లాలూ తనయుడు తేజస్వి యాదవ్ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయని కారణం చెప్పి ఆ కూటమికి బై బై అన్నారు. ఇక బీజేపీతో చేతులు కలిపి తన పదవిని మరో మూడేళ్ళ పాటు కాపాడుకున్నారు.

ఇక 2020లో బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేశారు. కేవలం 45 సీట్లు వచ్చినా బీజేపీకి 77 సీట్లు దక్కినా నితీష్ నే ముఖ్యమంత్రిని చేశారు. రెండేళ్ళు గట్టిగా గడవకుండానే మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్ వైపుగా ఆయన మళ్ళిపోయారు. అసలు నితీష్ రాజకీయం చూస్తే సమతా పార్టీ, జనతాదళ్, జనతా పార్టీ, జేడీయూ ఇలా చాలా పార్టీల చుట్టూ తిరిగింది. మంచి పరిపాలకుడు, నిజాయతీపరుడు. కానీ ఆయన కుప్పిగెంతులు మాత్రం ఆయనకు తీరని మచ్చను తెస్తున్నాయి.

ఏడు పదులు దాటిన వయసులో ఆయన ఇంకా ఆపసోపాలు పడుతూ తన రాజకీయ ఇన్నింగ్స్ ని కొనసాగించడానికి తన ఇమేజ్ మీద కలంకం పూసుకుంటాను అంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఆయన లాంటి వారు కూడా ఇలా చేస్తే మా బోటి వారి సంగతి అడగవద్దు అనే తరం బయల్దేరుతుంది అనే అందరి బెంగ. నిజంగా చూస్తే, నికరంగా చెప్పుకోవల్సి వస్తే నితీష్ దేశానికి ప్రధాని కాదగినవారు.

కానీ ఆయన ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చుంటే చాలు అనుకున్నారు. అందుకే రాజకీయ జీవిత చరమాంకంలో కూడా మరో మారు పిల్లిమొగ్గ వేశారు. బహుశా ఇది చివరి పిల్లి మొగ్గ అయినా అవవచ్చు. కానీ మూడేళ్ళకు పైబడి చేతిలో అధికారం ఉన్నా కడదాకా నితీష్ సీఎం సీట్లో కూర్చోగలరా అన్నదే ఇపుడు అతి పెద్ద ప్రశ్న. వ్రతం చెడినా ఫలితం దక్కపోతే నితీష్ కుమార్ రాజకీయ నిస్సహాయుడిగానే చరిత్రపుటల్లో మిగిలిపోతారు. అంతే.