Begin typing your search above and press return to search.

పవన్ వినాల్సిన మాట : పెత్తనం ఆ పార్టీదేనట...?

By:  Tupaki Desk   |   6 May 2022 9:32 AM GMT
పవన్ వినాల్సిన మాట : పెత్తనం ఆ పార్టీదేనట...?
X
రాజకీయాల్లో ప్రతీ ప్రకటన వెనక ఎన్నో అర్ధాలు ఉంటాయి. ప్రతీ అక్షరం కూడా ఎన్నో భావాలను ద్వనిస్తుంది. అందుకే జాగ్రత్తగా వాటిని వినాలి. వాటి పరమార్ధాన్ని గ్రహించి దానికి అనువుగా వ్యూహరచన చేసుకోవాలి. ఇక విషయానికి వస్తే ముందుగా పవన్ కళ్యాణ్ జనసేన ఆధినేత హోదాలో చేసిన ఒక ప్రకటనను ముందుగా ప్రస్థావించుకుందాం.

ఆయన ఆ మధ్య పార్టీ ఆవిర్భావ సభలో గంభీరమైన ప్రకటన ఒకటి చేశారు. అన్ని పార్టీలు కలవాలి. వైసీపీని ఓడించాలి. ప్రతీ ఒక్కరూ భేషజాలు వీడాలి. అలా చేసేలా, అంతా కలిసేలా చూసే బాధ్యతను జనసేన తీసుకుంటుంది అని. దాని పరమార్ధం ఏంటి అంటే జనసేన నాయకత్వంలో అన్ని విపక్ష పార్టీలు ఏకం కావాలని. దాని మీద అనేక రకాలైన రాజకీయ విశ్లేషణలు వచ్చాయి కూడా.

ఇక హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసేనలో కరడు కట్టిన కార్యకర్తలు, కీలకమైన నాయకులు కూడా చెప్పేది అదే. ఈసారి పవనే ఏపీకి సీఎం అవుతారు. ఆయన నాయకత్వంలోనే అంతా నడుస్తారు అని. మరి దాని మీద ఇప్పటికి రెండున్నర నెలలు గడచినా మాట్లాడని టీడీపీ లేటెస్ట్ గా తన అభిప్రాయాన్ని ఆచీ తూచీ మరీ చెప్పేసింది. ఇపుడు తూర్పు గోదావరి జిల్లాలో టూర్ చేస్తున్న చంద్రబాబు తాజా ప్రకటన చూద్దాం.

ఆయన కూడా అచ్చం పవన్ కళ్యాణ్ మాదిరిగానే మాట్లాడారు. వైసీపీని ఓడించాలీ అంటే అందరూ కలవాలని కూడా బాబు కూడా గట్టిగా కోరుకున్నారు. అయితే ఇదంతా టీడీపీ నాయకత్వంలోనే జరగాలని బాబు గారు చెప్పి భలే ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఏపీలో విపక్షాలు అన్నీ ఒక గొడుగు కిందకు రావాల్సిందే. ఎందుకంటే వైసీపీ అనే అరాచక శక్తిని ఎదుర్కోవడానికి.

కామన్ ఫ్యాక్టర్, కామన్ పాయింట్ ఇక్కడ వైసీపీ. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లూ అసలు లేవు. అయితే వైసీపీని ఎదుర్కోవడానికి ఏర్పడే కూటమికి నాయకత్వం వహించేది ఎవరు అన్నదే చర్చ. జనసేన నేను ఆ బాధ్యతను తీసుకుంటారు అని మార్చి 14న చెప్పింది. కాస్తా ఆలస్యంగా అయినా టీడీపీ ఇపుడు అంటున్నది ఏంటంటే తామే విపక్ష కూటమిని నాయకత్వం వహిస్తామని.

అంటే విపక్షాలకు కోరిన సీట్లు ఇచ్చి వారిని మచ్చిక చేసుకుని కూటమిని కట్టాలన్నది టీడీపీ ఆలోచన. ఇక ఇలా ఏర్పడే కూటమికి పెద్దన్నగా టీడీపీ వ్యవహరించాలన్నది కూడా నిశ్చితాభిప్రాయం. మరి అన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్మడి శతృవు విషయంలో కూడా ఏ రకమైన విభేదాలు లేవు. కానీ పెత్తనం దగ్గరే అసలైన సమస్య వస్తుంది అంటున్నారు.

మరి పవన్ నుంచి ఈ ప్రతిపాదనకు ఏ రకమైన ప్రతిస్పందన వస్తుంది అన్నదే ఇక్కడ చూడాలి. జనసేన బాధ్యత తీసుకుంటుందా లేక టీడీపీ కే దాన్ని వదిలేసి పొత్తు పార్టీగా ఉంటుందా అన్నది కూడా ఆలోచించాలి. అదే కనుక జరిగితే జనసేనకు కొన్ని సీట్లు పొత్తులో భాగంగా కేటాయిస్తారు. రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు కూడా ఇస్తారు.

మరి పవన్ సీఎం అన్న మాట అయితే ఎక్కడా వినిపించదు. పవర్ షేరింగ్ ప్రశ్న అంతకంటే ఉత్పన్నం కాదు. మరి ఈ రకమైన పొత్తులకు జనసేన ప్రిపేర్ అవుతుందా. ఏమో. ఇది రాజకీయం ఏమైనా జరగవచ్చు. ఉమ్మడి శతృవుని ఓడించాలన్న బలమైన ఆకాంక్షతో విపక్షాలు అన్నీ టీడీపీ నాయకత్వాన కల్సినా కలవవచ్చునేమో. చూడాలి మరి.