Begin typing your search above and press return to search.

నేతాజీ మరణాన్ని ధృవీకరించే సంచలన అప్డేట్!

By:  Tupaki Desk   |   15 Aug 2022 2:35 PM GMT
నేతాజీ మరణాన్ని ధృవీకరించే సంచలన అప్డేట్!
X
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాహసాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆయన మరణం తాలూకా మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఆ మిస్టరీ తేల్చాలని దేశమంతా కోరుకుంటోంది. ఈ క్రమంలోనే దీనికి తొలి అడుగులు పడ్డాయి. నేతాజీ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి మరణాన్ని ధృవీకరించేందుకు డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమని ప్రకటించారు.

జపాన్ రాజధాని టోక్యో రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్థికలను భారత్ కు తీసుకురావాలని అనితా బోస్ కోరుతున్నారు. రెంకోజీ టెంపుల్ లో ఉన్న అస్థికలు నేతాజీవేనా? కాదా? అనే విషయంలో డీఎన్ఏ టెస్ట్ చేయాలనుకుంటే తాను అందుకు సిద్ధమని అనిత ప్రకటించారు. నేతాజీ అస్థికలు ఉండాల్సింది భారత్ లోనే అని ఆమె స్పష్టం చేశారు.

నేతాజీ జీవితాన్ని అంతటినీ భారత స్వాతంత్య్రం కోసమే అర్పించారని.. అలాంటి ఆయన అస్తికలను భారత్ కు తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయన కూతురు అనితా బోస్ కేంద్రాన్ని కోరారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన చివరి సారి తైవాన్ నుంచి బయలుదేరాక ఆయన విమాన ప్రమాదంలో మరణించారని ఎక్కువమంది భావిస్తున్నారు. విమాన ప్రమాద అనంతరం నేతాజీ అస్థికలను రెంకోజీ మందిరంలో భద్రపరిచారు. ఇప్పటివరకూ మూడు తరాల పూజారులు వీటిని సంరక్షిస్తూ వచ్చారు.

నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఆమె అక్కడ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్. 79 ఏళ్ల వయసులో ఆమె తన తండ్రి మరణం మిస్టరీని ఛేదించాలని కోరుతున్నారు. 1937లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన కార్యదర్శి అయిన ‘ఎమిలీని’ ఆస్ట్రియాలో రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అనిత 1942లో ఆస్ట్రియాలో జన్మించారు. నేతాజీ బ్రిటీష్ వారిపై పోరాటంలో భాగంగా జర్మనీ నుంచి ఆస్ట్రియాకు వెళ్లినప్పుడు అనిత వయసు కేవలం 4 నెలలు మాత్రమే.

ఇక డీఎన్ఏ టెస్టుకు తమకు అభ్యంతరం లేదని జపాన్ ప్రభుత్వంతోపాటు రెంకోజీ మందిరం పూజారులు కూడా చెప్పారని అనితా బోస్ గుర్తు చేశారు. నేతాజీ అస్థికలను భారత్ కు అప్పగించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని.. తెలిపారు.

అనిత సహా నేతాజీ కుటుంబ సభ్యులంతా తైవాన్ నుంచి నేతాజా ఎక్కడకు వెళ్లారు? ఏమైపోయారో తేల్చాలని భారత ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటికీ అలాంటి చర్యలు తీసుకోలేదు. మోడీ ప్రభుత్వం అయినా దీన్ని నిగ్గుతేలుస్తుందని ఆ వర్గాలు ఆశగా చూస్తున్నాయి.