Begin typing your search above and press return to search.

రేవంత్ కు 90 సీట్లు కొట్టే సామర్థ్యం ఉందా?

By:  Tupaki Desk   |   26 April 2023 12:09 AM IST
రేవంత్ కు 90 సీట్లు కొట్టే సామర్థ్యం ఉందా?
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రకటనల్లోనూ విశ్వాసం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు సార్లు గెలిచిన వ్యతిరేకతను అధిగమించాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని ప్లాన్ చేస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా నాయకత్వం సమస్య, కార్యకర్తలు, నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా ఉంది. అదే కాంగ్రెస్ కు ఆ కొరత లేదు. రాష్ట్రమంతటా వారికి బలం, బలగం ఉంది.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సభకు నిరుద్యోగులు పోటెత్తారు. ఏకంగా 50 లక్షల మంది నిరుద్యోగులతో కేసీఆర్ చెలగాటమాడుతున్నాడని రేవంత్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు స్పందన బాగా వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కాంగ్రెస్ పట్టుబట్టడంతోనే 80వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారని తెలిపారు. కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. ఇచ్చిన పేపర్లు లీకయ్యాయని రేవంత్ ఫైరయ్యారు.

అయితే గత పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి చీఫ్ గా నియమాకం అయిన తరువాత కేడర్లో కొంత ఉత్సాహం నెలకొంది. అధికార బీఆర్ఎస్ పై ఎదురుదాడికి పాల్పడింది రేవంత్ మాత్రమేనని కొందరు అంటున్నారు. ఈ తరుణంలో రేవంత్ తెలంగాణలోని నిరుద్యోగ, భూ సమస్యలపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు పొందుతున్నారు. అందుకే ప్రతీ చోట రేవంత్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్య తీరుస్తామని.. అందరికీ ఉద్యోగాలు ఇస్తామని.. ధరణిని రద్దు చేస్తామని హామీ ఇస్తున్నారు. ధరణిని రద్దు చేయడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ను పట్టాలెక్కించాలని ఊరు వాడా తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఆయన పాదయాత్ర రాకుండా కాంగ్రెస్ సీనియర్లు కుట్రలు చేస్తున్నారని రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే సీనియర్లకు భయపడి మాణిక్యం ఠాగూర్ వైదొలగగా థాక్రే కొత్త ఇన్ చార్జీగా వచ్చారు. అయితే ఆయన దూకుడు ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కు కారణం అవుతోంది.

రేవంత్ రెడ్డి పాదయాత్రకు జనస్పందన వెల్లువెత్తుతోంది. అందుకే తనకు తానే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో మీడియా ప్రతినిధులతో పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. తానే సీఎం అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ పై వ్యతిరేకతనే తమకు 90 సీట్లు తెచ్చిపెడుతుందని రేవంత్ రెడ్డి భరోసాగా చెబుతున్నారు.