Begin typing your search above and press return to search.

తాడేపల్లి ఓ స్వర్గం....బయట మాత్రం వర్గ పోరు

By:  Tupaki Desk   |   17 Nov 2022 2:30 AM GMT
తాడేపల్లి ఓ స్వర్గం....బయట మాత్రం వర్గ పోరు
X
అపుడెపుడో ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాధ్ తీసిన ఒక మూవీలో పాపులర్ డైలాగ్ ఉంటుంది. అది హీరోయిన్ భానుప్రియ ఊతపదంగా చిత్రమంతా వస్తుంది. అదేంటి అంటే అర్ధం చేసుకోరూ అని. ఇపుడు వైసీపీ బయట ఉన్న సీన్ ని కూడా జగన్ సారూ అర్ధం చేసుకోరూ అనే అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. వారికి వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ఉంది.

అలాగే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని సమీక్షలు చేస్తున్న పార్టీ అధినేతకు కూడా వైసీపీని మళ్ళీ పవర్ లోకి తేవాలని ఉంది. ఉండడంలో తప్పులేదు కానీ ఆయన అతి ధీమాకు పోతున్నారా అన్న చర్చ కూడా సొంత పార్టీలోనే సాగుతోంది. వైసీపీలో వర్గ పోరు ఒక రేంజిలో ఉంది. అదెలా ఉంటే ఒకే నియోజకవర్గంలో మూడు నాలుగు వర్గాలుగా పార్టీ చీలిపోయి ఉంది.

వారిలో వారే గొడవలు పడుతున్నారు. వీరంతా కలసి పనిచేయడం అంటే కష్టమే. కానీ అధినాయకత్వం దృష్టి పెట్టి అందరికీ ఒక దారికి తెచ్చి పనిచేయిస్తేనే ఎంతో కొంత సాధ్యమయ్యేది, పార్టీకి కూడా సానుకూలత వచ్చేది. ఏపీలో మొత్తానికి మొత్తం 175 సీట్లూ గెలవాలని చూస్తున్న జగన్ కి అన్ని సీట్లూ అవసరం లేదు లిట్మస్ టెస్ట్ గా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోని నగరి సీటు ఒక్కటి చాలు వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉందో తెలుసుకోవడానికి అని అంటున్నారు.

అక్కడ మినిస్టర్ రోజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె రెండు సార్లు నగరి నుంచి గెలిచారు. పైగా సినీ సెలెబ్రిటీ. అటువంటి ఆమెకే వర్గ పోరు తప్పడంలేదు. ఏకంగా రెండు మూడు వర్గాలుగా నగరి వైసీపీ చీలిపోయి ఉంది. అన్ని సీట్లు మనవే ఎందుకు గెలవమని అధినాయకత్వం సవాల్ చేస్తున్న వేళ నగరి లో మళ్ళీ రోజాకు టికెట్ ఇచ్చినా ఓడిస్తామని ప్రత్యర్ధులు సొంత పార్టీలోనే బిగ్ సౌండ్ చేస్తున్నారు.

అలా అని ఆమెకు కాకుండా టికెట్ వేరే వారికి ఇచ్చినా రోజా వర్గం సపొర్ట్ చేయదు కదా. మరి అక్కడ సంగతేంటి అన్నది హై కమాండ్ ఆలోచన చేస్తోందా అన్నదే చర్చగా ఉంది. అలాగే అనేక నియోజకవర్గాలలో పోరు అలాగే ఉంది. దానికి తోడు హై కమాండ్ సీట్లు కొత్త వారికి ఇస్తామని ఆశ పెడుతోంది. ప్రకటనలు చేస్తోంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఫైటింగ్ చేస్తూ తమకే సీటు అని చెప్పుకునే వర్గాలు కూడా రెండు మూడు తయారవుతున్నాయి. వీరిని కంట్రోల్ చేయడం లోకల్ నాయకత్వానికి సాధ్యపడదు.

ఈ వర్గ పోరుని తగ్గించాలన్నా నేతలను సముదాయించాలన్నా అది జగన్ స్థాయిలోనే జరగాలని అంటున్నారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా జిల్లా కమిటీలు వేసి వాటి మీద ప్రాంతీయ కమిటీలను వేసి ప్రతీ నియోజకవర్గానికి పరిశీలకును పెట్టి నాలుగైదు అంచెల వ్యవస్థను తీసుకువచ్చామని వైసీపీ అధినాయకత్వం అనుకోవచ్చు. కానీ ఈ నాయకులు ఎవరూ వర్గ పోరుని తీర్చే పరిస్థితుల్లో లేరు. వారి చెప్పినా కూడా అవి అసలు ఆగవు.

మరి సమీక్ష అంటే అంతా బాగుంది అని భుజాలు తామే తట్టుకుని వచ్చిన వారిని స్పీచులతో బుర్రలు నింపేసి పంపిచేయడమేనా అన్న చర్చ వస్తోంది. అదే కనుక చేస్తే రేపటి ఎన్నికల్లో సీన్ సితార్ అవుతుందని కూడా పార్టీ వారు కంగారు పడుతున్నారు. అలా కాకుండా నాయకులను దగ్గర కూర్చోబెట్టుకుని చర్చలు జరపాలని, ఎక్కడ సమస్య ఉందో అక్కడ నుంచే రిపేర్లు మొదలెడితేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఏదీ కాకుండా తాడేపల్లిలో కూర్చుని స్వర్గం లో ఉన్నామనుకుని అంతా ఓకే అనుకుంటే మాత్రం వర్గ పోరే వైసీపీకి అతి పెద్ద ప్రత్యర్ధిగా మారుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.