Begin typing your search above and press return to search.

అయ్యో అచ్చెన్నా : ఆ ఒక్క సిక్కోలుకేనా సామీ ...?

By:  Tupaki Desk   |   9 July 2022 1:30 AM GMT
అయ్యో అచ్చెన్నా : ఆ ఒక్క సిక్కోలుకేనా సామీ ...?
X
అసలే ప్రాంతీయ పార్టీ. పేరుకు జాతీయ పార్టీ అని చెప్పుకున్నా ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోయాక ఏపీలోనే అస్థిత్వం మిగిలి ఉంది. దానికి టీడీపీ సామాజిక వర్గం బలం తో పాటు సౌండ్ పార్టీలు అంతా ఇక్కడే ఉండడం, పార్టీకి తొలి ఎన్నికల్లో అధికారం దక్కడం వల్ల పోయిన చోటనే వెతుక్కోవాలన్న నానుడి మేరకు టీడీపీ ఇపుడు జనంలో పడింది. చంద్రబాబు అయితే కాలికి బలపం కట్టుకుని తెగ తిరుగుతున్నారు.

విభజన తరువాత ఏపీ లాంటి 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి సీఎం అయినా ఆయన బాధపడలేదు కానీ ఉప ప్రాంతీయ పార్టీగా టీడీపీ మిగిలిపోవడం మాత్రం తట్టుకోలేకపోయారు. అందుకే జాతీయ పార్టీగా దానికి కొత్త హంగులు అద్దారు. జాతీయ పార్టీ ఎలా అంటే ఏపీలో ఉంది, తెలంగాణాలో ఉంది అని టెక్నికల్ గా చెప్పుకోవడం జరుగుతోంది. కానీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ ఉనికి చాటుకోవాలి. ఆరు శాతం ఓట్లు గట్టిగా సార్వత్రిక ఎన్నికల్లో సాధించాలి.

ఇలా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు విడమరచి చెబుతున్నా తమది జాతీయ పార్టీ అని బాబు సహా తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. దాంతో భారీ కార్యవర్గాన్ని కూడా నియమించుకున్నారు. అలా ఏపీకి టీడీపీ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. తొలిదఫాలో కళా వెంకటరావు అయితే రెండవ దఫాలో అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ చీఫ్ అయ్యారు. సరే అచ్చెన్నాయుడు ఏపీలో కలియతిరుగుతున్నారా అంటే ఏమీ లేదు, పేరుకు ఆయన్ని అలా నిలబెట్టి ఇద్దరు బాబులే రోడ్ల మీదకు వస్తున్నారు.

పరామర్శలు చేయాలంటే చినబాబు లోకేష్ రెడీ అంటూ హైదరాబాద్ లో విమానమెక్కి ఏపీ జిల్లాలలో దిగిపోతున్నారు. పార్టీ మీటింగులు పెట్టాలీ అంటే పెదబాబు చంద్రబాబు తయారుగా ఉన్నారు. ఆయన ఏకంగా నియోజకవర్గ సమీక్షలు కూడా చేస్తున్నారు. జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు. సరే బాబుని జాతీయ ప్రెసిడెంట్ అనుకున్నా నామ్ కే వాస్తే గా అయినా ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు పక్కన ఉండాలి కదా అంటే ఆ రాజకీయ సూత్రమేదీ టీడీపీకి వర్తించడంలేదట.

దాంతో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్న ఉన్నా అంతా చంద్రబాబు మయంగానే ఉంటోంది. అచ్చెన్న తన సొంత జిల్లా సిక్కోలు గడప దాటి బయటకు వెళ్లలేకపోతున్నారు. ఆయన మాట కూడా ఎక్కడా చెల్లడంలేదు. చంద్రబాబే జాతీయ ప్రాంతీయ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మొత్తానికి మొత్తం అన్ని పాత్రలను ఒకే కాలంలో పోషించేస్తున్నారు. దీని మీద అచ్చెన్న వర్గం గుస్సా మీద ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.

ఆ మధ్యన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ నోరు జారీ పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చేశారంటున్న కామెంట్స్ తరువాతనే సీన్ ఇలా మారింది అన్న వారూ ఉన్నారు. అలా కాదు, టీడీపీలో పేరుకే ఎవరికైనా పదవులు కానీ పార్టీలో అంతా చంద్రబాబు లోకేష్ బాబులదే పెత్తనం అని అసలు కధ చెప్పేవారూ ఉన్నారు. మొత్తానికి అచ్చెన్న ఈసారి టికెట్ దక్కితే చాలు గెలిచి మరోమారు ఎమ్మెల్యే అవుదామన్న మూడ్ లో ఉన్నారని టాక్.