Begin typing your search above and press return to search.

మూడు రోజుల పోరాటమేనా... వెన్నుపోటు ఘాటుతో రివర్స్

By:  Tupaki Desk   |   24 Sep 2022 11:30 PM GMT
మూడు రోజుల పోరాటమేనా... వెన్నుపోటు ఘాటుతో రివర్స్
X
ఆయన విశ్వ విఖ్యాత నటుడు. అంతకు మించి రాజకీయాల్లో అద్భుతాలు సృష్టించిన మేటి. అలాంటి ఎన్టీయార్ పేరుని చాలా ఈజీగా వైసీపీ సర్కార్ తప్పించేసింది. దీని మీద ఏపీలో అగ్గి రాజుకుంటుందని, అంతా తారు మారు అవుతుందని ఎవరూ భావినలేదు కానీ టీడీపీ ఈ దెబ్బకు యాక్టివ్ అయి వైసీపీ మీద ఒక్కటిగా పోరాడుతుందని అనుకున్నారు. కానీ మూడు రోజుల పోరాటంగానే ఇంత పెద్ద ఇష్యూ కూడా సాగి చప్పున చల్లారిపోయింది.

నిజంగా చూస్తే ఎంతో ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయానికి ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టినా కూడా అనుకున్నంతగా టీడీపీ శ్రేణులు రియాక్ట్ కాకపోవడం పార్టీ పరంగా ఒక లోటు అయితే పార్టీలకు అతీతంగా ఎన్టీయార్ ని అభిమానించే వారు, తటస్థులు సైతం మొదట్లో ఇదేంటి అని అనుకున్నా ఆ తరువాత వైసీపీ రివర్స్ లో వెన్నుపోటు ఎపిసోడ్ ని తెర మీదకు తేవడంతో త్రాసు అటు నుంచి ఇటు వైపు మళ్ళింది.

ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న వారా ఇపుడు ఆయన గురించి మొసలి కన్నీరు కార్చేది అంటూ వైసీపీ స్టార్ట్ చేసిన రివర్స్ ఎటాక్ తో టీడీపీ డిఫెన్స్ లో పడినట్లు అయింది. ఎపుడో 27 ఏళ్ల క్రితం జరిగిన ఈ వెన్నుపోటు హెల్త్ వర్శిటీ పుణ్యమాని మళ్ళీ ముందుకు వచ్చింది. దాంతో చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా ఆయన కొడుకు ఎన్ని ట్వీట్లు చేసినా అది ఎక్కడా జనాల బుర్రలకు ఎక్కలేదు. దానికి కారణం వర్శిటీకి ఎన్టీయార్ పేరు మార్చడం కంటే పదవి లాగేయడం చివరి రోజుల్లో మానసిక క్షోభకు గురి చేయడమే పెద్ద విషయం అయింది కాబట్టి.

ఇక మూడు రోజుల తరువాత తాపీగా ఆయన కుమారుడు బాలయ్య వైసీపీని విమర్శించే క్రమంలో శునకాలు అంటూ వాడిన పదాలతో మంత్రి జోగి రమేష్ ఇవ్వాల్సినదంతా తిరిగి ఇచ్చేశారు. నాడు మీ తండ్రికి వెన్నుపోటు పొడిస్తే నవ్వులు చిందించి చంద్రబాబు పక్కన ఉన్న మీరా మాట్లాడేది అంటూ రమేష్ లాజిక్ పాయింట్ తీశారు. ఎన్టీయార్ పేరుని మారుస్తూ అసెంబ్లీలో చర్చకు పెడితే అపుడు ఎమ్మెల్యేగా సభకు రావాల్సిన బాలయ్య ఎక్కడ ఉన్నారంటూ రమేష్ ఆయన గాలి తీశేశారు. ఇదేనా తండ్రి మీద ఉన్న అభిమనాలు అంటూ ఎకసెక్కమాడారు.

మరో వైపు విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడితే కనీసం హర్షం వ్యక్తం చేయలేని బాలయ్య, టీడీపీ పెద్దలు ఇపుడు మాత్రం ట్వీట్లతో సమరానికి తయారు అవుతున్నారంటే ఎన్టీయార్ మీద ప్రేమ కంటే రాజకీయమే వారికి కావాల్సి వచ్చిందని అర్ధమవుతోంది అని రమేష్ కౌంటర్లేశారు. ఇవన్నీ పక్కన పెడితే విజయవాడ హెల్త్ వర్శిటీకి పేరు మార్పు కాదు కానీ మరోసారి ఏపీలో ఈ తరానికి కూడా తెలిసే విధంగా 1995 నాటి ఎపిసోడ్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

దాంతో అటు నారా వారు కానీ ఇటు నందమూరి వారు కానీ గట్టిగా ప్రశ్నించడానికి వీలు లేకుండా వైసీపీ చేసిందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టినా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కి ఇంతటి అవమానం జరిగినా టీడీపీ శ్రేణులు అనుకున్నంతగా స్పందించకపోవడమే ఇపుడు చర్చకు తావిస్తోంది. మరి ఇదే టీడీపీ వీక్ నెస్ అని గమనించేనా వైసీపీ దూకుడుగా తాను చేయాల్సింది చేసుకుపోయింది అన్న మాట కూడా ముందుకు వస్తోంది. మొత్తానికి బాబు ఆరాటమే కానీ పోరాటాలు ఏవీ పెద్దగా లేవనే సీన్ అయితే ఇపుడు పసుపు పార్టీలో ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.