Begin typing your search above and press return to search.

ఆ భ‌యం నాక్కావాలి అంటున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   25 Nov 2022 6:30 AM GMT
ఆ భ‌యం నాక్కావాలి అంటున్న చంద్ర‌బాబు
X
ఇటీవల క‌ర్నూలు జిల్లాల్లో త‌న ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసి వైఎస్ఆర్‌సీపీ భ‌యంతో వ‌ణికిపోతోంద‌ని  ఆ భ‌యంతోనే ఏకంగా 8 జిల్లాల‌కు ఆ పార్టీ అధ్య‌క్షుల‌ను మార్చేసింద‌ని తెలుగుదేశం పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు.  ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌ల‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  ఈ ప‌ర్య‌ట‌న అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ 8 జిల్లాల అధ్య‌క్షుల‌ను మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యం యాధృచ్చిక‌మే అయినా కేవ‌లం త‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన జనాన్ని చూసి భ‌యంతో జ‌గ‌న్ అలా చేశార‌ని చంద్ర‌బాబు తెలిపారు.

గురువారం మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆక్వా రైతుల‌తో నిర్వ‌హించిన సద‌స్సులో చంద్ర‌బాబు నాయుడు ఈ వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో  త‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాన్ని త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని చెప్పారు. ఈ స‌భ‌ల‌కు పెద్ద ఎత్తున యువ‌త‌, ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చార‌ని, ప్ర‌జా స్పంద‌న చూసి వైసీపీలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు.

వ‌చ్చే  ఎన్నిక‌ల్లో వైసీపీ 175 సీట్లు కాదు క‌దా గుండు సున్నా మాత్ర‌మే మిగులుతుంద‌ని చెప్పారు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో కూడా ఆ పార్టీకి ఓట‌మి ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడు జోస్యం చెప్పారు.  తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన ఇదేం ఖ‌ర్మ-రాష్ట్రానికి కార్య‌క్ర‌మంలో విసృతంగా చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌న్నారు. రాష్ట్రానికి అన్ని వ‌న‌రులున్నా జ‌గ‌న్ చేత‌కాని త‌నం వ‌ల్ల రాష్ట్రం అథోగ‌తి పాల‌వుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఆక్వా రంగానికి పూర్వ వైభ‌వం తీసుకొచ్చే బాధ్య‌త తాను తీసుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ప‌రిమితులు లేకుండా ఆక్వా రైతుల‌కు రూ.1.50ల‌కే యూనిట్ విద్యుత్తు ఇచ్చే బాధ్య‌త త‌న‌ద‌న్నారు. ఆక్వా రంగంలో జోన్‌, నాన్ జోన్  ప‌ద్ద‌తుల‌కు స్వ‌స్తి ప‌లుకుతామ‌న్నారు. సీడ్ ధ‌ర‌ల‌ను నియంత్రిస్తామ‌ని, నీటి ప‌న్ను, ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌కు పాత ధ‌ర‌లే వ‌ర్తింపజేస్తామ‌ని, జ‌న‌రేట‌ర్లు వాడే అవ‌స‌రం లేకుండా నాణ్య‌మైన విద్యుత్తును అందిస్తామ‌ని చెప్పారు. తెలుగుదేశం ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఈ విష‌యాల‌న్నీ పొందుప‌రుస్తామ‌ని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.